పంచాయతీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు లేవు: పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan) ఆదివారం కీలక ప్రకటన విడుదల చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయని, కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా సరే ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి బరిలోకి దిగవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య ఎలాంటి సీట్ల పంపకాలు గానీ, సర్దుబాట్లు గానీ ఉండవని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేయాలంటే ప్రజల మధ్య నుంచి వచ్చే సమర్థులకు అవకాశం దక్కాలని, రాజకీయ అడ్డంకులు లేకుండా పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కార్యకర్తలను పార్టీ నేతలు ఎవరూ అడ్డుకోవద్దని ఆయన గట్టి ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన శ్రేణులకు క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైనా తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షణలో ఐదు జోన్ల వారీగా నియమించిన ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు అభ్యర్థులకు అందుబాటులో ఉంటారని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ సూచించారు.







