కొనుగోళ్లు తగ్గించడంతోనే బంగారం ధర దిగివచ్చిందన్న మోడీ..!
బంగారం ధర పైపైకి దూసుకెళ్తున్న సమయంలో కొనుగోళ్లు తగ్గించాలంటూ సూచించిన ప్రధాని మోడీ.. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేశారు. బంగారం కొనుగోళ్లు తగ్గించాలంటూ తాను చేసిన విజ్ఞప్తికి దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని మోడీ తెలిపారు. ప్రజలు తన మాట విని కొనుగోళ్లు తగ్గించడంతో బంగారం ధరలు దిగివచ్చాయని, తద్వారా వారి డబ్బు ఆదా అయిందని ఆయన పేర్కొన్నారు.
“ఏడాది పాటు అవసరమైతే తప్ప బంగారం కొనవద్దని నేను దేశ ప్రజలను కోరాను. గతంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడినప్పుడు, ఒక పూట భోజనం మానెయ్యాలని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చారు. అప్పుడు ప్రజలు ఆయన మాట పాటించారు. నా దేశ ప్రజల స్వభావం ఇప్పటికీ అలాగే ఉంది. నాలాంటి సామాన్య వ్యక్తి చేసిన విజ్ఞప్తిని మన్నించి ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించారు. ‘మోడీ జీ , మీ మాట విని మా డబ్బు ఆదా చేసుకున్నాం’ అని ఇప్పుడు ప్రజలు నాతో చెబుతున్నారు” అని వివరించారు.
ఇవి కూడా చదవండి
ఫలించిన ప్రధాని పిలుపు
ఈ ఏడాది మే నెలలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు పెరగడంతో, దేశ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగిన ఓ సభలో ప్రధాని మోడీ తొలిసారి ఈ విజ్ఞప్తి చేశారు. “జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలి” అని ప్రజలను కోరారు. ఇంధన వాడకాన్ని తగ్గించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ పునరుద్ధరించడం వంటి పలు ఇతర విజ్ఞప్తులు కూడా ఆయన చేశారు.
ప్రధాని పిలుపు తర్వాత బంగారం డిమాండ్, ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గణాంకాల ప్రకారం, మే 9న 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 15,250 ఉండగా, ప్రస్తుతం అది రూ. 12,523కు తగ్గింది. ప్రభుత్వ డేటా ప్రకారం, ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో బంగారం దిగుమతులు దాదాపు 40 శాతం తగ్గి 24.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో దిగుమతుల విలువ 41.24 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 29 శాతం క్షీణించి 162 టన్నులకు పరిమితమైందని తెలిపింది.
ప్రజలకు పిలుపునివ్వడంతో పాటు, ప్రభుత్వం కూడా మే నెలలో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.







