కరీంనగర్లో రేపే ‘మహా పాదయాత్ర’!!
కరీంనగర్ కేంద్రంగా బీజేపీ భారీ రాజకీయ బలప్రదర్శనకు సిద్ధమైంది. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకత్వాన్ని పాతరేద్దాం’ అనే నినాదంతో రేపు కరీంనగర్లో బీజేపీ ‘మహా పాదయాత్ర’ చేపడుతోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరవుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. కేవలం పాదయాత్రకే పరిమితం కాకుండా, భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు, రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ఇదొక కీలక అడుగుగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర తెలంగాణ గుండెకాయ వంటి కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మహా పాదయాత్రకు స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరై నాయకత్వం వహించనుండటం ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, సహ ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ తదితర అగ్రనేతలంతా ఒకే వేదికపైకి రానున్నారు. ఒక ప్రాంతీయ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడితో పాటు ఇంతమంది కీలక నేతలు తరలిరావడం వెనుక బలమైన రాజకీయ సందేశం దాగి ఉంది.
ఇటీవలి కాలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపైనా, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపైనా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి పక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికి బీజేపీ కరీంనగర్ గడ్డను వేదికగా ఎంచుకుంది. ఓటర్ల జాబితా సవరణ వంటి సున్నితమైన అంశంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి, ప్రతిపక్షాల వాదనను బలంగా ఎదుర్కోవడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
తన సొంత నియోజకవర్గం కావడంతో కరీంనగర్ మహా పాదయాత్రను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కరీంనగర్లో బీజేపీ పట్టు ఏమాత్రం తగ్గలేదని, మరింత బలపడిందని చాటిచెప్పేందుకు సుమారు లక్ష మందిని సమీకరించాలనే భారీ లక్ష్యంతో ఆయన ప్రత్యేక ప్రణాళికలు రచించారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గ కోర్ కమిటీ నేతలతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ ఇప్పటికే కాషాయ జెండాలు, తోరణాలతో నిండిపోయి రాజకీయ వేడిని రాజేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
సోమవారం ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కరీంనగర్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నగరంలోని గాంధీ సర్కిల్ సమీపంలో ఉన్న వైశ్యభవన్ నుంచి ఈ మహా పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్డు మీదుగా సుమారు 2 కిలోమీటర్ల మేర సాగి కమాన్ వద్దకు చేరుకుని ముగుస్తుంది.
మొత్తానికి ఓ వైపు జాతీయ స్థాయి అంశాలపై ప్రతిపక్షాలకు గట్టి సమాధానం ఇస్తూనే, మరోవైపు ఉత్తర తెలంగాణలో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ ఈ మహా పాదయాత్రను ఒక శక్తివంతమైన అస్త్రంగా మలుచుకుంటోంది. లక్ష మంది జనసమీకరణతో కరీంనగర్ వీధులు కమల దళంతో హోరెత్తితే, అది రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.







