AI కంపెనీలకి ట్రంప్ షాకింగ్ వార్నింగ్… అమెరికాకు కొత్త టెన్షన్!
ఏఐ (AI) రంగంలో ప్రపంచ ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికా గట్టిగానే ప్రయత్నిస్తూన్న సంగతి తెలిసిందే. చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ టెక్నాలజీలు వేగంగా విస్తరిస్తుండటంతో భారీ సంఖ్యలో డేటా సెంటర్ల నిర్మాణం అవసరమవుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ కంపెనీలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అమెరికన్ కంపెనీలు విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీ పన్నులు విధిస్తామంటూ ఆయన హెచ్చరించడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విదేశాల్లో నిర్మిస్తే భారీ పన్నులే!
అమెరికా కంపెనీలు ఇతర దేశాల్లో డేటా సెంటర్లు నిర్మించడాన్ని తాము అనుమతించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. అమెరికన్ కంపెనీలు దేశం బయట డేటా సెంటర్లు నిర్మించకుండా అడ్డుకుంటామని, అలా చేస్తే భారీగా పన్నులు విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం చాలా గట్టిగా వ్యవహరిస్తుందని చెప్పారు.
అయితే ట్రంప్ చేసిన ప్రకటనలో కొన్ని కీలక విషయాలు ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ పన్నులు ఎంత శాతం ఉంటాయి? ఏయే కంపెనీలకు వర్తిస్తాయి? ఇప్పటికే విదేశాల్లో నిర్మాణాలు చేపట్టిన సంస్థల పరిస్థితి ఏంటి? వంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. అంతేకాదు, ఈ నిర్ణయంపై తన ప్రభుత్వ అధికారులకు కూడా ఇంకా సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. దీంతో ట్రంప్ ప్రకటన వెనుక ఉన్న అసలు కార్యాచరణ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
డేటా సెంటర్లపైనే ఎందుకింత ఫోకస్?
ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగంలో డేటా సెంటర్లు అత్యంత కీలకంగా మారాయి. మనం రోజూ ఉపయోగించే సోషల్ మీడియా, ఈమెయిల్స్, వీడియో స్ట్రీమింగ్, వెబ్సైట్లు వంటి సేవలన్నింటికీ ఇవే ఆధారం. భారీ సర్వర్లు, నెట్వర్కింగ్ పరికరాలు, డేటా నిల్వ వ్యవస్థలు ఉండే ఈ కేంద్రాలు ఇంటర్నెట్ ప్రపంచానికి వెన్నెముక లాంటివి.
ముఖ్యంగా ఏఐ రాకతో వీటి అవసరం ఊహించని స్థాయికి చేరుకుంది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం, భారీ డేటాను విశ్లేషించడం, వినియోగదారులకు వేగంగా సమాధానాలు అందించడం వంటి పనులకు అపారమైన కంప్యూటింగ్ శక్తి అవసరం. అందుకే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు డేటా సెంటర్ల నిర్మాణంపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ దశాబ్దం ముగిసేలోపు ప్రపంచవ్యాప్తంగా ఏఐ అవసరాలకు సరిపడా కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించేందుకు సుమారు 6.7 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని ఒక అంచనా చెబుతోంది.
ఇవి కూడా చదవండి
అమెరికాలోనే వేల సంఖ్యలో డేటా సెంటర్ల నిర్మాణం!
ప్రస్తుతం అమెరికాలో సుమారు 3,000 డేటా సెంటర్లు పనిచేస్తున్నాయి. మరో 1,500 నుంచి 3,000 వరకు కొత్త కేంద్రాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ఉన్న కేంద్రాల కంటే చాలా పెద్దవిగా ఉండబోతున్నాయి. అంతేకాదు, ఇప్పటివరకు ఎక్కువగా నగర ప్రాంతాల్లోనే డేటా సెంటర్లు ఉండగా, కొత్తగా ప్రతిపాదిస్తున్న వాటిలో మూడింట రెండొంతులకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించనున్నారు.
అయితే ఇక్కడే అమెరికాకు మరో సమస్య ఎదురవుతోంది. ట్రంప్ ప్రభుత్వం మరిన్ని డేటా సెంటర్లు నిర్మించాలని పట్టుబడుతుంటే, వాటిని తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
సొంత దేశ ప్రజల నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ!
ఒకప్పుడు డేటా సెంటర్ల గురించి పెద్దగా పట్టించుకోని అమెరికన్లు ఇప్పుడు వాటి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఉద్యమిస్తున్నారు. తమ ఇళ్లకు దగ్గరగా కొత్త డేటా సెంటర్లు రావడం వల్ల విద్యుత్ బిల్లులు పెరుగుతాయని, నీటి వనరులపై ఒత్తిడి పడుతుందని, శబ్ద కాలుష్యం కూడా పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.
హీట్‌మ్యాప్ నిర్వహించిన సర్వే ప్రకారం, తమ నివాస ప్రాంతాలకు సమీపంలో కొత్త డేటా సెంటర్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అమెరికన్ల సంఖ్య కేవలం తొమ్మిది నెలల్లోనే 24 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. ఈ వ్యతిరేకత రిపబ్లికన్ ఓటర్లలోనూ కనిపించడం విశేషం. కొన్ని ప్రాంతాల్లో డేటా సెంటర్ల నిర్మాణానికి మద్దతు తెలిపిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఓడిపోయారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ ఈ అంశం కీలక చర్చగా మారింది.
కరెంట్ బిల్లుల మోత.. ప్రజలకు కొత్త భారం!
