‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
హైదరాబాద్ కి చెందని ప్రముఖ సాంకేతిక నిపుణుడు చెన్న కేశవులు కుమ్మరి రచించిన ఏఐ కెన్ రైట్ ద కోడ్: హూ గెట్స్ ఇట్ ఇంటు ప్రొడక్షన్’’ అనే పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆవిష్కరించారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఇంజినీర్లకు అందుబాటులోకి రానున్న కొత్త ఉద్యోగ అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలను ఈ పుస్తకం వివరిస్తుంది.
ఏఐ సాధనాలు క్షణాల్లో సాఫ్ట్వేర్ కోడ్ రాయగలుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీర్ల పాత్ర ఏమిటన్న ప్రశ్నకు ఈ పుస్తకం సమాధానం చూపిస్తుంది. కోడ్ రాయడం కంటే, ఏఐ వ్యవస్థలను వాస్తవ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించడం, సంస్థల డేటాతో అనుసంధానించడం, భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడటం, తక్కువ వ్యయంతో సమర్థంగా పనిచేసేలా చేసి వినియోగంలోకి తీసుకురావడమే అసలైన సవాల్ అని రచయిత తెలిపారు.
మరోవైపు ఏఐ యుగంలో ఉద్యోగుల పాత్ర ఏమిటి? అన్న అంశాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వ్యాపార సంస్థలతో నేరుగా పనిచేస్తూ, వాటి అవసరాలకు అనుగుణంగా ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేసి, సురక్షితంగా అమలయ్యే వరకు బాధ్యత తీసుకునే ఇంజినీర్లకు భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉంటాయని పేర్కొంది. మొత్తం 24 అధ్యాయాలుగా రూపొందిన ఈ పుస్తకంలో ఏఐ రిట్రీవల్ సిస్టమ్స్, ఏఐ ఏజెంట్లు, భద్రత, డిప్లాయ్‌మెంట్, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను భారతీయ పరిశ్రమల ఉదాహరణలతో వివరించారు.
ఇవి కూడా చదవండి
సాఫ్ట్వేర్, క్లౌడ్, డెవాప్స్ ఇంజినీర్లతో పాటు ఏఐ రంగంలోకి ప్రవేశించాలనుకునే విద్యార్థులు, ఫ్రెషర్లు, సాంకేతిక సంస్థల నాయకులకు ఈ పుస్తకం ఉపయోగపడనుంది. ఏఐ కోడ్ రాయగలిగినా, వాస్తవ సమస్యలను అర్థం చేసుకుని, సాంకేతికతను నిజ జీవిత అవసరాలకు అనుసంధానించి, సురక్షితంగా పనిచేసేలా చేయడం ఇంజినీర్ల బాధ్యత అని రచయిత చెన్నకేశవులు కుమ్మరి పేర్కొన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించి, నూతన తరం ఏఐ ఇంజినీర్లను ప్రోత్సహించిన కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలోనే రెండో పుస్తకం కూడా విడుదల…
కేశవ్ రచించిన రెండో పుస్తకం ‘యూజ్ ఏఐ, స్టే రిలెవెంట్: హౌ టు థింక్, వర్క్, అండ్ థ్రైవ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ త్వరలో విడుదల కానుంది. ఇది కేవలం ఇంజినీర్లకే కాకుండా విద్యార్థులు, ఉద్యోగులు, ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు సహా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా రూపొందించారు. సులభమైన భాషలో భారతీయ కార్యాలయాల అనుభవాలు, సిద్ధంగా ఉపయోగించుకోగల ప్రాంప్ట్‌లు, 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా రోజువారీ పనుల్లో ఏఐని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తుంది.
ప్రతుల కోసం సంప్రదించాలంటే…
రచయిత చెన్నకేశవులు కుమ్మరి హైదరాబాద్‌లోని సీ3ఆప్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు. ఏఐ ఎఫ్‌డీఈ ఆర్కిటెక్ట్‌గా, మెంటార్‌గా పనిచేస్తూ, ఏఐ ఆలోచనలను వాస్తవ వ్యాపార అవసరాలకు అనుగుణంగా అమలు చేసే వ్యవస్థలుగా రూపొందించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ రెండు పుస్తకాలు పేపర్‌బ్యాక్, కిండిల్ రూపాల్లో అందుబాటులోకి రానున్నాయి. పుస్తకాల వివరాలు, ప్రతుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో @kesavkummari ద్వారా సంప్రదించవచ్చని రచయిత తెలిపారు.







