జగన్ వర్సెస్ షర్మిల.. యలహంక ప్యాలెస్ దగ్గర హైడ్రామా..
ఆస్తి వివాదాలు కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి దూరాన్ని పెంచుతాయో చెప్పడానికి వైఎస్ కుటుంబంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) కుటుంబానికి చెందిన ఆస్తుల విషయంలో సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ గొడవ మరో కీలక మలుపు తీసుకుంది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ (Yelahanka Palace)కు వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలను చూపిస్తూ ఆమెను ఆ ప్రాంగణంలోకి వెళ్లనివ్వలేదు. ఈ పరిణామం ఏపీ రాజకీయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఆదివారం (నవంబర్ 22) షర్మిల తన తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma)తో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరు (Bengaluru) చేరుకున్నారు. అక్కడి నుంచి యలహంకలో ఉన్న కుటుంబ నివాసానికి వెళ్లాలని ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలో ఎయిర్ ఫోర్స్ క్రాస్ (Air Force Cross) వద్ద పోలీసులు ఆమెను నిలిపివేశారు. ఆస్తికి సంబంధించిన వివాదంపై స్థానిక న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అధికారులు ఆమెకు చూపించారు. దీంతో అక్కడ కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తన కుటుంబ నివాసానికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని షర్మిల పోలీసులను ప్రశ్నించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఆమె అక్కడి నుంచి సమీపంలోని హోటల్‌కు వెళ్లారు.
ఈ వ్యవహారంలో నవంబర్ 21న బెంగళూరులోని దేవనహళ్లి (Devanahalli) సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Silicon Builders Private Limited) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. వివాదాస్పద ఆస్తిపై ఆ సంస్థకు ఉన్న స్వాధీనం, లీజు హక్కులకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని ఆదేశించింది. షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, ప్రతినిధులు, ఆమె తరఫున వ్యవహరించే వ్యక్తులు కూడా ఆ ప్రాంగణంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది.
మరోవైపు ఈ ఆస్తిపై జగన్, షర్మిల వాదనలు భిన్నంగా ఉన్నాయి. యలహంకలోని నివాసం తన కుటుంబానికి చెందిన వారసత్వ ఆస్తి అని, అందులో తనకూ హక్కు ఉందని షర్మిల చెబుతున్నారు. కనీసం తన కుమార్తె వివాహ వేడుకనైనా అక్కడ నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని గతంలో కోరారు. అయితే ఆ ప్రాపర్టీ తన అత్తగారి పేరు మీద రిజిస్టర్ అయి ఉందని జగన్ పేర్కొన్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో అతిథులు, ఈవెంట్ సిబ్బంది రాకపోకలతో కుటుంబ భద్రత, వ్యక్తిగత గోప్యతకు ఇబ్బందులు ఏర్పడతాయని వివాహానికి అనుమతి నిరాకరించారు.
నవంబర్ 25న జరగనున్న కుమార్తె అంజలి (Anjili) వివాహాన్ని యలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలని షర్మిల భావించారు. అయితే వివాదం ముదరడంతో ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాల్సి వచ్చింది. మరోవైపు తనకు తెలియని పిటిషన్‌పై వచ్చిన కోర్టు ఉత్తర్వులను చూపించి అడ్డుకున్నారని షర్మిల అభ్యంతరం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 19న జరిగే విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయం ఈ వ్యవహారంలో కీలకం కానుంది.







