సెనేట్ లో ట్రంప్ కు ఊరట.. వార్ పవర్స్ తీర్మానం తిరస్కరణ..!
ఇరాన్ సుదీర్ఘ యుద్ధం నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలంటూ వార్ పవర్స్ తీర్మానాన్ని సెనేట్ తిరస్కరించింది. ప్రతినిధుల సభ ఇప్పటికే ఆమోదించిన హెచ్.కాన్.రెస్ 93 తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలంగా 48, వ్యతిరేకంగా 51 ఓట్లు రావడంతో ఇది వీగిపోయింది . మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ యుద్ధ అంశంపై సెనేట్‌లో జరిగిన మొదటి ఓటింగ్ ఇదే కావడం గమనార్హం. .
ఈ తీర్మానానికి ముగ్గురు రిపబ్లికన్ సెనేటర్లు సుసాన్ కాలిన్స్, లిసా ముర్కోవ్స్కీ, రాండ్ పాల్ డెమొక్రాట్లకు అనుకూలంగా ఓటు వేయగా, డెమోక్రటిక్ పార్టీకి చెందిన జాన్ ఫెటర్మ్యాన్ దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. క్రిస్ మర్ఫీ ఓటింగ్‌కు హాజరుకాలేదు. 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ కింద ఈ యుద్ధాన్ని ముగించేందుకు సెనేట్ ఓటింగ్ నిర్వహించడం ఇది 15వ సారి.
ఇవి కూడా చదవండి
సెనేట్‌లో చర్చ సందర్భంగా డెమొక్రాట్ సెనేటర్ టామీ బాల్డ్విన్ మాట్లాడుతూ, ఈ యుద్ధం వల్ల ఇప్పటివరకు అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ము 47 బిలియన్ డాలర్లు ఖర్చయిందని,. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధిస్తే ప్రపంచ ఇంధన సరఫరాలో సగానికిపైగా దెబ్బతింటుందని హెచ్చరించారు.
ఈ ఓటింగ్‌లో తీర్మానం వీగిపోయినప్పటికీ, జనవరిలో కొలువుదీరే కొత్త కాంగ్రెస్‌లో తాము తిరిగి ఈ సమస్యను లేవనెత్తుతామని డెమోక్రటిక్ నేతలు పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్లో దూకుడు సైనిక చర్యలకు నిధులను నిరోధించని ఏ బడ్జెట్ ప్యాకేజీనైనా వ్యతిరేకిస్తామని భారత సంతతి కాంగ్రెస్‌మన్ రో ఖన్నా, యాసమిన్ అన్సారీ స్పష్టం చేశారు. డిసెంబర్ 11తో ప్రస్తుత ఫెడరల్ నిధుల గడువు ముగియనుంది.







