తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం రాబోతున్నారా..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కతో పాటు, వెనుకబడిన తరగతుల (బీసీ) సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతకు అదనంగా మరో డిప్యూటీ సీఎం పీఠాన్ని కట్టబెట్టాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం ఢిల్లీ హైకమాండ్ వరకూ చేరినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, ఈ ప్రతిపాదన తెలంగాణ కాంగ్రెస్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది.
రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రభుత్వంలో మరింత కీలక వాటా దక్కాలన్నది ఆ సామాజిక వర్గ నేతల ప్రధాన వాదన. అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిత్యం వినిపిస్తున్న ‘జనాభా దామాషా ప్రకారం వాటా’ నినాదాన్ని తెలంగాణలోనూ ఆచరణలో పెట్టి చూపించాలని బీసీ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారంటూ చేసిన వ్యాఖ్యలు ఈ సామాజిక వర్గంలో ఆశలను మరింత పెంచాయి.
ఈ డిమాండ్ వెనుక బలమైన ఎన్నికల వ్యూహం దాగి ఉంది. రాష్ట్రంలో బలమైన బీసీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడానికి ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలంటే, క్షేత్రస్థాయిలో ఆ వర్గానికి పూర్తి భరోసా కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్కు ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ ఏ జాబితాలో చేర్చే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం వంటి చర్యలు బహుజన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నంలో భాగమే. అయితే, కేబినెట్లో అత్యున్నత పదవిని అప్పగించడం ద్వారానే ఆ వర్గంలో శాశ్వత విశ్వాసం నింపగలమని బీసీ నేతలు అధిష్టానానికి వివరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు రెండో డిప్యూటీ సీఎం ప్రతిపాదనపై పార్టీలోని ఇతర వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి వంటి బీసీ మంత్రులు ఉన్నారు. అంతేకాకుండా, పార్టీ పగ్గాలు కూడా బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ చేతిలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఉపముఖ్యమంత్రి పదవిని సృష్టిస్తే పరిపాలనలో అధికార కేంద్రాలు పెరిగి, సమన్వయ లోపం తలెత్తే ప్రమాదం ఉందని ఒక వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో తొలినాళ్లలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు (మహమూద్ అలీ, రాజయ్య/కడియం శ్రీహరి) ఉన్నప్పటికీ, రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ పదవిని పూర్తిగా పక్కనపెట్టిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు.
మొత్తానికి డిసెంబర్లో జరగనున్న కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్కు పెద్ద పరీక్షగా మారనుంది. బీసీ నేతల ఒత్తిడికి తలొగ్గి రాహుల్ గాంధీ రెండో డిప్యూటీ సీఎం పదవికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక కేవలం మంత్రి పదవుల భర్తీ, కీలక శాఖల కేటాయింపులతోనే సామాజిక సమీకరణాలను సరిచేస్తారా? అన్నది వేచి చూడాలి.







