నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ నేపథ్యంలో వేడుకలు నిర్వహించిన ఇండో అమెరికన్ సమాజం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని హ్యూస్టన్లోని ఇండో-అమెరికన్ సమాజం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఇండియా హౌస్ వేదికగా ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు ప్రవాస భారతీయ నాయకులు, భారత్ నుండి విచ్చేసిన ప్రత్యేక అతిథులు శ్రీ మురళీధరన్ కృష్ణమూర్తి, శ్రీ నైనార్ నాగేంద్రన్ ప్రసంగించారు. సునైనా పంచల్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో, స్మృతి శ్రీవాస్తవ నేతృత్వంలోని ‘స్వరసంగం స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ చిన్నారులు “వందేమాతరం” తదితర సంప్రదాయ గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో సునైనా పంచల్, సుభాష్ గుప్తా, రమేష్ భూటాడ, నైనార్ నాగేంద్రన్, డీసీ మంజునాథ్, మురళీధరన్ కృష్ణమూర్తి, రమేష్ షా, దిగంబర్ ఎస్లాంపూరే పాల్గొన్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (OFBJP), ఇండియా కల్చర్ సెంటర్ (ICC) సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలో గ్లోబల్ కశ్మీరీ పండిట్ డయాస్పోరా, విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA), ఏకల్ విద్యాలయ వంటి పలు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. మౌలిక సదుపాయాలు, డిజిటల్ పబ్లిక్ సిస్టమ్స్, ఆర్థిక సమ్మిళితత్వం, తయారీ రంగం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పెరుగుతున్న ప్రతిష్టలో మోదీ నాయకత్వాన్ని గుర్తించి అభినందించడంతో పాటు, హ్యూస్టన్లోని భారతీయ సమాజంలో సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
ఈ సందర్భంగా వక్తలందరూ ప్రధాని మోదీ కాలంలో జరిగిన అభివృద్ధి, విదేశాలతో సంబంధాలపై విస్తృతంగా మాట్లాడారు. మురళీధరన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ సందర్భంగా మోదీతో తనకున్న వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అలాగే కరోనా సమయంలో వ్యాక్సిన్లు ఇతర దేశాలకు పంపాలన్న ప్రధాని నిర్ణయాన్ని ఆయన కొనియాడారు.
ఇక.. కాన్సుల్ జనరల్ డీసీ మంజునాథ్ మాట్లాడుతూ మోదీ హయాంలో భారత్ సాధించిన ఆర్థిక, అంతర్జాతీయ పురోగతిని వివరించారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థ, తయారీ రంగంలో సంస్కరణలు, వీటి వల్ల కలిగిన లాభాలు, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పుకొచ్చారు.
ఐసీసీ చీఫ్ ట్రస్టీ హసు పటేల్ మాట్లాడుతూ 2004 లో అహ్మదాబాద్ తో సహా పలు సందర్భాలలో ప్రధాని మోదీని కలుసుకున్నానని తెలుపుతూ.. ఈ సందర్భంగా మోదీ తీసుకున్న సమర్థవంతమైన నిర్ణయాలను వివరించారు.
అలాగే రమేశ్ భూటాడ మాట్లాడుతూ… మోదీ వికసిత భారత్ కోసం దీర్ఘకాలిక దృక్పథంతో పనిచేస్తున్నారని కొనియాడారు. గతంలో కేవలం నినాదాలకే పరిమితమైన పథకాలను, నేడు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా మధ్యవర్తుల ప్రమేయం, అవినీతి లేకుండా నేరుగా పేదల ఖాతాల్లోకి చేరేలా మోదీ ప్లాన్ చేస్తున్నారని వివరించారు.
మోదీని ఒక తరానికి ఒకరు మాత్రమే జన్మించే నాయకుడిగా అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కశ్మీర్ భారత్లో అంతర్భాగమని చాటిచెప్పడాన్ని ఆయన కొనియాడారు. 1990 కశ్మీర్ అల్లర్ల బాధితుడైన ఆయన, గత ప్రభుత్వాల రక్షణ విధానాలు బలంగా ఉండి ఉంటే తాము సొంత దేశంలోనే జాతి నిర్మూలనకు గురయ్యేవారము కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, దేశీయ రక్షణ ఉత్పత్తుల పెరుగుదల, ఉగ్రవాదాన్ని యుద్ధ చర్యగా పరిగణించే నూతన విధానాన్ని వక్తలు ప్రశంసించారు.యాస్మిన్ ఉదావాలా, రాహత్ సుల్తానా తదితర ప్రతినిధులు మాట్లాడుతూ, సమ్మిళిత భారత్ పట్ల తమ గర్వాన్ని వ్యక్తం చేశారు. గుజరాత్లో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా వివరించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుజరాతీ, కశ్మీరీ పండిట్, తమిళ, ముస్లిం తదితర విభిన్న భారతీయ సమాజాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మోదీ పాతికేళ్ల ప్రజా ప్రస్థానాన్ని వేడుకగా జరుపుకున్నాయి. ప్రధానికి మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ, భారత్ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యం నిరంతరం కొనసాగాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.







