“ఈసారికి వదిలేద్దాం”..!: సీఎం రేవంత్ రెడ్డి
అధికార కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో తలెత్తిన అంతర్గత అసమ్మతి స్వరాలకు అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మక అడుగు వేశారు. ఆదివారం జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన అనుసరించిన వైఖరి రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీ నియమావళిని అతిక్రమించి బహిరంగ విమర్శలకు దిగుతున్న నేతలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమైనప్పటికీ, ముఖ్యమంత్రి మాత్రం ‘ఈసారికి క్షమించి వదిలేద్దాం’ అనే సూచించారు. అయితే ఈ క్షమాభిక్ష వెనుక భవిష్యత్తులో నోరు జారితే కఠిన చర్యలు తప్పవన్న గట్టి హెచ్చరిక కూడా దాగి ఉంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వంటి నేతలు ఇటీవలికాలంలో చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని పీఏసీ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు సూచించినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా స్పందించారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో సయోధ్య కుదుర్చుకోవడానికి కొంత అవకాశం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల నూతన ఇన్చార్జి బి.ఎం. సందీప్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో, పార్టీ అంతర్గత సమస్యలను బహిరంగ వేదికలపై కాకుండా పార్టీ వేదికలపైనే చర్చించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తనపై గానీ, మంత్రులపై గానీ ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా రాష్ట్ర ఇన్చార్జికి తెలియజేయాలని ఆయన సూచించారు. “మంచి విషయాలను మైకులో చెప్పాలి, చెడు విషయాలను చెవిలో చెప్పాలి” అన్న ఆయన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పైకి శాంతి మంత్రం జపించినప్పటికీ, అసమ్మతి నేతల కదలికలపై అధిష్టానం పూర్తి నిఘా ఉంచిందని రేవంత్ రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. నేతలు బహిరంగ సభల్లో ఏం మాట్లాడుతున్నారు, రహస్య సమావేశాల్లో ఏం చర్చిస్తున్నారనే పూర్తి సమాచారం పార్టీ వద్ద ఉందని ఆయన వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరి పనితీరును, పార్టీకి వారు చేసిన సేవలను అంచనా వేస్తామని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించడంతో పాటు, పార్టీని బలహీనపరిచే విధంగా వ్యవహరించే వారిని కూడా కచ్చితంగా గుర్తుంచుకుంటామని ఆయన హెచ్చరించారు. గాంధీ భవన్ చుట్టూ లేదా ఢిల్లీ చుట్టూ తిరిగితే పదవులు రావని, గ్రామాలు, గిరిజన తండాలు, పేదల ఇళ్ల వద్దకు వెళ్లి పనిచేస్తేనే పదవులు వాటంతట అవే వస్తాయని ఆయన కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి హెచ్చరికలు, సయోధ్య ప్రయత్నాల నేపథ్యంలోనూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన వైఖరిని మార్చుకోలేదని ఆయన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ప్రజల కోసం పోరాడే విషయంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, తన ప్రయాణం, పోరాటం ఆగదని ఆయన ఆదివారం మరోసారి స్పష్టం చేశారు. ఇది పార్టీలో అంతర్గత విభేదాలు ఇంకా పూర్తిగా సమసిపోలేదనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మొత్తంగా చూస్తే ఒకవైపు అసమ్మతి నేతలకు చివరి అవకాశం ఇస్తూనే, మరోవైపు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే భవిష్యత్తులో రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదన్న సంకేతాలను సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. ఈ వ్యూహం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు ఎంతవరకు అడ్డుకట్ట వేస్తుందో వేచి చూడాలి.







