స్నేహ గ్రూప్ పై ఐటీ దాడులు.. అసలేం జరిగింది?
తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న స్నేహ గ్రూప్ పై ఆదాయపు పన్ను శాఖ జరిపిన ఆకస్మిక మెరుపు దాడులు వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం 16 కీలక ప్రాంతాల్లో ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. హైదరాబాద్, విజయవాడలోని కార్పొరేట్ కార్యాలయాలతో పాటు, కొండాపూర్ కేంద్రంగా ఉన్న సంస్థ డైరెక్టర్లు రామ్ రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లో అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
స్నేహ గ్రూప్ ప్రస్థానం ఒక సాధారణ వ్యాపార విజయానికి నిదర్శనం. 1982లో ‘రామ్ రెడ్డి చికెన్ మార్కెట్’ పేరిట చిన్న స్థాయిలో మొదలైన ఈ ప్రయాణం, 1994లో ‘స్నేహ ఫామ్స్’గా రూపాంతరం చెంది అంచెలంచెలుగా విస్తరించింది. కేవలం కోళ్ల పెంపకానికే పరిమితం కాకుండా పౌల్ట్రీ బ్రీడింగ్, అత్యాధునిక చికెన్ ప్రాసెసింగ్, పశువుల దాణా తయారీ రంగాల్లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా, ‘సఫల’ బ్రాండ్ పేరుతో వంట నూనెల మార్కెట్లోనూ తనదైన ముద్ర వేసింది. తెలంగాణలో గంటకు ఏకంగా 12,000 కోళ్లను ప్రాసెస్ చేసే సామర్థ్యం గల ఆటోమేటెడ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దేశీయ పౌల్ట్రీ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం 2వేల మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో కలిసి విస్తృతమైన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ, సాధారణ వినియోగదారులకే కాకుండా భారత రక్షణ సంస్థలకు సైతం నాణ్యమైన ఫ్రోజెన్ చికెన్ సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. వ్యాపార విస్తరణలో భాగంగా 2024 ఆర్థిక సంవత్సరంలో ‘సింగ్ పౌల్ట్రీ’ని కొనుగోలు చేసి తన మార్కెట్ వాటాను మరింత పెంచుకుంది. ఈ సంస్థకున్న భారీ వృద్ధి అవకాశాలను గమనించిన జపాన్ దిగ్గజ సంస్థ ‘మిట్సుయి & కో’ సైతం స్నేహ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరచడం అప్పట్లో వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇంతటి ప్రతిష్టాత్మక నేపథ్యం ఉన్న సంస్థపై ఐటీ శాఖ దాడులు జరగడం వెనుక భారీ ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా 2024 ఆర్థిక సంవత్సరంలో జరిగిన సింగ్ పౌల్ట్రీ కొనుగోలు ప్రక్రియ, విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలు, అలాగే వేల మంది కాంట్రాక్ట్ రైతులు, దాణా సరఫరాదారులతో జరిగే నగదు లావాదేవీల లెక్కల్లో భారీగా అవకతవకలు జరిగాయన్న సమాచారంతోనే అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పౌల్ట్రీ రంగంలో సహజంగానే నగదు రూపంలో జరిగే లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని అడ్డుపెట్టుకుని ఆదాయాన్ని తక్కువ చేసి చూపించడం, లేదా అనుబంధ సంస్థల మధ్య నిధుల మళ్లింపు జరిగిందా అన్న కోణంలో ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు.
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ సంస్థల్లో ఒకటైన స్నేహ గ్రూప్‌పై ఐటీ దాడులు జరగడం ఇతర పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ సంస్థల్లోనూ గుబులు రేపుతోంది. 16 ప్రాంతాల్లో ఏకకాలంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆస్తుల పత్రాల విశ్లేషణ పూర్తయితే గానీ పన్ను ఎగవేత ఏ స్థాయిలో జరిగిందనే దానిపై స్పష్టత రాదు. ఏదేమైనా వేల కోట్ల టర్నోవర్ కలిగిన ఒక కార్పొరేట్ అగ్రి సంస్థ ఆర్థిక క్రమశిక్షణపై ఈ దాడులు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.







