చావుకోసం పెళ్లిళ్లు.. పరిహారం కోసం కుట్ర! ఇలాంటి ‘డెత్ మ్యారేజ్’ స్కామ్ ఎప్పుడూ విని ఉండరు !
ఒక పెళ్లి జరుగుతుంది.. కొత్త జంట ఫొటోలకు పోజులిస్తుంది. చేతిలో పెళ్లి సర్టిఫికెట్.. ముఖాల్లో చిరునవ్వులు! అంతా మామూలుగానే కనిపిస్తుంది. కానీ ఆ పెళ్లి వెనుక ఓ భయంకరమైన స్కెచ్ ఉందని తెలిస్తే షాకవ్వాల్సిందే! ఇక్కడ పెళ్లి చేసుకోవడం వెనుక ప్రేమ లేదు.. కాపురం చేయాలన్న ఆలోచనా లేదు. అసలు టార్గెట్ ఎక్కడో ఉంది. యుద్ధభూమిలో తుపాకీ పట్టుకుని అడుగుపెట్టబోతున్న ఓ వ్యక్తి.. అతడి ప్రాణం.. చివరికి ప్రభుత్వం చెల్లించే పరిహారం! ఇదేదో క్రైమ్ సినిమా కథ కాదు. రష్యాలో వెలుగులోకి వచ్చిన వాస్తవ ఘటన. మరీ ఈ పెళ్లిళ్ల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వ్యవహారంలో తెర వెనుక ఉన్నదెవరు?
పుతిన్ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం పేరుతోనే స్కెచ్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘టైమ్ ఆఫ్ హీరోస్’ (Time of Heroes) కార్యక్రమం ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. 2024 ప్రారంభంలో మొదలైన ఈ కార్యక్రమం ద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని క్రెమ్లిన్ భావించింది. యుద్ధంలో సేవలందించిన వారిని దేశంలోని కొత్త నాయకత్వ వర్గంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రభుత్వంలో కీలక పదవులు కల్పించాలన్నది దీని లక్ష్యం.
అయితే, యుద్ధ వీరులకు గౌరవం కల్పించాల్సిన ఈ కార్యక్రమం పేరుతోనే కొందరు నేతలు వింతైన మోసానికి తెరతీశారన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
పెళ్లిళ్ల వెనుక అసలు కుట్ర ఇదేనా?
రష్యాలోని క్రాస్నోయార్స్క్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా ఉన్నారు. 41 ఏళ్ల ఇరినా బెజ్మాన్, 64 ఏళ్ల గలీనా కలిములినా.. ఇద్దరూ పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీతో సంబంధం ఉన్న నేతలే.
వీరు యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న కొంతమంది పురుషులను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి. ముందుగా వారిని సైనిక ఒప్పందాలపై సంతకాలు చేయించి యుద్ధానికి వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారితో హడావుడిగా పెళ్లిళ్లు జరిపించారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. యుద్ధానికి వెళ్లిన భర్తలు మరణిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే భారీ పరిహారం తమ చేతికి అందేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే.. పెళ్లి నుంచి యుద్ధానికి పంపడం వరకు ప్రతిదీ ఓ పక్కా పథకంలో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. కోట్ల విలువైన పరిహారం.. అప్పటికే ఖాతాపై కన్ను!
ఈ స్కామ్‌లో ఎంతటి దారుణం జరిగిందో దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాలు చూస్తే అర్థమవుతుంది. ఈ ముఠా మొదట ఓ సైనికుడికి సైనిక సేవకు సంబంధించి ప్రభుత్వం చెల్లించిన 18 లక్షల రూబుళ్లను (సుమారు 22 వేల డాలర్లు) కాజేసినట్లు అధికారులు తెలిపారు.
అంతటితో ఆగకుండా.. ఆ సైనికుడు యుద్ధంలో మరణించిన తర్వాత అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న మరో 50 లక్షల రూబుళ్లను కూడా దొంగిలించినట్లు వెల్లడించారు. మరో బాధితుడి బ్యాంకు ఖాతాలోని డబ్బును మాత్రం కాజేయడంలో విఫలమైనట్లు సమాచారం.
