తలో చేయి వేసి చెక్‌డ్యామ్ కట్టేశారు!
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం రైతుల సహనానికి పరీక్ష పెట్టింది. ఏడాది కాలంగా దెబ్బతిన్న చెక్‌డ్యామ్‌కు మరమ్మతులు చేయాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో అన్నదాతలే నడుం బిగించారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, తలా ఒక చేయి వేసి సొంత నిధులతో చెక్‌డ్యామ్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తణుగుల గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ వద్ద ఈ స్ఫూర్తిదాయక సంఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రాంతంలోని వ్యవసాయ బావులు, బోర్లు అడుగంటిపోతుండటంతో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో 2022లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.19 కోట్ల వ్యయంతో మానేరు వాగుపై ఈ చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులకు సాగునీటి భరోసా దక్కింది. అయితే, సరిగ్గా ఏడాది క్రితం అంటే 2025 నవంబర్ 21న ఈ చెక్‌డ్యామ్ భారీగా దెబ్బతింది. ఇసుక మాఫియా ఆగడాల వల్లే చెక్‌డ్యామ్‌ను పేల్చివేశారని ఆ సమయంలో ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసింది. కారణమేదైనా, చెక్‌డ్యామ్ తెగిపోవడంతో నీరు నిలవక, ఇటీవలి ఖరీఫ్ సీజన్లో రైతులు తీవ్ర సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చెక్‌డ్యామ్ మరమ్మతుల కోసం శంభునిపల్లికి చెందిన రైతు నైనారి రమేష్ సహా పలువురు రైతులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు (కాంగ్రెస్), హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్)లను కలిసి విన్నవించారు. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ ఏడాది గడిచినా ప్రభుత్వ పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని కల్వల శ్రీనివాస్ అనే మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న యాసంగి పంటకైనా నీరు దక్కాలంటే తామే రంగంలోకి దిగడం తప్ప మరో మార్గం లేదని రైతులు నిర్ణయించుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ చెక్‌డ్యామ్‌లో నీరు నిలిస్తే తణుగుల, శంభునిపల్లి, గుంపుల, పాపక్కపల్లి, గోపాలపురం, వావిలాల, పోచంపల్లి, ఇందుర్తి, కిష్టంపేట గ్రామాల పరిధిలోని సుమారు 2,000 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలుగుతుందని రైతు మాదిరెడ్డి సాగర్ రెడ్డి తెలిపారు. దీంతో లబ్ధి పొందే ప్రతి రైతు ఎకరాకు రూ. 5,000 చొప్పున చందా వేసుకోవాలని తీర్మానించుకున్నారు. ఒకవేళ ఈ నిధులు సరిపోకపోతే, అదనంగా మరికొంత సొమ్ము జమ చేయడానికి కూడా వారు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జేసీబీలు, ఎర్త్ మూవర్ల సాయంతో తెగిన భాగంలో భారీ బండరాళ్లను పేర్చుతున్నారు. ఆ రాళ్ల మధ్య నుంచి నీరు లీక్ కాకుండా ఉండేందుకు వాటిపై ఇసుక, మట్టిని నింపి, ఉపరితలంపై గడ్డిని పెంచేలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో, రూ. 19 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టుకు కనీస మరమ్మతులు చేయలేకపోవడం పాలనా వైఫల్యానికి నిదర్శనం. ఒకవైపు అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలకే పరిమితమవుతుంటే, రాజకీయాలకు అతీతంగా రైతులు ఏకమై తమ కష్టాన్ని తామే తీర్చుకోవడం ప్రజాస్వామ్యంలో సామాజిక ఐక్యతకు నిలువుటద్దం. ప్రభుత్వ యంత్రాంగం ఇకనైనా కళ్లు తెరిచి, రైతుల శ్రమను గుర్తించి శాశ్వత ప్రాతిపదికన చెక్‌డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.







