రేణిగుంటలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయం కూల్చివేత..!
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన అతిపురాతన అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేయడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. కడప-రేణిగుంట జాతీయ రహదారి (NH-716) విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు ఈ ఆలయాన్ని తొలగిస్తుండటంతో, సమాచారం అందుకున్న టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో బైఠాయించి కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై భూమన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ అని నిత్యం మాట్లాడే పవన్ కల్యాణ్, హిందూ ఆలయాల రక్షణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. హిందూ ఆలయాల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
పల్లవ రాజుల కాలం నాటి ఈ పురాతన ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉందని భూమన గుర్తుచేశారు. అగస్త్య మహాముని, పదకవితా పితామహుడు అన్నమయ్య, కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ వంటి మహానుభావులు పూజలు నిర్వహించిన పవిత్ర క్షేత్రాన్ని కూల్చివేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. బ్రిటిష్ వారు సైతం ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని గుర్తించి ఇక్కడి రైల్వే స్టేషన్‌కు ఆంజనేయపురం అని పేరు పెట్టారని తెలిపారు. సంపన్నుల కోసం రహదారి డిజైన్లు మార్చిన అధికారులు, వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని కాపాడటానికి ఎందుకు ప్రయత్నించలేదని భూమన నిలదీశారు.







