ఓర్వకల్లు నుంచి ప్రపంచ మార్కెట్లోకి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్..!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో చారిత్రక మైలురాయి నమోదైంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వేదికగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ ప్లాంట్ (Beverage Plant) శనివారం అధికారికంగా ఉత్పత్తిని ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గతేడాది (2025) నవంబర్లో శంకుస్థాపన జరిగిన ఈ భారీ ప్రాజెక్ట్, రికార్డు స్థాయిలో కేవలం 12 నెలల వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించడం విశేషం. 80 ఎకరాల విస్తీర్ణంలో, 10 ప్రొడక్షన్ లైన్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రపంచ స్థాయి కర్మాగారం ద్వారా స్వదేశీ బ్రాండ్ ‘కాంపా కోలా’ (Campa Cola) తో పాటు వివిధ రకాల పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తి ప్రారంభమైంది.
ఇవి కూడా చదవండి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (Speed of Doing Business) విధానానికి ఓర్వకల్లు రిలయన్స్ ప్లాంట్ నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. తరతరాల భారతీయులకు సుపరిచితమైన కాంపా కోలా బ్రాండ్ ఇప్పుడు రాయలసీమ గడ్డపై పునర్జన్మ పొందిందని, ఓర్వకల్లులో తయారయ్యే ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లకు చేరడమే కాకుండా ప్రపంచ మార్కెట్లలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పోటీ పడనున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ భారీ ప్లాంట్ ఏర్పాటుతో రాయలసీమ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా స్థానికులకు నేరుగా 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించగా, రవాణా (లాజిస్టిక్స్), వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దక్కుతోంది. ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి లేకుండా నంద్యాల, కర్నూలు ప్రాంతాలకు చెందిన యువతీయువకులు తమ సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి పరిశ్రమలో పనిచేస్తుండటం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంపై నమ్మకంతో భారీ పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ సంస్థకు ధన్యవాదాలు తెలిపిన ఆయన, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇటువంటి పారిశ్రామిక విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.







