మస్క్‌కు నిద్రలేని రాత్రులు తప్పవా?! కట్టడి చేసేందుకు కొత్త చట్టం!!
ప్రపంచ కుబేరుడిగా ఎంతటి ప్రభావం చూపిస్తున్నా.. అమెరికా రాజకీయాల్లో మాత్రం ఎలాన్ మస్క్‌కు కొత్త చిక్కులు ఎదురుకాబోతున్నాయా? ఎన్నికల కోసం వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసి తనకు నచ్చిన రాజకీయ శక్తులకు అండగా నిలిచిన మస్క్‌కు ఇప్పుడు అదే వ్యవహారం తలనొప్పిగా మారనుందా? వచ్చే కాంగ్రెస్‌లో ఆయన రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఓ అమెరికా సెనేటర్ రంగంలోకి దిగారు. అంతేకాదు.. మస్క్‌కు అత్యంత భయంకరమైన కలను నిజం చేస్తానంటూ బహిరంగంగానే సవాల్ విసిరారు.
ఇప్పటివరకు అమెరికా రాజకీయాల్లో డబ్బు బలంతో తన ప్రభావాన్ని చాటుకున్న మస్క్‌కు ఇకపై అలాంటి అవకాశం ఉండకూడదన్నది ఈ సెనేటర్ లక్ష్యం. ఎన్నికల్లో బిలియనీర్ల పెత్తనానికి అడ్డుకట్ట వేయడంతో పాటు, వారికి రాజకీయంగా బలం చేకూరుస్తున్న చట్టాన్నే మార్చాలని చూస్తున్నారు. మరి ఈ ప్రయత్నం నిజంగా కార్యరూపం దాలిస్తే మస్క్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అసలు ఆయనను టార్గెట్ చేస్తూ అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతోంది?
ఎన్నికల కోసం రూ.4 వేల కోట్లకు పైగా ఖర్చు!
మస్క్‌ను ఇప్పుడు ఇంతలా టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం 2026 మధ్యంతర ఎన్నికలే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఏకంగా 474 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4,000 కోట్లకు పైమాటే!
అమెరికా రాజకీయ చరిత్రలోనే ఒక వ్యక్తి ఎన్నికల కోసం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది. తన ఆర్థిక బలంతో రిపబ్లికన్లకు అండగా నిలిచిన మస్క్‌కు ఈసారి మాత్రం ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఆయన మద్దతిచ్చిన అభ్యర్థుల్లో చాలామంది ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా టెక్సాస్ సెనేట్ ఎన్నికల్లో దాదాపు 230 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినా, ఆయనకు అనుకూలమైన ఫలితం రాలేదు.
అంతేకాదు.. డెమొక్రాట్లు కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ ఆధిక్యం సాధించడంతో మస్క్‌కు రాజకీయంగా ఎదురుగాలి మొదలైంది. ఇప్పటివరకు తనకు అనుకూలంగా ఉన్న రాజకీయ నాయకుల ద్వారా ప్రభావం చూపించే అవకాశం ఉన్నా, ఇకపై పరిస్థితులు మారనున్నాయి.
అంత డబ్బు ఖర్చు చేసి ఏం సాధించాను?
ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రాకపోవడంతో మస్క్ కూడా తన రాజకీయ ఖర్చులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన.. ఎన్నికల కోసం అంత డబ్బు ఖర్చు చేసి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయానని అంగీకరించారు.
“అంత డబ్బు ఖర్చు చేసి పెద్దగా ఏమీ సాధించలేకపోవడం చూస్తుంటే నాకే చాలా తెలివితక్కువ పని చేసినట్లు అనిపిస్తోంది. మళ్లీ వెనక్కి వెళ్లి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే, బహుశా అంత డబ్బు ఖర్చు చేసేవాడిని కాదు” అని వ్యాఖ్యానించారు.
అయితే తన మద్దతు లేకపోయి ఉంటే రిపబ్లికన్ల పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు ఒక్కటే విజయాన్ని నిర్ణయించలేదని ఈ ఫలితాలు నిరూపించాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మస్క్‌కు అడ్డుకట్ట వేయడానికి కొత్త చట్టం!
