పిల్లలు మాట వినడం లేదా? కొట్టకుండా, అరవకుండా దారిలో పెట్టే మార్గాలివే!
పిల్లలు చెప్పిన మాట వినకపోతే చాలామంది తల్లిదండ్రులు వెంటనే కోపం తెచ్చుకుంటారు. కొందరు గట్టిగా అరుస్తారు. మరికొందరు దండిస్తేనే పిల్లలు దారిలోకి వస్తారని భావిస్తారు. కానీ పిల్లల ప్రవర్తనను మార్చడానికి భయం ఒక్కటే మార్గం కాదు. వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ, సరైన పద్ధతిలో వ్యవహరిస్తే కొట్టకుండా, అరవకుండా కూడా క్రమశిక్షణ నేర్పించవచ్చు. ఇందుకోసం తల్లిదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ ప్రేమతో క్రమశిక్షణ నేర్పించండి

ముందుగా పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోండి : చిన్నపిల్లలకు తమ భావాలను సరిగ్గా వ్యక్తపరచడం, కోపాన్ని నియంత్రించుకోవడం వెంటనే సాధ్యం కాదు. తమకు నచ్చినది జరగకపోతే ఏడవడం, అరవడం, మొండిగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు వారిపై కోప్పడకుండా, అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వారి భావాలను గుర్తించి, ప్రశాంతంగా మాట్లాడాలి. భయపెట్టడం, చీకటి గదిలో వేస్తానని బెదిరించడం వంటి పద్ధతులకు దూరంగా ఉండాలి.
మీరు ఎలా ఉంటారో పిల్లలూ అలాగే నేర్చుకుంటారు : పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటల కంటే వారి ప్రవర్తనను ఎక్కువగా గమనిస్తారు. ఇంట్లో పెద్దలు చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, గట్టిగా అరవడం, గొడవపడటం చేస్తుంటే పిల్లలు కూడా అదే ప్రవర్తనను అనుకరించే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు ప్రశాంతంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ముందుగా తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు గట్టిగా అరిచే బదులు, ప్రశాంతంగా తమ అసంతృప్తిని తెలియజేయాలి.
ఇవి కూడా చదవండి
ప్రేమతో పాటు ఇంటి నియమాలు కూడా ఉండాలి : పిల్లలు అడిగిన ప్రతిదీ కొనివ్వడం, వారు కోరుకున్న ప్రతిసారీ అనుమతించడం మంచి పేరెంటింగ్ కాదు. ప్రేమ చూపించడంతో పాటు ఏది సరైనది, ఏది తప్పు అనే విషయాన్ని కూడా నేర్పించాలి. ఇంట్లో కొన్ని స్పష్టమైన నియమాలు ఉండాలి. ఉదాహరణకు.. చదువుకునే సమయం, ఆడుకునే సమయం, మొబైల్ వాడే సమయం వంటి వాటిపై ముందుగానే హద్దులు నిర్ణయించాలి. పిల్లలు ఆ నియమాలను ఉల్లంఘించినప్పుడు కొట్టడం లేదా అరవడం కాకుండా, దాని వల్ల కలిగే పరిణామాలను వివరించాలి. చెప్పిన నియమాలను తల్లిదండ్రులు కూడా స్థిరంగా పాటించాలి.
పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు

పిల్లలపై మీ ఆశయాలను రుద్దకండి : ప్రతి తల్లిదండ్రికి తమ పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే తమకు నచ్చిన చదువు, క్రీడ లేదా వృత్తినే పిల్లలు ఎంచుకోవాలని బలవంతం చేయకూడదు. చిన్న వయసులోనే వారికి ఒక కెరీర్‌ను నిర్ణయించేయకుండా వివిధ రంగాలను పరిచయం చేయాలి. వారి ఆసక్తులు, సామర్థ్యాలను గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలి. ఒక రంగంలో విజయం సాధించకపోయినా నిరాశపరచకుండా, మరో అవకాశాన్ని ప్రయత్నించేలా ప్రోత్సహించాలి.
పిల్లలకు కోపాన్ని నియంత్రించుకోవడం నేర్పించండి : పిల్లలు కోపంతో ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా అదే స్థాయిలో కోపంగా స్పందిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. అలాంటప్పుడు కొంత సమయం తీసుకుని ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న తర్వాత మాట్లాడాలి. కోపం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి? నచ్చని విషయాన్ని ఎలా చెప్పాలి? ఇతరులతో ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలను రోజువారీ జీవితంలో నేర్పించాలి. అవసరమైనప్పుడు పిల్లలకు ఎంపికలు ఇవ్వడం, వారి మాట వినడం కూడా ముఖ్యం.
మంచి పేరెంట్‌గా కాదు.. సరైన పేరెంట్‌గా ఉండండి : పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకోవడం సహజమే. కానీ వారు అడిగిన ప్రతిదీ ఇవ్వడం, ప్రతి తప్పును సమర్థించడం సరైన పద్ధతి కాదు. అవసరమైనప్పుడు ప్రేమగా కానీ దృఢంగా ‘నో’ చెప్పగలగాలి. అదే సమయంలో క్రమశిక్షణ పేరుతో పిల్లలను అవమానించడం, కొట్టడం, భయపెట్టడం చేయకూడదు. పిల్లలకు స్వతంత్రంగా ఆలోచించడం, సమస్యలను ఎదుర్కోవడం, తమ భావాలను నియంత్రించుకోవడం నేర్పించాలి.
పిల్లలు మాట వినాలంటే వారిలో భయాన్ని పెంచాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులపై నమ్మకం, ఇంట్లో స్పష్టమైన నియమాలు, ప్రేమతో కూడిన మార్గదర్శకత్వం ఉంటే పిల్లలు క్రమంగా బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చుకుంటారు.







