ఆవాల ఘాటుతో కాలీఫ్లవర్ ఆవకాయ.. ఇలా చేస్తే ఆ రుచికి నోరూరాల్సిందే!
మామిడికాయ ఆవకాయ అంటే ఇష్టపడని వారు ఉండరేమో! వేడివేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ, పైన నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే మామిడికాయల సీజన్‌తో సంబంధం లేకుండా ఇంట్లోనే మరో రకం ఆవకాయ తయారు చేసుకోవచ్చు. అదే కాలీఫ్లవర్ ఆవకాయ. కారం, ఆవాల ఘాటు, నిమ్మకాయ పులుపుతో తయారయ్యే ఈ పచ్చడి అన్నంతోనే కాకుండా పెరుగు అన్నం, చపాతీల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కాలీఫ్లవర్ ఆవకాయకు కావాల్సిన పదార్థాలు

కాలీఫ్లవర్ పువ్వులు – 500 గ్రాములు, కారం – 100 గ్రాములు, ఆవాల పొడి – 50 గ్రాములు, ఉప్పు – తగినంత, పసుపు – 1 టీస్పూన్, మెంతుల పొడి – 1 టీస్పూన్, నిమ్మరసం – అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 10 నుంచి 12, నూనె – ఒక కప్పు తీసుకోవాలి. రుచి, కారం స్థాయిని బట్టి కొలతలను కొద్దిగా మార్చుకోవచ్చు.
కాలీఫ్లవర్ ఆవకాయ తయారీ విధానం…

ముందుగా కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని గోరువెచ్చని ఉప్పు నీటిలో కొద్దిసేపు ఉంచి, శుభ్రంగా కడిగి నీటిని పూర్తిగా వడకట్టాలి. అనంతరం శుభ్రమైన వస్త్రంపై పరిచి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో కారం, ఆవాల పొడి, మెంతుల పొడి, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలా కలపాలి.
ఇవి కూడా చదవండి
మరోవైపు నూనెను వేడి చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ నూనెను కాలీఫ్లవర్ మిశ్రమంలో పోసి బాగా కలపాలి. శుభ్రమైన పొడి గిన్నెలోకి తీసుకుని మూత పెట్టాలి. మసాలాలు బాగా పట్టేందుకు ఒక రోజు పాటు ఫ్రిజ్‌లో ఉంచి, మధ్యలో ఒకసారి కలుపుకోవచ్చు.
ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ జాగ్రత్తలు..

కాలీఫ్లవర్‌లో సహజంగానే తేమ ఎక్కువగా ఉంటుంది. అందుకే పచ్చడి తయారీలో ముక్కలపై నీటి తేమ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తేమ మిగిలితే పచ్చడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
పచ్చడిని ఎప్పుడూ శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేయాలి. తీసుకునేటప్పుడు తడి చెంచా ఉపయోగించకూడదు. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో ఉంచి, చిన్న చిన్న పరిమాణాల్లో తీసుకుంటూ వాడటం మంచిది. వాసన, రంగు లేదా బూజులో మార్పులు కనిపిస్తే తినకూడదు.
ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న కాలీఫ్లవర్ ఆవకాయతో రోజువారీ భోజనానికి కొత్త రుచిని జోడించుకోవచ్చు! కాలీఫ్లవర్ ఆవకాయను వేడివేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే అద్భుతమైన రుచి ఉంటుంది. అంతేకాదు పెరుగు అన్నం, దోశ, ఇడ్లీ వంటి టిఫిన్లతో కూడా తినవచ్చు. సాధారణ కాలీఫ్లవర్ కూరలకు భిన్నంగా ఉండే ఈ ఆంధ్ర స్టైల్ పచ్చడిని ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి!







