పుట్టపర్తిలో ఆధ్యాత్మిక సందడి.. సత్యసాయి బాబా 101వ జయంతికి భారీ ఏర్పాట్లు..
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి (Puttaparthi) భక్తులతో కళకళలాడుతోంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా (Sri Sathya Sai Baba) 101వ జయంతి సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. నవంబర్ 23న జరగనున్న ప్రధాన జయంతి కార్యక్రమానికి ముందే పుట్టపర్తిలో పండుగ వాతావరణం నెలకొంది. భజనలు, వేద మంత్రాలు, సంగీత కార్యక్రమాలతో ప్రశాంతి నిలయం (Prasanthi Nilayam) ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ (Sri Sathya Sai Central Trust) ఆధ్వర్యంలో నవంబర్ 16 నుంచి 24 వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆశ్రమాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల కోసం వసతి, భోజనం, తాగునీరు వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు, భజనలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు ప్రముఖ కళాకారుల సంగీత ప్రదర్శనలు కూడా ఉత్సవాల్లో భాగంగా కొనసాగుతున్నాయి.
ఈసారి జయంతి వేడుకల్లో సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. ప్రముఖ వేణువాద్య కళాకారుడు పండిట్ రాకేశ్ చౌరాసియా (Pandit Rakesh Chaurasia) తన సంగీత ప్రదర్శనతో భక్తులను అలరించారు. గంగా శశిధరన్ (Ganga Shashidharan) బృందం అందించిన సంగీత కార్యక్రమం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయికుల్వంత్ హాల్ (Sai Kulwant Hall) లో జరుగుతున్న కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సత్యసాయి సందేశాలు, ఆయన జీవిత విశేషాలను మరింత మందికి అందించేందుకు ప్రత్యేక తెలుగు యూట్యూబ్ ఛానల్ను కూడా ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
ఉత్సవాల షెడ్యూల్లో భాగంగా సత్యసాయి సత్యనారాయణ వ్రతం, వేణుగోపాల స్వామి రథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సేవాదళ్ సభ్యుల కోసం అఖిల భారత స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో వేలాది మంది సేవకులు పాల్గొంటున్నారు. నవంబర్ 23న జయంతి ప్రధాన వేడుకలను శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియం (Sri Sathya Sai Hill View Stadium)లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ వేడుకల్లో భాగంగా ఉండనున్నాయి.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై అధికారులు దృష్టి పెట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రేమ, సేవ, మానవత్వం, సమానత్వం అనే విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన సత్యసాయి బాబా బోధనలు ఇప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఆయన జయంతి సందర్భంగా భక్తులు సేవా కార్యక్రమాలు, ప్రార్థనల్లో పాల్గొంటూ తమ ఆధ్యాత్మిక అనుబంధాన్ని చాటుకుంటున్నారు. నవంబర్ 24తో తొమ్మిది రోజుల ఉత్సవాలు ముగియనున్నాయి.







