ఆ ప్రచారం బాగా జరగాలి: చంద్రబాబు కీలక కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్రోత్సాహక నిధులపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu Naidu) పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం అమరావతి నుంచి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో అనవసరమైన రాజకీయ విభేదాలు, ఘర్షణలు, ఖర్చులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రతి ఇంటికీ తెలిసేలా ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. దీని ప్రకారం, 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉంటే రూ.25 లక్షలు, అలాగే 10 వేలకు పైగా జనాభా ఉన్న మేజర్ పంచాయతీ ఏకగ్రీవమైతే ఏకంగా రూ.50 లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహక నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను ఎంతో వేగంగా అభివృద్ధి చేసుకోవచ్చని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అన్నారు.
మరోవైపు, పంచాయతీ ఎన్నికల వేళ పార్టీ నేతల మధ్య వ్యక్తిగత పంతాలు, పట్టింపులు, ఈగోలు ఉండకూడదని, అందరిలోనూ పూర్తి ఐక్యత కనిపించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక నాయకులందరూ సమన్వయంతో పనిచేసి, గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉండే సమర్థులైన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చూడాలని ఆదేశించారు. చిన్నచిన్న విభేదాలతో ఎన్నికలకు వెళ్లి గ్రామంలో అశాంతికి తావివ్వకూడదని, ఐక్యమత్యంతో ఏకగ్రీవాలు సాధించి ప్రభుత్వ నిధులను రాబట్టుకోవడం ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు.