డేటా సెంటర్లపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం వాటి విద్యుత్ వినియోగమే. ఒక భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు లక్ష ఇళ్లకు సరిపడా విద్యుత్ అవసరం కావచ్చు. 2024లో అమెరికా మొత్తం విద్యుత్ వినియోగంలో డేటా సెంటర్ల వాటా 4 శాతంగా ఉంది. 2030 నాటికి ఈ వినియోగం రెండింతలకు మించి పెరగవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేస్తోంది.
ఈ కేంద్రాలకు విద్యుత్ అందించేందుకు కొత్త పవర్ ప్లాంట్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు నిర్మించాల్సి వస్తోంది. ఇందుకోసం విద్యుత్ సంస్థలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. అయితే ఈ అదనపు ఖర్చు చివరకు సామాన్య వినియోగదారుల విద్యుత్ బిల్లులపై పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డేటా సెంటర్ల వల్ల ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ధరలు పెరుగుతున్నాయనే విశ్లేషణలు కూడా వెలువడ్డాయి.
నీటి వినియోగం కూడా పెద్ద సమస్యే!
విద్యుత్‌తో పాటు డేటా సెంటర్లకు నీరు కూడా భారీగా అవసరమవుతుంది. వేల సంఖ్యలో సర్వర్లు నిరంతరం పనిచేయడంతో వేడి ఉత్పత్తి అవుతుంది. వాటిని చల్లబరచడానికి ప్రత్యేక కూలింగ్ వ్యవస్థలు ఉపయోగిస్తారు. సాధారణ డేటా సెంటర్ రోజుకు సుమారు 3 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించవచ్చని అంచనా. భారీ కేంద్రాల్లో ఈ వినియోగం రోజుకు 50 లక్షల గ్యాలన్ల వరకు ఉండొచ్చు.
లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీ విశ్లేషణ ప్రకారం, 2023లో అమెరికాలోని డేటా సెంటర్లు సుమారు 66 బిలియన్ గ్యాలన్ల నీటిని ఉపయోగించాయి. 2028 నాటికి ఈ అవసరం రెట్టింపు కావచ్చని అంచనా. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కొత్త డేటా సెంటర్ల నిర్మాణం స్థానిక ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
భారీ పెట్టుబడులు వస్తున్నా ఉద్యోగాలు మాత్రం పరిమితమే!
డేటా సెంటర్లు నిర్మిస్తే స్థానికంగా వేలాది ఉద్యోగాలు వస్తాయని చాలామంది భావిస్తారు. నిర్మాణ సమయంలో పెద్ద సంఖ్యలో కార్మికులకు తాత్కాలిక ఉపాధి లభించినప్పటికీ, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నిర్వహణ కోసం చాలా తక్కువ మంది సిబ్బందే అవసరమవుతారు. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ అధ్యయనం ప్రకారం, ఒక డేటా సెంటర్ స్థానికంగా సగటున 100 నుంచి 200 మంది వరకు శాశ్వత ఉద్యోగాలను కల్పిస్తుంది.
దీంతో భారీ పెట్టుబడులు, విపరీతమైన విద్యుత్ వినియోగం, నీటి అవసరం ఉన్నప్పటికీ స్థానిక ప్రజలకు దక్కే ప్రత్యక్ష ప్రయోజనాలు పరిమితంగానే ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే డేటా సెంటర్లపై వ్యతిరేకతకు మరో కారణంగా మారుతోంది.
డేటా సెంటర్ల నిర్మాణంపై ఆంక్షలు.. రంగంలో పెరుగుతున్న ఒత్తిడి!
అమెరికాలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో రాజకీయ నాయకులు కూడా ఈ అంశంపై దృష్టి పెట్టారు. జులైలో న్యూయార్క్ కొత్త డేటా సెంటర్ ప్రాజెక్టులపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. మరో డజనుకు పైగా రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి.
అంతేకాదు, డేటా సెంటర్ల వల్ల విద్యుత్ వ్యవస్థపై పడే అదనపు ఖర్చును కంపెనీలే భరించేలా చేయాలనే ఉద్దేశంతో రేట్పేయర్ ప్రొటెక్షన్ యాక్ట్ (RPA) ప్రతిపాదించారు. ఈ బిల్లుకు సెప్టెంబర్‌లో అమెరికా ప్రతినిధుల సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినా, సెనేట్‌లో మాత్రం ముందుకు వెళ్లలేదు.
మరోవైపు కొత్త డేటా సెంటర్లు ప్రజల విద్యుత్ గ్రిడ్‌పై ఆధారపడకుండా సొంత విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో GRID Act కూడా ప్రతిపాదించారు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ వంటి నేతలు దేశవ్యాప్తంగా కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరికతో కొత్త తలనొప్పి!
ఒకవైపు చైనా వంటి దేశాలతో ఏఐ పోటీలో ముందుండాలంటే అమెరికాకు మరిన్ని డేటా సెంటర్లు అవసరం. మరోవైపు సొంత దేశంలోనే వాటి నిర్మాణానికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. విద్యుత్ ఖర్చులు, నీటి వినియోగం, స్థానిక సమస్యలు ఇలా ఎన్నో సవాళ్లు కంపెనీలను వెంటాడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మించే అమెరికన్ కంపెనీలపై భారీ పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడం కొత్త చర్చకు దారితీసింది. అమెరికాలో నిర్మించాలంటే స్థానిక వ్యతిరేకత, విదేశాల్లో నిర్మించాలంటే భారీ పన్నుల భయం.. ఈ రెండింటి మధ్య టెక్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ప్రకటించిన పన్నుల విధానం నిజంగా అమల్లోకి వస్తుందా? వస్తే ఏఐ రంగంలో పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