ఒక వ్యక్తి యుద్ధంలో ప్రాణాలు కోల్పోతే అతడి కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిహారమే.. ఈ ముఠాకు డబ్బు సంపాదించే మార్గంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి.
ఓ ఫొటోతో బయటపడిన బాగోతం!
ఇంత పెద్ద వ్యవహారం ఎలా బయటపడిందో తెలుసా? ఓ సాధారణ సోషల్ మీడియా పోస్టుతో!
ఇరినా బెజ్మాన్ తన కొత్త భర్త వ్లాదిమిర్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహ ధ్రువీకరణ పత్రాన్ని పట్టుకుని ఇద్దరూ ఫొటోకు పోజులిచ్చారు. అయితే, ఆ ఫొటో స్థానికుల్లో అనుమానాలు రేకెత్తించింది.
ఎందుకంటే వ్లాదిమిర్ స్థానిక చర్చి మెట్ల దగ్గర ఎక్కువగా కనిపించే వ్యక్తి. అక్కడి ప్రాంగణాన్ని ఊడ్చే వ్యక్తిగా స్థానికులకు అతడు పరిచయం. అలాంటి వ్యక్తిని స్థానిక కౌన్సిల్ సభ్యురాలు అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
దీంతో ఈ పెళ్లి వెనుక ఏదైనా మతలబు ఉందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ వ్యవహారంపై ప్రజల్లో చర్చ మొదలైన తర్వాతే అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బెజ్మాన్ తన పోస్టును తొలగించారు.
యుద్ధానికి మద్దతు పోస్టులు.. తెర వెనుక మాత్రం?
ఈ వ్యవహారంలో గలీనా కలిములినా ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గతంలో ఆమె యునైటెడ్ రష్యా పార్టీ ప్రాంతీయ విభాగానికి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేశారు.
సోషల్ మీడియాలో మాత్రం రష్యా సైన్యానికి, ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతుగా తరచూ పోస్టులు పెట్టేవారు. ముఖ్యంగా ‘We don’t abandon our own’ (మా వాళ్లను మేము వదులుకోం) అనే హ్యాష్‌ట్యాగ్‌ను తన పోస్టుల్లో ఉపయోగించేవారు.
కానీ ఇప్పుడు అదే సైనికుల పేరుతో పరిహారం కాజేసే కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడం తీవ్ర సంచలనంగా మారింది.
చివరికి బయటపడింది ఏంటి?
యుద్ధంలో పాల్గొనే సైనికులను దేశానికి హీరోలుగా చూపించాలన్నది పుతిన్ ‘టైమ్ ఆఫ్ హీరోస్’ కార్యక్రమం వెనుక ఉన్న లక్ష్యం. కానీ అదే కార్యక్రమంతో సంబంధం ఉన్న స్థానిక నేతలపై సైనికులను లక్ష్యంగా చేసుకుని మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడం క్రెమ్లిన్ ప్రచారానికి ఇబ్బందికరంగా మారింది.
దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికుల త్యాగాలను గౌరవించాల్సిన నాయకులపైనే ఇలాంటి ఆరోపణలు రావడం మరింత కలవరపెడుతోంది. ఒకవైపు యుద్ధ వీరులంటూ ప్రశంసలు.. మరోవైపు వారి మరణం ద్వారా వచ్చే పరిహారంపై కన్ను! ఈ రెండు ముఖాల మధ్య బయటపడిన ఈ వ్యవహారం రష్యాలో రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.
పెళ్లి అనేది కొత్త జీవితానికి ఆరంభం కావాలి.. కానీ ఇక్కడ మాత్రం యుద్ధం, మరణం, పరిహారం చుట్టూ తిరిగిన ఓ భయంకరమైన స్కామ్‌గా మారిందన్న ఆరోపణలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







