బీఆర్ఎస్ సర్వేల బాట… ఎందుకంటే..?
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ తన ఉనికిని, బలాన్ని తిరిగి పుంజుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని గులాబీ దళం క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకునే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం నిర్వహించే అంతర్గత సమీక్షలతో పాటు, నియోజకవర్గ స్థాయిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు సొంతంగా ప్రైవేటు ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలను అంచనా వేయడం బీఆర్ఎస్ నేతలకు అనివార్యంగా మారింది. కేవలం పార్టీ యంత్రాంగం అందించే నివేదికలపైనే ఆధారపడితే వాస్తవ పరిస్థితులు పూర్తిస్థాయిలో తెలియవనే ఉద్దేశంతో నేతలు స్వతంత్ర సర్వేల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ నియోజకవర్గాల్లో వ్యక్తిగత ఇమేజ్ ఎలా ఉంది, క్యాడర్ ఏ మేరకు క్రియాశీలంగా ఉంది, ఇతర పార్టీల బలం ఎంతవరకు పెరిగింది అనే అంశాలను శాస్త్రీయంగా తెలుసుకునేందుకే నేతలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ నేతలు చేయిస్తున్న ఈ సర్వేలు ప్రధానంగా నాలుగు కీలక అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీకి కంచుకోటలుగా ఉన్న గ్రామాలు, మండలాల్లో ఇప్పుడు ఓటు బ్యాంకు ఏ మేరకు చెక్కుచెదరకుండా ఉంది, ఎక్కడ పట్టు సడలింది అనే వివరాలను సేకరిస్తున్నారు. స్థానిక నాయకుల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలతో పాటు, ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల మధ్య ఉన్న సమన్వయ లోపాలను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమలుపై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న స్పందనను అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను గుర్తిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వానికి మద్దతు ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి, అసంతృప్తి ఉన్న చోట్ల ఏ అంశాలను ప్రధానంగా ఎత్తిచూపాలి అనే దానిపై డేటా సేకరిస్తున్నారు.
ఈ సర్వేల ద్వారా వెలువడే ఫలితాలను కేవలం ముఖ్య నేతల వద్దే ఉంచుకోకుండా.., మండల, గ్రామ స్థాయి నాయకులకు కూడా వివరించాలని భావిస్తున్నారు. ఏ గ్రామంలో పార్టీ బలహీనంగా ఉందో అక్కడ ప్రత్యేక దృష్టి సారించడం, ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలను రూపొందించడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. సమస్యల తీవ్రతను బట్టి స్థానికంగా ఆందోళనలు చేపట్టడం ద్వారా కార్యకర్తల్లో మళ్లీ ఉత్సాహం నింపవచ్చని నేతలు అంచనా వేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలను నిర్మొహమాటంగా అంచనా వేసుకోవడం ఏ పార్టీకైనా కీలకమైన ప్రక్రియ. అయితే, సర్వేల ద్వారా లోపాలను గుర్తించడం ఎంత ముఖ్యమో, వాటిని సరిదిద్దుకోవడానికి క్షేత్రస్థాయిలో నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం అంతే సవాలుతో కూడుకున్నది. అధికార పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావాన్ని తట్టుకుంటూ, స్థానిక సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపైనే బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. ఈ ప్రైవేటు సర్వేలు గులాబీ నేతలకు దిక్సూచిగా మారి పార్టీ పునర్నిర్మాణానికి ఏ మేరకు దోహదపడతాయో వేచి చూడాలి.







