అసమ్మతి సెగలు చల్లార్చేందుకు రంగంలోకి కొత్త ఇన్ఛార్జ్!
అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యేల బహిరంగ విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం డిసెంబర్ 7 నాటికి మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. ఈ తరుణంలో పార్టీలో పెరుగుతున్న అసమ్మతి అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు మీనాక్షి నటరాజన్ స్థానంలో తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన బి.ఎం. సందీప్ కుమార్ నేరుగా రంగంలోకి దిగారు.
కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన తర్వాత బి.ఎం. సందీప్ తొలిసారిగా ఆదివారం హైదరాబాద్ లో అడుగు పెట్టారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. గాంధీ భవన్లో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమీక్షిస్తారు. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరవుతున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో పాటు పార్టీ బలోపేతం, అసమ్మతి కట్టడి వంటి అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. సోమవారం మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో సందీప్ భేటీ అవుతారు. తిరిగి నవంబర్ 27న హైదరాబాద్‌కు రానున్న ఆయన, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖాముఖి సమావేశమై జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు.
ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికరంగా మారిన నేతల బహిరంగ వ్యాఖ్యలను అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ ఇప్పటికే ఏఐసీసీకి నివేదిక పంపింది. కొడంగల్‌తో పాటు మంత్రుల నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తున్నారని, మునుగోడుకు నిధులు ఇవ్వకపోతే మరో ‘కురుక్షేత్రం’ తప్పదని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించడం కలకలం రేపింది. హైకమాండ్ పిలుపు మేరకు సోమవారం రాజగోపాల్ రెడ్డి, సందీప్ తో భేటీ కానున్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయంలో తగినన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాతే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ లక్ష్మణరేఖ దాటితే సహించేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
కేవలం బహిరంగ విమర్శలే కాకుండా, క్షేత్రస్థాయిలో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కూడా పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల విడుదల, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు, నామినేటెడ్ పదవుల భర్తీ, అధికారుల పనితీరు వంటి అంశాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. అలాగే, ఢిల్లీ వేదికగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య జరిగిన వాగ్వాదం కూడా అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు గాంధీ భవన్‌కు రావాలని పిలిచినా ఇరువురు నేతలు హాజరుకాకపోవడంతో పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీకి నివేదిక సమర్పించారు.
మూడేళ్ల పాలన మైలురాయికి చేరువవుతున్న వేళ, రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీని సమాయత్తం చేయాల్సిన బాధ్యత కొత్త ఇన్ఛార్జ్ బి.ఎం. సందీప్ పై ఉంది. అసంతృప్త నేతలతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించడం, అదే సమయంలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, కొత్త ఇన్ఛార్జ్ కలిసి పార్టీలో ఐక్యతను ఎలా సాధిస్తారో వేచి చూడాలి.







