ప్లాన్ చైనాది.. ? చక్రం తిప్పింది లి మింగ్..?
ఎన్విడియా (Nvidia chip smuggling) వ్యవహారంలో తవ్వేకొద్ది కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. ఆ సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ (Jensen Huang) రాజీనామా చేయడానికి ప్రధాన కారకురాలైన అలిస్ (Alice Huang) .. చైనా గూఢచారులతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిగా ఆరోపణలు వచ్చాయి. అయితే తర్వాతి దర్యాప్తులో అలిస్ కేవలం ఓ పావుమాత్రమే అని.. అందులో కీలక పాత్ర పోషించిన కింగ్ పిన్ గా చైనా వ్యాపారి లి మింగ్ పేరు తెరపైకి వచ్చింది. అలిస్ ను ఎరగా చూపి.. చైనా కంపెనీలకు అక్రమమార్గంలో చిప్ సరఫరాను సాగించినట్లు తేలింది.
సింగపూర్ కేంద్రంగా మెగాస్పీడ్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. అందులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన అలిస్తో మింగ్కు పరిచయం ఏర్పడింది. మెగాస్పీడ్ సంస్థ నిర్వహణ, నిర్ణయాల్లో లి మింగ్ కీలకంగా వ్యవహరించేవారు. అలిస్‌కు పదోన్నతి కల్పించి కీలక స్థానంలో నియమించారు. ఆమెను ముందు ఉంచి మొత్తం వ్యవహారాన్ని ఆయనే చక్కబెట్టేవారు. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉపయోగపడే (AI) చిప్‌లను చైనాకు మళ్లించేందుకు లి మింగ్ ఏకంగా ఓ కంపెనీల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఆ కథనం పేర్కొంది. అలా చైనా కంపెనీలకు 7.5 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక ఎన్విడియా చిప్స్ చేరాయన్నది ఆరోపణ. ఎన్విడియా సంస్థతో వ్యాపారం చేసే ఇతర కంపెనీలతోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఎన్విడియా కంప్యూటర్ సర్వర్లను ఇతర దేశాలకు మళ్లించారనే ఆరోపణలపై గతేడాది ఫిబ్రవరిలో సింగపూర్‌లో లి మింగ్పై కేసు నమోదైంది. అభియోగపత్రాల్లో అనేక కంపెనీల పేర్లు ఉన్నప్పటికీ ఆ జాబితాలో మెగాస్పీడ్ పేరు లేకపోవడం గమనార్హం. సింగపూర్ ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.. మెగాస్పీడ్ సంస్థ కోసమని ఎన్విడియాను నమ్మించి.. లి మింగ్ పెద్ద మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటిని పొరుగున ఉన్న మలేసియాకు అక్రమంగా తరలించారు. అక్కడి నుంచి మరో దేశానికి సరఫరా చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కాగా.. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన లి మింగ్.. సింగపూర్‌లోని చైనా ఎంబసీకి సమీపంలో ఓ లగ్జరీ విల్లాలో నివాసం ఉంటున్నట్టు సమాచారం.
అలిస్-జెన్సన్ గురించి భర్తకు ముందే తెలుసా?
అలిస్ హువాంగ్, ఆమె భర్త కాంగ్ వియ్‌తో.. లి మింగ్కు చాలాకాలం ముందు నుంచే వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్విడియా చిప్‌లను చైనాకు సరఫరా చేయడంపై ఆంక్షలు విధించారు. దీంతో అక్రమ మార్గంలో చైనా వినియోగదారులకు వాటిని సరఫరా చేసేందుకు ఈ ముగ్గురూ ఆగ్నేయాసియా అంతటా తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం ప్రారంభించారు. అయితే, జెన్సన్-అలిస్ వ్యవహారం బయటపడేంత వరకూ వీరి సంబంధాల గురించి బాహ్య ప్రపంచానికి తెలియకపోవడం గమనార్హం. మరోవైపు వీరిద్దరి వ్యవహారం అలిస్ భర్త కాంగ్ వియ్కు కూడా తెలుసని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తన భార్య ఎన్విడియా అధిపతికి వ్యక్తిగత సహాయకురాలు అని సహచరులతో ఆయన సరదాగా వ్యాఖ్యానించేవారని సమాచారం.
మరోవైపు మెగాస్పీడ్ సంస్థ కార్యకలాపాలపై అమెరికా, సింగపూర్ అధికారులు విస్త్రృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎన్విడియా చిప్‌లను చైనాకు సరఫరా చేసేందుకు నిషేధం ఉన్నప్పటికీ.. అక్కడికి ఎలా చేరాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. కాగా, తాము ఎగుమతి నిబంధనలకు కట్టుబడే ఉన్నామని, ఎలాంటి తప్పూ చేయలేదని మెగాస్పీడ్ సంస్థ వాదిస్తోంది.







