ఉద్యమ గడ్డపై మళ్లీ ‘దీక్షా దివస్’ సమరశంఖం!
తెలంగాణ రాజకీయ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2009లో ఇదే రోజున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఉద్యమ గమనాన్ని మరో మలుపు తిప్పారు. ఆ చారిత్రక ఘట్టానికి ప్రతీకగా ప్రతి ఏటా నిర్వహించే ‘దీక్షా దివస్’ వేడుకలను ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నెల 29న ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా మొదటి నుంచీ గుండెకాయలా నిలిచింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ తన దీక్షను ప్రకటించిన క్షణం నుంచి కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అప్పట్లో విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా కేసీఆర్ దీక్షకు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింగి, చివరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆ ఆమరణ దీక్షే ప్రధాన కారణమని, కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి దశాబ్దాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని బీఆర్ఎస్నేతలు గుర్తుచేస్తున్నారు.
ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో జరగబోయే భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. సభను విజయవంతం చేసేందుకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. కేవలం ఒక సంప్రదాయ వేడుకలా కాకుండా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా, ప్రజలకు ఉద్యమ నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసేలా ఈ సభను రూపొందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారంలో లేని సమయంలో, పార్టీకి ఉన్న బలమైన తెలంగాణ సెంటిమెంట్, ఉద్యమ చరిత్ర అనే ఆయుధాలను మళ్లీ పదును పెట్టే ప్రయత్నంగా దీనిని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను, నాటి త్యాగాలను నేటి తరం యువతకు వివరించడం ద్వారా పార్టీ పట్ల ఉన్న ఆదరణను మరింత పెంచుకోవాలని గులాబీ దళం భావిస్తోంది.
మరోవైపు ఉత్తర తెలంగాణలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి కరీంనగర్ సభ ఒక వేదికగా మారనుంది. కేటీఆర్ తన ప్రసంగం ద్వారా నాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంతో పాటు, ప్రస్తుత రాజకీయ అంశాలపై ఎలాంటి దిశానిర్దేశం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి 2009 నవంబర్ 29న మొదలైన ఆమరణ దీక్ష తెలంగాణ చరిత్రను ఎలా మార్చిందో, 17 ఏళ్ల తర్వాత అదే తేదీన కరీంనగర్లో జరగబోయే ఈ ‘దీక్షా దివస్’ సభ బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి ఎలాంటి ఊపునిస్తుందో వేచి చూడాలి.







