కాంగ్రెస్ పార్టీలో మళ్లీ మంత్రివర్గ విస్తరణ వేడి!
కాంగ్రెస్ పార్టీలో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కేబినెట్ బెర్తుల భర్తీపై ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. విస్తరణ ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ ఆశావహుల్లో అసహనం, పార్టీ అంతర్గత వర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. దీంతో డిసెంబర్ 7వ తేదీ నాటికి మంత్రి విస్తరణ పూర్తి చేయాలని సీనియర్ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు.
నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మందికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం 15 మంది మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. పాలనాపరంగా కీలక శాఖలన్నీ కొద్దిమంది మంత్రుల వద్దే కేంద్రీకృతమై ఉండటం వల్ల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. అందుకే తక్షణమే ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే మూడేళ్ల మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న తర్వాతే శాఖల మార్పుపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మంత్రివర్గ విస్తరణ చర్చల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన పేరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన సమయంలో అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆయన గట్టిగా చెప్తున్నారు. ఇటీవల అయ్యప్ప మాలలో ఉండి కూడా సొంత ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపైనా ఆయన చేసిన విమర్శలు గాంధీ భవన్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జ్ బీఎం సందీప్ స్వయంగా రంగంలోకి దిగి రాజగోపాల్ రెడ్డితో భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, బహిరంగ విమర్శలు చేసిన ఆయనకు అధిష్ఠానం మంత్రి పదవితో బుజ్జగిస్తుందా లేక క్రమశిక్షణ పేరుతో షాక్ ఇస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
ఇవి కూడా చదవండి
కేవలం ముగ్గురికే అవకాశం ఉండటంతో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయడం కాంగ్రెస్ అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ జిల్లాల నేతలు తమకు కచ్చితంగా కేబినెట్లో చోటు కల్పించాలని పట్టుబడుతున్నారు. దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే అధిక ప్రాధాన్యత దక్కిందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత హైకమాండ్‌పై ఉంది. ముఖ్యంగా బీసీ వర్గానికి అదనపు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా తెరపైకి రావడం సమీకరణాలను మరింత సంక్లిష్టం చేస్తోంది.
ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల ఎన్నికల బిజీలో ఉన్న ఏఐసీసీ నాయకత్వం, ఇప్పుడు పూర్తిస్థాయిలో తెలంగాణ వ్యవహారాలపై దృష్టి సారించింది. కొత్త ఇన్ఛార్జ్ బీఎం సందీప్ ఆధ్వర్యంలో జరుగుతున్న పీఏసీ, విస్తృత స్థాయి సమావేశాల్లో కేబినెట్ విస్తరణపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలోపు, లేదా ఖేలో ఇండియా క్రీడల ముగింపు తర్వాతైనా ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద అసంతృప్తులను చల్లార్చి, సామాజిక న్యాయం పాటిస్తూ రేవంత్ రెడ్డి టీమ్‌లోకి కొత్తగా రాబోయే ఆ ముగ్గురు అదృష్టవంతులు ఎవరన్నది తెలంగాణ రాజకీయాల్లో సస్పెన్స్‌గా మారింది.