ఇప్పుడు అలెక్స్ పడిల్లా అసలు గురి ఇక్కడే ఉంది. అమెరికాలో ఎన్నికల ప్రచారం కోసం సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు భారీగా డబ్బు ఖర్చు చేయడానికి అవకాశం కల్పిస్తున్న నిబంధనలను మార్చాలని ఆయన భావిస్తున్నారు.
ముఖ్యంగా 2010లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ‘సిటిజన్స్ యునైటెడ్’ తీర్పును రద్దు చేయాలన్నది ఆయన ప్రతిపాదన. ఈ తీర్పు కారణంగా కార్పొరేట్ సంస్థలు, కార్మిక సంఘాలు స్వతంత్ర ఎన్నికల ప్రచారం కోసం భారీగా ఖర్చు చేయడానికి మార్గం ఏర్పడింది. దీనివల్ల బిలియనీర్లు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు పరోక్షంగా పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేయగలుగుతున్నారు.
ఈ విధానమే మస్క్ లాంటి సంపన్నులకు రాజకీయాల్లో విపరీతమైన ప్రభావాన్ని కల్పిస్తోందని పడిల్లా వాదిస్తున్నారు. అందుకే వచ్చే ఏడాది రాజ్యాంగ సవరణ ద్వారా ఈ తీర్పును రద్దు చేసే ప్రయత్నానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించారు.
అయితే ఈ ప్రతిపాదన ఆమోదం పొందడం అంత సులభం కాదు. అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు ఇవ్వాలి. ఆ తర్వాత దేశంలోని నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. అంటే పడిల్లా ముందున్నది పెద్ద రాజకీయ సవాలే.
మస్క్ వ్యాపారాలపైనా విచారణల ముప్పు?
ఈ వ్యవహారం కేవలం ఎన్నికల ఖర్చుల దగ్గరే ఆగిపోయేలా కనిపించడం లేదు. మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్, స్టార్‌లింక్ వంటి సంస్థలకు అమెరికా ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లో డెమొక్రాట్లకు ఆధిక్యం రావడంతో ఈ ఒప్పందాలు, ప్రభుత్వంతో మస్క్‌కు ఉన్న సంబంధాలు, ఆయన గతంలో ప్రభుత్వ వ్యవహారాల్లో పోషించిన పాత్రపై మరింత నిఘా పెరిగే అవకాశముంది.
మస్క్ రాజకీయంగా మద్దతిచ్చిన అభ్యర్థులు ఓడిపోవడం, ఆయన వ్యాపారాలకు సంబంధించిన అంశాలపై విచారణలు జరగాలన్న డిమాండ్లు పెరగడం.. ఇవన్నీ ఆయనకు కొత్త సవాళ్లుగా మారవచ్చు. అయితే ప్రభుత్వ ఒప్పందాలు వెంటనే రద్దవుతాయని చెప్పలేం. వాటిపై నిర్ణయం తీసుకునే అధికారాలు సంబంధిత ప్రభుత్వ సంస్థలకే ఉంటాయి.
మరోవైపు సెనేటర్ బెర్నీ శాండర్స్ కూడా మస్క్ రాజకీయ ఖర్చులపై తీవ్రంగా స్పందించారు. ఒక బిలియనీర్ ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేయడానికి వందల మిలియన్ డాలర్లు ఖర్చు చేసే అవకాశం కల్పిస్తున్న ఎన్నికల వ్యవస్థనే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.
నిజంగానే మస్క్ రాజకీయాలకు బ్రేక్ పడుతుందా?
ఇప్పటివరకు తన సంపదతో అమెరికా రాజకీయాల్లోనూ ప్రభావం చూపించిన మస్క్‌కు ఇప్పుడు పరిస్థితులు కొంత ప్రతికూలంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడం.. మరోవైపు డెమొక్రాట్లు ఆయన రాజకీయ ప్రభావాన్ని తగ్గించేందుకు కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







