రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీ నుంచి ఫోన్ కాల్.. వేటు పడనుందా..?
కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు ఢిల్లీ అధిష్టానం గడపకు చేరింది. సొంత ప్రభుత్వ తీరును, నిధుల కేటాయింపును ప్రశ్నిస్తూ రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా చేస్తున్న విమర్శలను టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం రాజగోపాల్ రెడ్డిపై కీలక నిర్ణయం తీసుకోబోతోందా అనే చర్చ జోరుగా సాగుతోంది.
మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం దక్కకపోవడంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే వాదనలు ఉన్నాయి. అయితే తాను పదవుల కోసం కాకుండా తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లకు మాత్రమే వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి బహిరంగ వేదికలపై ఆరోపించారు. కాంట్రాక్టర్లకు రాష్ట్రాన్ని దోచిపెట్టవద్దంటూ మంత్రులకు హితవు పలకడం, ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నట్లుగా వ్యాఖ్యానించడం పార్టీలో కలకలం రేపింది.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించారు. సిద్దిపేట సభలో పరోక్షంగా స్పందిస్తూ, సొంత పార్టీలోనే కొందరు “ఎర్రి కుక్కలు కరిచినట్లుగా” మాట్లాడుతున్నారని, ఏదైనా చెడు ఉంటే చెవిలో చెప్పాలే తప్ప మైకుల్లో మాట్లాడటం సరికాదని సీఎం మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఉపయోగించిన ఈ భాషపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రాంతాల మధ్య వివక్ష చూపకూడదని, అహంకారంతో కాకుండా సంయమనంతో మాట్లాడాలని ఆయన సోషల్ మీడియా వేదికగా, మీడియా సమావేశాల్లో కౌంటర్ ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇలా బహిరంగ విమర్శలకు దిగడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోందని టీపీసీసీ భావిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించారు. క్రమశిక్షణ ముందు అందరూ సమానమేనని, సమయం వచ్చినప్పుడు అందరినీ పిలిచి మాట్లాడుతామని హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను, పూర్తి నివేదికను పీసీసీ ఇప్పటికే ఏఐసీసీకి పంపినట్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి నుంచి రాజగోపాల్ రెడ్డికి పిలుపు రావడం, తెలంగాణ కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జ్ సందీప్‌తో ఈ నెల 23న భేటీ కావాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత అధిష్టానం ముందు ప్రధానంగా మూడు మార్గాలు కనిపిస్తున్నాయి. బహిరంగంగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన కింద షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరడం.తద్వారా పార్టీలోని ఇతర అసంతృప్త నేతలకు గట్టి హెచ్చరిక పంపడం.రెండోది రాజగోపాల్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయం తీసుకుంటూ సస్పెండ్ చేసే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మూడోది గతంలోనూ మంత్రి పదవి విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడి సముదాయించారు. రాజగోపాల్ రెడ్డి నిరంతరం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూనే, కేవలం రాష్ట్ర నాయకత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. కాబట్టి, నల్గొండ జిల్లాలో ఆయనకున్న రాజకీయ బలాన్ని దృష్టిలో ఉంచుకుని, నియోజకవర్గ నిధుల విషయంలో హామీ ఇచ్చి వివాదాన్ని సద్దుమణిగేలా చేసే అవకాశం కూడా ఉంది.
మొత్తానికి ఈ నెల 23న జరిగే భేటీలో రాజగోపాల్ రెడ్డి ఇచ్చే వివరణ, అధిష్టానం చూపే స్పందనపైనే తెలంగాణ కాంగ్రెస్‌లో రాబోయే రోజుల్లో చోటుచేసుకోబోయే రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.







