కాకతీయ గడ్డపై గులాబీ శంఖారావం!
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉద్యమ కాలం నాటి నుంచీ తెలంగాణ ఆత్మగౌరవ నినాదానికి ఊపిరిలూదిన ఈ కాకతీయ గడ్డపై నుంచే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోయే రాజకీయ సమరానికి శంఖారావం పూరించారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన జన చైతన్య సభ వేదికగా, కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనా వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేటీఆర్ తన ప్రసంగంలో కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, కచ్చితమైన గణాంకాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్రంలో 4.71 లక్షల మంది పాత లబ్ధిదారుల పింఛన్లను తొలగించి, కేవలం 4.63 లక్షల కొత్త పింఛన్లను మాత్రమే మంజూరు చేశారని, దీనిని పింఛన్ల పెంపుదలగా ఎలా భావించాలని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వృద్ధులకు నెలకు రూ. 4,000 పింఛన్ ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు.
అలాగే మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం అందించే ‘మహాలక్ష్మి’ హామీపైనా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గడిచిన 36 నెలలుగా ఈ పథకం అమలు కాకపోవడంతో, ప్రతి అర్హురాలైన మహిళకు ప్రభుత్వం రూ. 85,500 చొప్పున బాకీ పడిందని లెక్కలతో సహా వివరించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, కనీసం ప్రతి మహిళకు రూ. 1.50 లక్షలు అందించి లక్షాధికారులను చేసినా తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో 20 శాతం కమిషన్ సంస్కృతి నడుస్తోందని, పారిశ్రామికవేత్తలను బెదిరించి వందల కోట్లు వసూలు చేస్తున్నారని సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేటీఆర్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 ప్రభుత్వ వైద్య కళాశాలలు, మడికొండ ఐటీ పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వచ్చాయని గుర్తు చేశారు. 2,250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయినా, ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. గడిచిన మూడేళ్లలో వరంగల్‌కు ఒక్క కొత్త ఐటీ కంపెనీ కానీ, పరిశ్రమ కానీ రాలేదని, పైగా గతంలో ఉన్న కంపెనీలు మూతపడటంతో వందలాది మంది పట్టభద్రులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములకే ఫ్యూచర్ సిటీ అని పేరు మార్చి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అసలైన భవిష్యత్తు నగరం వరంగల్ అని పేర్కొంటూ, తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని వరంగల్‌ను ఒక ప్రధాన పారిశ్రామిక, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 1,200 మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
కేటీఆర్ పర్యటన కేవలం 2028 సార్వత్రిక ఎన్నికల కోసమే కాకుండా, త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సాగిన వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలుచుకోవడం, ముఖ్యంగా నిరుద్యోగ పట్టభద్రులు, మహిళలు, వృద్ధులను ఆకర్షించడం ద్వారా రాబోయే స్థానిక, మండలి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గట్టి గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్న కేటీఆర్ వ్యాఖ్యలు గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినప్పటికీ, క్షేత్రస్థాయిలో దానిని ఓట్లుగా మలచడంలో బీఆర్ఎస్ ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి.







