పల్నాడు వాటర్ గ్రిడ్ పై కేఆర్ఎంబీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
కృష్ణా జలాల పంపిణీ, నాగార్జున సాగర్ నీటి నిల్వల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్ నుంచి అక్రమంగా నిర్మిస్తున్న ‘పల్నాడు వాటర్ గ్రిడ్’ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ బృందంలో పాల్గొని వినతిపత్రం సమర్పించారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డు గానీ, కేంద్ర జల సంఘం అనుమతులు గానీ లేకుండానే ఏపీ ప్రభుత్వం సాగర్ గర్భంలో పల్నాడు డ్రిప్ పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతోందని మండిపడ్డారు. ఇప్పటికే తమ వాటాకు మించి నీటిని వాడుకున్న ఏపీ, ఇప్పుడు రెండో పంట కోసం ఆరాటపడుతోందని విమర్శించారు. “మూడు నెలల్లో 9 టీఎంసీల మంచినీళ్లు తాగుతారా?” అంటూ ఏపీ వైఖరిని ప్రశ్నించిన ఆయన, తెలంగాణలోని రెండున్నర కోట్ల మంది ప్రజలు మంచినీళ్లు తాగకూడదా అని ఏపీ సీఎం చంద్రబాబును నిలదీశారు. పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మాణం గురించి వారం రోజుల క్రితమే తమకు తెలిసిందని కేఆర్ఎంబీ సభ్యులే స్వయంగా చెప్పడం గమనార్హమన్నారు. చిన్న ప్రాజెక్టుల పేరుతో ఏపీ మూడు చోట్ల వాటర్ గ్రిడ్లను నిర్మిస్తోందని, ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో సాగర్ నీళ్లన్నింటినీ దోచుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి కూడా మౌనంగా ఉంటోందని, కాంగ్రెస్ నేతలు కమిషన్ల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో మేడిగడ్డ బ్యారేజీని పేల్చారని అనుమానం కలుగుతోందని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎవరి హయాంలో కట్టారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టం చేసిన ఆయన, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులను వదిలి నల్గొండకు వస్తే ప్రజల మధ్యే తేల్చుకుందామని సవాల్ విసిరారు. కృష్ణా జలాల అన్యాయాన్ని ఎండగడుతూ త్వరలోనే నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.
ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల హైదరాబాద్ నగరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నగరంలో వాటర్ ట్యాంకర్లు దొరకని పరిస్థితి నెలకొందని, తక్షణమే పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. మరో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనంతో ప్రజలు నష్టపోతున్నారని, అటు ఆంధ్ర, ఇటు కర్ణాటక రాష్ట్రాల తీరుతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
బీజేపీ, టీడీపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తుంటే, వారికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. పొరుగు రాష్ట్రం కాలువలు తవ్వుతుంటే ముఖ్యమంత్రికి తెలియకపోవడం దురదృష్టకరమని, అనుమతులు లేవంటూ పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం, పక్క రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కై హైదరాబాద్ ప్రజల గొంతు ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
రాష్ట్రంలో కృష్ణా జలాల అంశాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సాగునీటి అవసరాలతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోట్లాది మంది తాగునీటి భద్రతను ముడిపెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. జలసౌధ వేదికగా కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం ద్వారా న్యాయపరమైన, సాంకేతికపరమైన పోరాటానికి నాంది పలికిన గులాబీ దళం, నల్గొండ బహిరంగ సభ ద్వారా మరో జల ఉద్యమానికి శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించేందుకు సిద్ధమవుతోంది.







