కొత్త అతిథులు, డైరెక్టర్ల బోర్డు, మద్దతు దారులతో ఘనంగా IACF ’’డోనర్ అప్రిసియేషన్ డిన్నర్’
ఇండో అమెరికన్ ఛారిటీ ఫౌండేషన్ (IACF) ఆధ్వర్యంలో వార్షిక ‘డోనర్ అప్రిసియేషన్ డిన్నర్’ షుగర్ ల్యాండ్లోని ఇండియన్ సమ్మర్లో ఘనంగా జరిగింది. గత 30 ఏళ్లకు పైగా సమాజ సేవలో ఫౌండేషన్ సాగిస్తున్న కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న దాతల ఉదారతను కొనియాడుతూ నిర్వహించిన ఈ వేడుకలో దాతలు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, దీర్ఘకాలిక మద్దతుదారులు, కొత్త అతిథులు IACF డైరెక్టర్ల బోర్డుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా IACF అధ్యక్షుడు రమేశ్ మద్ది అతిథులకు స్వాగతం పలికారు. ఎక్కడో ఒకచోట మీ ఉదారత ఇప్పటికే ఫలితాలను ఇస్తోంది, అదే ఒక శక్తివంతమైన వారసత్వం” అని పేర్కొన్నారు.
గత మూడు దశాబ్దాలకు పైగా IACF విద్య, కుటుంబ సహాయం, సాధారణ సంక్షేమం, ఆరోగ్య రక్షణ రంగాలలోని కార్యక్రమాల కోసం నిధులను సమకూరుస్తోంది. ఫౌండేషన్ అందించే స్కాలర్షిప్ కార్యక్రమం స్థానిక స్కూల్ డిస్ట్రిక్ట్లలోని విద్యార్థులకు తోడ్పాటునందిస్తుండగా, గ్రాంట్లు అవసరమైన వారికి సేవలందిస్తున్న లాభాపేక్షలేని సంస్థలకు అండగా నిలుస్తున్నాయి. అలాగే, బీమా లేని, వెనుకబడిన వర్గాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ‘ఇండియన్ డాక్టర్స్ ఛారిటీ క్లినిక్’కు IACF దీర్ఘకాలిక మద్దతుదారుగా కొనసాగుతోంది.
వాకథాన్, స్కాలర్షిప్ పంపిణీ, డోనర్ అప్రిసియేషన్ డిన్నర్, వార్షిక గాలా వంటి వార్షిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు IACF ఇతర కమ్యూనిటీ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కీలకమైన రక్షణ పరికరాలను అందించడంతో పాటు, భారతదేశంలోని ఆసుపత్రులలో 20 ఐసీయూ పడకల ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేసింది. 2025లో కెర్విల్లే ప్రాంతంతో సహా టెక్సాస్ హిల్ కంట్రీని భీకర వరదలు ముంచెత్తినప్పుడు, సేవా ఇంటర్నేషనల్ మరియు ఇతర సంస్థలతో కలిసి సహాయక, పునరావాస చర్యల కోసం 50,000 డాలర్ల విరాళం అందించింది. హరికేన్ హార్వే అనంతర సహాయక చర్యలలోనూ ఫౌండేషన్ పాలుపంచుకుంది.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులు జగత్ కామ్దార్, సుబోధ్ భుచార్, కమలా రాఘవన్ పాల్గొని IACF తొలినాళ్ల జ్ఞాపకాలను, సంస్థను నడిపిస్తున్న సామాజిక స్ఫూర్తిని పంచుకున్నారు. గత 30 ఏళ్లకు పైగా ఫౌండేషన్ సేవలు విజయవంతంగా కొనసాగడానికి కృషి చేసిన వాలంటీర్లు, దాతలు, భాగస్వామ్య సంస్థల నిబద్ధతకు అతిథులు నివాళులర్పించారు.







