పని ఒత్తిడి, అలసటకు బైబై చెప్పండి.. ఈ 5 యోగా ఆసనాలు ట్రై చేయండి!
పండుగలు, సెలవులు అంటేనే సరదా, సంతోషం అనుకుంటాం. కానీ ప్రయాణాల హడావిడి, షాపింగ్, ఇంటి పనులు, అతిథుల రాకపోకలు, కుటుంబ బాధ్యతలతో చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. సెలవుల్లో విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి మరింత అలసిపోతుంటారు. కొందరికి చిరాకు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఖరీదైన స్పా ట్రీట్మెంట్లు, ప్రత్యేకమైన వ్యాయామాలు అవసరం లేదు. ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు కేటాయించి కొన్ని సులభమైన యోగా ఆసనాలు, శ్వాస వ్యాయామాలు చేస్తే శరీరానికి, మనసుకు కొంత ఉపశమనం లభిస్తుంది.
శ్వాస వ్యాయామంతో మనసుకు ప్రశాంతత
రోజువారీ పనుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం ఉపయోగపడుతుంది. యోగా మ్యాట్‌పై లేదా నేలపై సౌకర్యంగా కూర్చుని ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. ఆ తర్వాత అంతే నెమ్మదిగా వదలాలి. ఇలా రెండు నిమిషాల పాటు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారేందుకు, ఆందోళన తగ్గేందుకు సహాయపడుతుంది.
వెన్ను, భుజాల బిగుతు తగ్గించే ఆసనాలు
ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారికి వెన్ను, భుజాల దగ్గర బిగుతు ఏర్పడుతుంది. అలాంటివారు సీటెడ్ క్యాట్ అండ్ కౌ పోజ్ (Seated Cat-Cow Pose) ప్రయత్నించవచ్చు. కుర్చీలో లేదా నేలపై నిటారుగా కూర్చుని, గాలి పీల్చేటప్పుడు ఛాతీని కొద్దిగా ముందుకు తెచ్చి వెన్నెముకను సున్నితంగా వంచాలి. గాలి వదిలేటప్పుడు వీపును కొద్దిగా గుండ్రంగా చేసి తలను ముందుకు వంచాలి. ఇలా 5 నుంచి 8 సార్లు చేయడం వల్ల వెన్ను కండరాలకు ఉపశమనం లభిస్తుంది.
అలాగే భుజాల కదలికలు (Shoulder Rolls) కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. రెండు భుజాలను నెమ్మదిగా పైకి లేపి వెనక్కి తిప్పుతూ కిందకు వదలాలి. ఇదే విధంగా ముందుకు కూడా తిప్పాలి. సుమారు ఒక నిమిషం పాటు ఈ వ్యాయామం చేయవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
బాలాసనం, శవాసనంతో శరీరానికి విశ్రాంతి
బాలాసనం (Child’s Pose) కూడా శరీరానికి విశ్రాంతినిచ్చే సులభమైన యోగా ఆసనం. మోకాళ్లపై కూర్చుని శరీరాన్ని ముందుకు వంచి నుదుటిని నేలకు ఆనించాలి. చేతులను ముందుకు చాపి సౌకర్యంగా శ్వాస తీసుకోవాలి. కొద్దిసేపు ఇదే స్థితిలో ఉండటం వల్ల వీపు, నడుము ప్రాంతంలోని బిగుతు తగ్గవచ్చు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఆసనాన్ని బలవంతంగా చేయకూడదు.
రోజంతా పేరుకుపోయిన అలసటను తగ్గించుకోవడానికి శవాసనం (Savasana) మంచి ఎంపిక. యోగా మ్యాట్‌పై వెల్లకిలా పడుకుని చేతులు, కాళ్లను సౌకర్యంగా ఉంచాలి. కళ్లను మూసుకుని శ్వాసను సహజంగా తీసుకుంటూ శరీరంలోని ప్రతి భాగాన్ని రిలాక్స్ చేయాలి. రెండు నిమిషాల పాటు ఈ స్థితిలో ఉండటం వల్ల మనసుకు ప్రశాంతత కలగవచ్చు.
రోజూ 10 నిమిషాలు యోగా కోసం కేటాయించండి
ఈ చిన్నపాటి యోగా అభ్యాసానికి రోజుకు పది నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా సాయంత్రం పనులు పూర్తయ్యాక వీటిని చేయవచ్చు. అయితే యోగా చేసేటప్పుడు శరీరంపై ఒత్తిడి పెట్టకూడదు. నొప్పి, అసౌకర్యం కలిగితే వెంటనే ఆపాలి. గర్భిణులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా గాయాలు ఉన్నవారు నిపుణుల సలహా తీసుకోవాలి.
ఒత్తిడిని పూర్తిగా దూరం చేయడానికి ఒక్క యోగా సెషన్ సరిపోకపోవచ్చు. కానీ ప్రతిరోజూ కొద్దిసేపు మన కోసం కేటాయించుకోవడం మంచి అలవాటు. సెలవుల హడావిడిలో మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. రోజుకు పది నిమిషాలు యోగాకు కేటాయించి శరీరానికి, మనసుకు విశ్రాంతి ఇవ్వండి.







