మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో శాశ్వత భాగస్వామ్యాలు : మంత్రి లోకేష్
మారిటైం కనెక్టివిటీ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, స్కిల్స్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధం
మారిటైం ఎకానమీకి దేశం ప్రాధాన్యత ఇస్తోంది
సాంకేతికత, నైపుణ్యాల వృద్ధికి పరస్పర సహకారం అవసరం
ఏపీని మేజర్ మారిటైం, ఇండస్ట్రియల్ గేట్ వేగా తీర్చిదిద్దుతాం
ఏపీలో నాలుగు నూతన పోర్టుల నిర్మాణం
ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ లో విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్
విశాఖపట్నం: మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో బలమైన, శాశ్వతమైన భాగస్వామ్యాలు కోరుకుంటున్నామని, సముద్ర అనుసంధానం, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో విశాఖ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఏషియన్- ఇండియా మారిటైం కాంక్లేవ్ లో (ASEAN–India Maritime Conclave) (ASEAN-Association of Southeast Asian Nations) విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా గారితో కలిసి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నానికి గొప్ప సముద్ర చరిత్ర ఉంది. విశాఖ భారతదేశ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి నిలయం. నేడు వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ముఖ్యమైన కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది. ఆగ్నేయాసియా దేశాలతో మన సంబంధాలు శతాబ్దాల నాటివి. ఆధునిక రవాణా వ్యవస్థలు అందుబాటులోకి రాకముందే మన తీర ప్రాంతాల మధ్య వ్యాపారులు, పరిశోధకులు ప్రయాణాలు చేస్తూ వస్తువులు, విజ్ఞానం, సంస్కృతిని పరస్పరం పంచుకునేవారు. కళింగపట్నం, మచిలీపట్నం వంటి ప్రాచీన నౌకాశ్రయాలు ఈ సంబంధాల్లో కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు సముద్రమే మన తొలి రహదారి. నేడు ఆధునిక నౌకాశ్రయాలు, డిజిటల్ సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం ద్వారా ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం మనకు ఉంది. అందుకే ఈ సదస్సుకు కనెక్టివిటీ-కన్వర్జెన్స్-కోఆపరేషన్ అనే థీమ్ ను ఎంచుకోవడం జరిగింది.
మారిటైం ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తున్నాం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం తన సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కొత్త ప్రాధాన్యతను ఇస్తోంది. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కార్యక్రమాల ద్వారా మెరుగైన నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణం, రవాణా, సరుకు నిర్వహణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెడుతున్నాం. భారత నౌకా నిర్మాణం, సముద్ర రంగాన్ని బలోపేతం చేసేందుకు దాదాపు రూ.70,000 కోట్లతో కూడిన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో రూ.25,000 కోట్ల మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఉంది. భారతదేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం సరుకు రవాణా సముద్ర మార్గం ద్వారానే జరుగుతోంది. మన ఆర్థిక అభివృద్ధికి మెరుగైన నౌకాశ్రయాలు, నౌకాయాన మౌలిక సదుపాయాలు అత్యంత అవసరం. ప్రతి నూతన నౌకాశ్రయం పరిశ్రమలకు, వ్యాపారాలకు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

పరస్పర సహకారంతో ప్రగతి
ఇటీవల మనీలాలో జరిగిన భారత్-ఏసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మోదీ గారు అనుసంధానం, పరిశోధన, విపత్తుల నిర్వహణ, సముద్ర భద్రత వంటి అంశాలతో కూడిన దీర్ఘకాలిక సముద్ర సహకార ప్రణాళికను ప్రతిపాదించి పరస్పర సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ దార్శనికతను సాకారం చేయడంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది.
ఇవి కూడా చదవండి
పొడవైన తీరం..ఏపీకి వరం
భారతదేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతాల్లో ఒకటైన ఏపీకి దాదాపు 1,053 కి.మీల సముద్ర తీరం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏపీని మేజర్ మారిటైం, ఇండస్ట్రియల్ గేట్ వేగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించింది. ఈ విషయంలో దాదాపు 10 శాతం వృద్ధి నమోదైంది. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల్లో 4 నూతన పోర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పోర్టులు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ఏపీ, పొరుగు రాష్ట్రాల్లోని పరిశ్రమలకు తోడ్పాటునందిస్తాయి. దుగరాజపట్నంలో దాదాపు రూ.30వేల కోట్ల పెట్టుబడితో మేజర్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. గత వారమే విశాఖపట్నంలో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్, ప్రత్యేక టెర్మినల్స్, నౌకల మరమ్మతులు వంటి రంగాలకు సంబంధించి దాదాపు రూ.7,500 కోట్ల విలువైన ఐదు సముద్ర రంగ అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పోర్టులను పరిశ్రమలతో, పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడమే మా ప్రధాన లక్ష్యం.
