ఎమ్మిగనూరు చెత్తకుప్పలో జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ల కలకలం..!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపర్లు చెత్తకుప్పలో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఉన్న చెత్తకుప్పలో సుమారు 50 జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ల కట్ట లభ్యమైంది. అవన్నీ గోనెగండ్ల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లుగా గుర్తించగా, వాటిని పరిశీలించగా అన్నింటిపైనా వైఎస్సార్సీపీ(ysrcp) ఎన్నికల గుర్తు అయిన ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటు వేసి ఉండటం గమనార్హం. స్థానిక విద్యార్థులు మైదానంలో ఆడుకుంటున్న సమయంలో ఈ బ్యాలెట్ పేపర్ల కట్ట కనిపించడంతో విషయం బయటకు పొక్కింది.
బ్యాలెట్ పేపర్లు బయటపడిన సమాచారం అందుకున్న ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి వెంటనే తన అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెత్తకుప్పలో దొరికిన ఆ బ్యాలెట్ పేపర్లను పరిశీలించి మీడియాకు చూపించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి, వారం రోజులుగా కళాశాల తరగతులు యథావిధిగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మైదానంలో బ్యాలెట్ పేపర్ల కట్ట బయటపడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా ఇన్ని రోజుల పాటు ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అకస్మాత్తుగా చెత్తకుప్పలోకి ఎలా వచ్చాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎన్నికల నిబంధనల ప్రకారం, కౌంటింగ్ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క బ్యాలెట్ పేపర్‌ను సీల్ చేసి అత్యంత భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచాల్సి ఉంటుంది. కానీ, అందుకు విరుద్ధంగా ఓటు వేసిన బ్యాలెట్ పేపర్లు బయట చెత్తకుప్పలో దొరకడం ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యానికి, కౌంటింగ్ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు నిదర్శనమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో వైసీపీకి పడిన ఓట్లను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారా? అనే అనుమానాలను రాజీవ్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక రెవెన్యూ, ఎన్నికల అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.







