అగ్రిగోల్డ్ బాధితులకు బిగ్ అప్డేట్..!
అగ్రిగోల్డ్(Agri Gold) డిపాజిటర్లకు తెలంగాణ నేర పరిశోధన విభాగం (CID) కీలక శుభవార్త అందించింది. సుమారు రూ.447 కోట్ల అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 1.65 లక్షల మంది బాధితులకు న్యాయం చేసే దిశగా సీఐడీ ముందడుగు వేసింది. ఈ మేరకు జిల్లాలు, మండలాల వారీగా బాండ్ల వెరిఫికేషన్ షెడ్యూల్‌ను సీఐడీ డైరెక్టర్ శనివారం విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక కేంద్రాల్లో బాండ్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది.
సీఐడీ ప్రకటించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ, మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ప్రాంతాల్లో ఈ వెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు బాండ్లను పరిశీలిస్తారు. కాగా, ఈ రూ.447 కోట్ల మోసం కేసులో సీఐడీ ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
వెరిఫికేషన్‌కు హాజరయ్యే డిపాజిటర్లు తమ వద్ద ఉన్న ఒరిజినల్ అగ్రిగోల్డ్ బాండ్లు లేదా నగదు రసీదులను తప్పనిసరిగా తీసుకురావాలి. అయితే, ఒరిజినల్ బాండ్లను కేవలం పరిశీలనకు మాత్రమే చూపించాలని, అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని సీఐడీ స్పష్టం చేసింది. బాండ్ల సెల్ఫ్-అటెస్టెడ్ కలర్ జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఐఎఫ్ఎస్సీ కోడ్ కనిపించే బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ సమర్పించాలి. ఒకవేళ డిపాజిటర్ మరణించి ఉంటే నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలతో హాజరుకావచ్చని అధికారులు సూచించారు.







