ప్రపంచ తెలుగు మహాసభలు–బాలలు 2026కు త్రిపుర గవర్నర్‌కు ఆహ్వానం!
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న ‘నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు–బాలలు 2026’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని పరిషత్తు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఈ మహాసభల విశేషాలను ఆయన వివరించారు.
బాలల కోసం మొట్టమొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఒక చారిత్రక ఘట్టమని డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేటి తరం బాలబాలికల్లో తెలుగు భాష, సాహిత్యం , సంస్కృతి పట్ల మక్కువను, ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 19వ తేదీ సాయంత్రం జరగనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను , ప్రతిభావంతులైన బాలబాలికలను సత్కరించాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్ అందించే స్ఫూర్తిదాయక సందేశం పిల్లలకు ఎంతో ప్రేరణనిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ కుమార్తె, ప్రముఖ గాయని కుమారి సంస్కృతి, పారిశ్రామికవేత్త కంతేటి కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