డిజిటిల్ కనెక్టివిటీ సెంటర్ గా విశాఖపట్నం
సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ అనుసంధానం కూడా కీలకంగా మారుతోంది. ఈ మార్పునకు విశాఖపట్నం కీలక కేంద్రంగా నిలుస్తోంది. విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి ఏఐ హబ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు డేటా సెంటర్లు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ అనుసంధాన వ్యవస్థల ఏర్పాటుకు గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. మూడు అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లు విశాఖపట్నంలో ల్యాండ్ కానున్నాయి. రుషికొండలో సిఫీ సంస్థ అభివృద్ధి చేస్తున్న విశాఖపట్నం తొలి ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశాం. ఈ ఏడాది ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ విశాఖపట్నం మీదుగా వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో విశాఖపట్నం ప్రశాంతమైన, అపార అవకాశాలున్న సముద్రతీర నగరంగా తనకు గుర్తుండిపోయిందని చెప్పారు. విశాఖపట్నం అంతర్జాతీయ ఏఐ హబ్‌గా మారుతుందని తాను అప్పట్లో ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. నేడు ఆ అవకాశాన్ని వాస్తవరూపంలోకి తీసుకొస్తున్నాం.
ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా శ్రీసిటీ, తిరుపతి
మన వాణిజ్యాన్ని మోసుకెళ్లే సముద్రాలే డిజిటల్ ప్రపంచాన్ని అనుసంధానించే సముద్రగర్భ కేబుళ్లకు కూడా మార్గాలుగా మారుతున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా.. మన పోర్టుల్లో ఏఐ, డిజిటల్ సాంకేతికతను వినియోగించడంలో అపారమైన అవకాశాలను చూస్తున్నా. స్మార్ట్ పోర్టుల ద్వారా జాప్యాన్ని తగ్గించవచ్చు. భద్రతను మెరుగుపరచవచ్చు. లాజిస్టిక్స్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చవచ్చు. శ్రీసిటీ, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని కూడా బలోపేతం చేస్తున్నాం. విశాఖపట్నం సమీపంలోని తర్లువాడలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బలమైన పోర్టులు, మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న తయారీ రంగంతో ఆసియాన్ సప్లై చెయిన్స్ లో ఏపీ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఎదగగలదు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో మరో సౌదీ అరేబియాగా ఏపీని తీర్చిదిద్దుతాం
క్లీన్ ఎనర్జీ రంగం ఏపీకి మరో ప్రధాన అవకాశం. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ రంగాల్లో అపారమైన సామర్థ్యం ఉంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియం ఎగుమతుల్లో కీలక రాష్ట్రంగా ఎదగాలన్నది మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ రంగంలో సౌదీ అరేబియాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.సూర్యరశ్మి, పవన శక్తి, సాంకేతికతను వినియోగించి స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాం. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ తన ప్లాంట్ ప్రారంభమైన తర్వాత ప్రతి ఏడాది దాదాపు 70వేల టన్నుల గ్రీన్ అమ్మోనియంను జపాన్‌కు చెందిన జెరా సంస్థకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో ఉత్పత్తి చేసిన స్వచ్ఛ ఇంధనం మన పోర్టుల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు ఎలా చేరగలదో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. గ్రీన్ ఫ్యూయల్స్, క్లీన్ షిప్పింగ్, సస్టైనబుల్ పోర్ట్ డెవలప్ మెంట్ వంటి రంగాల్లో ఆసియాన్ దేశాలతో ఇలాంటి భాగస్వామ్యాలను మేం స్వాగతిస్తాం.
2028 నాటికి 5వేల మంది మారిటైం ప్రొఫెషనల్స్ టార్గెట్
పెట్టుబడుల ద్వారా ఉద్యోగాల కల్పనే మాకు ముఖ్యం. 2028 నాటికి 5వేల మంది సముద్ర రంగ నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యాన్ని ఏపీ మారిటైమ్ పాలసీ నిర్దేశించింది. షిప్ బిల్డింగ్, మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, మారిటైం టెక్నాలజీ వంటి రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మన ఐటీఐలు, ఏయూ యూనివర్సిటీ, ఇతర విద్యాసంస్థలను సిద్ధం చేయాలనుకుంటున్నాం.
