ఏపీలో కొత్త సినిమాల పైరసీ ముఠా గుట్టురట్టు..!
తెలుగు చిత్ర పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ ముఠాల ఆటకట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) దూకుడు పెంచింది. ఇటీవల విడుదలైన పలు కొత్త తెలుగు సినిమాలను థియేటర్లలో రహస్యంగా చిత్రీకరించి ఆన్లైన్లో లీక్ చేస్తున్న వ్యవహారంలో కీలక పురోగతి సాధించిన పోలీసులు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. నిందితులను 19 ఏళ్ల వయసున్న విద్యార్థులు షేక్ రిజ్వాన్, రాంపోగు అజయ్లుగా గుర్తించారు.
క్యూబ్ సినిమా టెక్నాలజీస్ నిర్వహించిన ఫోరెన్సిక్ విశ్లేషణ ఆధారంగా కర్నూలులోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్ నుంచి ‘రణబాలి’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం’, ‘ఆకాశంలో ఒక తార’ వంటి కొత్త సినిమాలు లీక్ అయినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) యాంటీ వీడియో పైరసీ సెల్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుల ఆచూకీని పసిగట్టారు. విదేశాల్లో ఉండే పైరసీ వెబ్సైట్ నిర్వాహకుల ఆదేశాల మేరకు ఈ ఇద్దరు విద్యార్థులు థియేటర్లలో క్యాం కాడర్, మొబైల్ ఫోన్ల ద్వారా సినిమాలను రికార్డు చేసి పంపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఒక్కో సినిమాను థియేటర్లో చిత్రీకరించి పంపించినందుకు నిందితులు క్రిప్టో కరెన్సీ రూపంలో రూ.20 వేల చొప్పున కమీషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా రికార్డు చేసిన సినిమాలను టెలిగ్రామ్ ఛానళ్లు, వివిధ పైరసీ వెబ్సైట్ల ద్వారా అక్రమంగా పంపిణీ చేస్తూ చిత్ర పరిశ్రమకు భారీ నష్టం కలిగిస్తున్నారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను కూడా త్వరలోనే పట్టుకుంటామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు స్పష్టం చేశారు.







