‘గోల్డ్ మ్యాన్’ బినామీ సామ్రాజ్యంపై ఐటీ కొరడా!
సోషల్ మీడియా వేదికలపై కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి, విలాసవంతమైన జీవనశైలితో యువతను ఆకర్షిస్తున్న ‘గోల్డ్ మ్యాన్’ల వ్యవహారంపై ఇప్పుడు ఐటీ శాఖ దృష్టి సారించింది. తెలంగాణ గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల ఆదాయపు పన్ను శాఖలోని బినామీ ఆస్తుల నిరోధక విభాగం రాయదుర్గంలోని ఓ భారీ నివాస భవనాన్ని, దాని అద్దె ఆదాయాన్ని తాత్కాలికంగా అటాచ్ చేయడం ఈ కేసులో కీలక మలుపు.
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ నవ్ ఖల్సా గ్రామంలోని 222 చదరపు గజాల స్థలాన్ని 2019 జూలై 1న యాదగిరి ప్రణయ్ గౌడ్ పేరు మీద రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో ప్రణయ్ కేవలం ఒక విద్యార్థి. ఎలాంటి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేని వ్యక్తి రూ. 26.70 లక్షల విలువైన స్థలాన్ని ఎలా కొనుగోలు చేశారన్నది ఐటీ అధికారుల ప్రధాన ప్రశ్న. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం రూ. 1.7 లక్షలు నగదు రూపంలో, మిగిలిన రూ. 25 లక్షలు మూడు బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లించారు. ఆ తర్వాత ఆ స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రతి అంతస్తులో రెండు 2BHK ఫ్లాట్లు చొప్పున ఈ భారీ భవంతిని కట్టారు.
ఇవి కూడా చదవండి
ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ప్రణయ్ గౌడ్, చిన్న గౌడ్ కుమారుడి బావమరిది. విచారణలో భాగంగా ప్రణయ్ తన బావ ద్వారానే ఈ నిధులు సమకూరాయని, తనకు సొంతంగా ఆస్తి కొనే స్తోమత లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ప్రణయ్ బావ ఇచ్చిన వాంగ్మూలంలో తానే స్థలం కొనుగోలుకు, భవన నిర్మాణానికి అవసరమైన డబ్బు ఇచ్చానని, నిర్మాణదారులకు చెల్లించడానికి తనఖా రుణం కూడా సేకరించానని అంగీకరించారు. అయితే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి రుణ ఒప్పంద పత్రాలు లేకపోవడం అధికారుల అనుమానాలకు బలం చేకూర్చింది.
ఈ భవనం ద్వారా నెలకు రూ. 3.20 లక్షల అద్దె ఆదాయం వస్తోంది. ఆస్తి పత్రాల ప్రకారం ప్రణయ్ యజమాని అయినప్పటికీ, అద్దె డబ్బులు మాత్రం ప్రణయ్ బావ భార్యకు చెందిన సిటీ యూనియన్ బ్యాంక్ ఖాతాలోకి జమయ్యాయి. ఆ ఆస్తిపై ఆమెకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేకపోయినా, ఆమె ఖాతా నుంచి తిరిగి ఆమె భర్త ఖాతాలకు ఆ నగదు బదిలీ అయినట్లు ఐటీ అధికారులు ఆధారాలు సేకరించారు. తాను ఇచ్చిన అప్పుకు బదులుగా నెలకు రూ. 1.76 లక్షల చొప్పున అద్దె రూపంలో తీసుకుంటున్నానని ప్రణయ్ బావ చెప్పిన సమాధానాన్ని అధికారులు తోసిపుచ్చారు. ఉమ్మడి లీజు ఒప్పందాలు, నగదు బదిలీ మార్గాలను విశ్లేషించిన ఐటీ విభాగం, బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం ప్రకారం నవంబర్ 17న జాయింట్ కమిషనర్ అనుమతితో ఈ ఆస్తిని నిషేధిత జాబితాలో చేర్చారు. తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సమాచారం అందించి, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆస్తిని విక్రయించకుండా లేదా బదిలీ చేయకుండా నిషేధం విధించారు.
ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం చిన్న గౌడ్ ఇచ్చిన టీవీ, యూట్యూబ్ ఇంటర్వ్యూలే. 2026 ఏప్రిల్ 3న ఐటీ అధికారులు ఆదాయపు పన్ను చట్టం కింద ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన వద్ద లభించిన 900 గ్రాముల బంగారంలో, 700 గ్రాములకు సరైన లెక్కలు లేకపోవడంతో అధికారులు వాటిని జప్తు చేశారు. ఆ బంగారం విలువ సుమారు రూ. కోటి ఉంటుందని, అద్దెలు, భూలావాదేవీల ద్వారా అది సమకూరిందని చిన్న గౌడ్ పేర్కొన్నప్పటికీ, సరైన ఆధారాలు చూపలేకపోయారు. విడ్డూరమేమిటంటే, కోట్ల రూపాయల ఆస్తులు, కిలోల కొద్దీ బంగారం ప్రదర్శించే ఆయన తన ఐటీ రిటర్నుల్లో మాత్రం కేవలం రూ. 4 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపించారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతదారులను పట్టుకోవడానికి దర్యాప్తు సంస్థలు కేవలం బ్యాంకు ఖాతాలపైనే ఆధారపడటం లేదు. సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ వీడియోలు, జీవనశైలి ప్రదర్శనలను కూడా ఆధారాలుగా తీసుకుని ‘డేటా అనలిటిక్స్’ ద్వారా విశ్లేషిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులను బినామీ పేర్లతో దాచిపెట్టవచ్చనే పాతకాలపు ఆలోచనలకు ఈ కేసు ఒక గట్టి హెచ్చరిక. పారదర్శకమైన ఆర్థిక లావాదేవీలు లేకపోతే, అక్రమ మార్గంలో కూడబెట్టిన సంపద ఏదో ఒకరోజు చట్టం ఉచ్చులో చిక్కక తప్పదని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది.