జువ్వలదిన్నె వద్ద మానవరహిత సముద్ర వ్యవస్థల అభివృద్ధి కోసం సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి పనిచేస్తున్నాం. ఐఐటీ తిరుపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో అక్కడ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆ సంస్థను ఆహ్వానించాం. ఈ సాంకేతికతలు సముద్ర భద్రతను, నౌకాశ్రయాల రక్షణను మెరుగుపరచడంతో పాటు మత్స్యకారులకు కూడా సహాయపడతాయి.

ఈ రంగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధం
భారత్, ఆసియాన్ దేశాల మధ్య ఇప్పటికే బలమైన చారిత్రక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను మరిన్ని వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక ప్రాజెక్టులుగా మార్చుకోవడానికి ఇదే సరైన సమయం. ఆసియాన్ దేశాలతో నాలుగు ప్రధాన రంగాల్లో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. మొదటిది- సముద్ర అనుసంధానం: మెరుగైన నౌకాయాన మార్గాలు, పోర్టు లాజిస్టిక్స్ వ్యవస్థల అభివృద్ధి. రెండోది- సాంకేతికత: స్మార్ట్ పోర్టులు, ఏఐ, డిజిటల్ లాజిస్టిక్స్, ఓషన్ రోబోటిక్స్. మూడోది- గ్రీన్ ఎనర్జీ: స్వచ్ఛ ఇంధనాలు, సుస్థిర నౌకాయానం. నాలుగోది- నైపుణ్యాభివృద్ధి: మన విశ్వవిద్యాలయాలు, శిక్షణ సంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలు. ఏపీకి వచ్చి ఇక్కడి పోర్టులను సందర్శించాలని, పరిశ్రమల ప్రతినిధులను కలవాలని, మా సాంకేతిక వ్యవస్థలను పరిశీలించాలని, స్వయంగా ఇక్కడి అవకాశాలు తెలుసుకోవాలని ఆసియాన్ దేశాల వ్యాపార ప్రముఖులు, పరిశోధకులు, ప్రతినిధులను ఆహ్వానిస్తున్నా.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ ప్రత్యేకత
సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ముందుకు సాగుతోంది. వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన సమన్వయం, పెట్టుబడి ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో వాస్తవ ప్రాజెక్టులుగా మార్చడంపై మేం దృష్టి సారించాం. సాంకేతికత, పెట్టుబడులు, వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే భాగస్వాములను మేం స్వాగతిస్తున్నాం. వారి ఆలోచనలను వాస్తవరూపంలోకి తీసుకురావడానికి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన భాగస్వామ్యాన్ని కేవలం సమావేశాలు, ఒప్పందాలకే పరిమితం చేయవద్దు. కలిసి ఏదైనా గొప్పగా నిర్మిద్దాం.
ఆసియాన్ దేశాలతో శాశ్వత భాగస్వామ్యాల కోసం ఎదురుచూస్తున్నాం
బంగాళాఖాతం శతాబ్దాలుగా భారత్, ఆగ్నేయాసియా దేశాలను అనుసంధానిస్తోంది. నేడు వాణిజ్యం, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, పెట్టుబడుల రంగాల్లో ఇది కొత్త అవకాశాలను అందిస్తోంది. విశాఖపట్నం ఇక కేవలం ఒక పోర్టు నగరం మాత్రమే కాదు. ఇది తూర్పు దేశాలకు భారతదేశ ముఖద్వారంగా అవతరిస్తోంది. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, వినూత్న ఆలోచనలకు ఒక ప్రధాన ముఖద్వారంగా ఎదుగుతోంది. ఈ ముఖ్యమైన సదస్సును నిర్వహించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, ఇండియా ఫౌండేషన్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆసియాన్ దేశాలతో బలమైన, శాశ్వతమైన భాగస్వామ్యాలను నిర్మించుకోవడానికి ఏపీ ఎదురుచూస్తోంది. శతాబ్దాల క్రితం మన సముద్రాలు నాగరికతలను అనుసంధానించాయి. నేడు అవే సముద్రాలు ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించగలవు, ఉద్యోగాలను సృష్టించగలవు, సుసంపన్నతను తీసుకురాగలవు. బంగాళాఖాతాన్ని కేవలం ఉమ్మడి సముద్రంగానే కాకుండా.. భారత్, ఆసియాన్ దేశాలకు ఉమ్మడి అవకాశాల వేదికగా మారుద్దామని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డా. రామ్ మాధవ్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, భారత నావికాదళ మాజీ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠీతో పాటు వివిధ దేశాల రాయబారులు, ఆసియాన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.







