రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో హస్తం దూకుడు..!
దేశవ్యాప్తంగా వరుస ఎదురుదెబ్బలతో ఢీలా పడిన కాంగ్రెస్ కు రాజస్థాన్ ఓటరు ఊరట కలిగించాడు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది.పంచాయతీ, జిల్లా పరిషత్ స్థానాల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తోంది.
మొత్తం పంచాయతీ సమితి స్థానాల్లో కాంగ్రెస్ 3,758 చోట్ల విజయం సాధించింది. అధికార బీజేపీ మాత్రం 2,213 స్థానాలను దక్కించుకుంది. జిల్లా పరిషత్ స్థానాల విషయానికి వస్తే కాంగ్రెస్ 794 స్థానాలు.. బీజేపీ 357 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ ఎన్నికలు మాజీ సీఎం, కాంగ్రెస్ అగ్రనేత అశోక్ గెహ్లాట్ కు ఊరట కలిగించినట్లు చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, నెరవేర్చని హామీలకు .. ప్రజలు ఇచ్చిన తీర్పుగా కాంగ్రెస్ అభివర్ణించింది. అధికారంలో ఉన్నవారి అహంకారాన్ని సహించరనే స్పష్టమైన సందేశాన్ని ప్రధాని మోదీకి ప్రజలు ఇచ్చారని పేర్కొంది. ఈ తీర్పు కేవలం రాజస్థాన్‌కు మాత్రమే పరిమితం కాదని.. ఇది దేశంలోని ప్రతి గ్రామం గొంతుకని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ దుష్టపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాఠోడ్ తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణకు, తమ పనితీరును మెరుగుపరచుకునేందుకు ఈ ఫలితాలు దోహదపడతాయని ఆయన చెప్పారు.







