ఎన్విడియా వివాదం.. అంబానీ, అదానీలకు అదిరిపోయే అవకాశం!
టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడో అమెరికాలో మొదలైన ఒక వివాదం.. ఇప్పుడు భారత్‌లోని ఇద్దరు కుబేరులకు భారీ అవకాశంగా మారబోతోందా అంటే అవుననే వినిపిస్తోంది. ఒకవైపు ఎన్విడియా చుట్టూ వివాదాలు ముదురుతుంటే, మరోవైపు చైనాకు అత్యాధునిక AI చిప్స్ చేరకుండా అమెరికా తన నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలకు మాత్రం అనుకోకుండా అదృష్టం కలిసొచ్చినట్టే కనిపిస్తోంది.
ఇన్నాళ్లూ అమెరికా టెక్ కంపెనీలు తమ AI అవసరాల కోసం సింగపూర్, మలేషియా వంటి దేశాల డేటా సెంటర్లపై ఆధారపడేవి. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారిపోతున్నాయి. దీంతో ఆ కంపెనీల చూపు భారత్ వైపు మళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి.
అమెరికా ఆంక్షలు.. ఆగ్నేయాసియా డేటా సెంటర్లకు కొత్త తలనొప్పి!
అసలు ఈ మార్పుకు కారణమేంటి అంటే.. ఎన్విడియా చుట్టూ ముసురుకున్న వివాదం. కంపెనీ అధిపతి జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన వ్యవహారం, సింగపూర్‌కు చెందిన క్లౌడ్ భాగస్వామి చుట్టూ తలెత్తిన ఆరోపణలు అమెరికాను మరింత అప్రమత్తం చేశాయి. చైనాకు పరోక్షంగా అత్యాధునిక చిప్స్, వాటి ద్వారా లభించే కంప్యూటింగ్ సామర్థ్యం చేరుతోందన్న అనుమానాలతో వాషింగ్టన్ ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలకు హైఎండ్ చిప్స్ ఎగుమతి చేయాలంటే ఇకపై అమెరికా నుంచి కేసు వారీగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. చైనాతో సంబంధాలున్న సంస్థలు ఈ డేటా సెంటర్ల కంప్యూటింగ్ సామర్థ్యాన్ని రిమోట్‌గా ఉపయోగించుకోకుండా కూడా పరిమితులు విధిస్తోంది. అంటే ఇప్పటివరకు ఆసియాలో డేటా సెంటర్ల వ్యాపారానికి అనుకూలంగా ఉన్న దేశాలకు ఇప్పుడు కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా భారత్ ఎదిగే అవకాశం కనిపిస్తోంది.
రూ.10 లక్షల కోట్లతో అంబానీ.. 100 బిలియన్ డాలర్లతో అదానీ!
అమెరికా వెతుకుతున్న ప్రత్యామ్నాయం భారత్ అయితే, అందుకు అవసరమైన భారీ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ఇక్కడ ఇప్పటికే ఇద్దరు దిగ్గజాలు సిద్ధమవుతున్నారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ AI హబ్‌ను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. మరోవైపు గౌతమ్ అదానీ గ్రూప్ 2035 నాటికి డేటా సెంటర్ల రంగంలో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక రూపొందించింది.
ఈ రెండు ప్రణాళికలు చూస్తే భారత్‌లో AI రంగం ఎంత పెద్ద స్థాయికి వెళ్లబోతోందో అర్థమవుతుంది. అంతేకాదు, ఈ భారీ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్, టెలికాం సదుపాయాల విషయంలోనూ అంబానీ, అదానీలకు మంచి బలముంది. అదానీ గ్రూప్‌కు విద్యుత్ ఉత్పత్తి, ప్రసార వ్యవస్థల్లో బలమైన స్థానం ఉండగా, రిలయన్స్‌కు 50 కోట్లకు పైగా టెలికాం వినియోగదారులు ఉన్నారు. అంటే ఒకవైపు డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్, మరోవైపు AI సేవలను ప్రజలకు చేరవేసే టెలికాం నెట్వర్క్.. ఈ రెండు అంశాల్లోనూ వీరికి అనుకూలత ఉంది.
గూగుల్, మెటా, ఓపెన్ఏఐ.. భారత్ వైపు ఎందుకింత ఆసక్తి?
ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే, అంబానీ, అదానీలు కేవలం భారీ భవనాలు కట్టి డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం దగ్గరే ఆగిపోవడం లేదు. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలను కూడా తమ భాగస్వాములుగా చేసుకుంటున్నారు. అదానీ గ్రూప్ విశాఖపట్నంలో నిర్మిస్తున్న డేటా సెంటర్‌కు గూగుల్ భాగస్వామిగా ఉంది. అక్కడ సముద్రగర్భ కేబుల్స్ ఏర్పాటు చేయడంలోనూ గూగుల్ కీలకంగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, అమెరికాకు చెందిన జాబిల్ సంస్థతో కలిసి AI సర్వర్లు, వాటికి అవసరమైన కూలింగ్ వ్యవస్థలను భారత్‌లోనే తయారు చేసేందుకు అదానీ గ్రూప్ అడుగులు వేస్తోంది.
ఇక అంబానీ కూడా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. మెటా సంస్థ కోసం 168 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నారు. దీనికి తోడు మెటా అభివృద్ధి చేసిన లామా AI ఎంటర్ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌ను భారత మార్కెట్లో విక్రయించేందుకు 100 మిలియన్ డాలర్ల భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకున్నారు. మరోవైపు టాటా గ్రూప్ కూడా ఈ పోటీలోకి దిగింది. ఓపెన్ఏఐ కోసం 100 మెగావాట్ల డేటా సెంటర్‌ను నిర్మించనుంది. భవిష్యత్తులో దాన్ని ఒక గిగావాట్ సామర్థ్యానికి పెంచుకునే అవకాశముంది. ఇలా అమెరికా టెక్ కంపెనీలు నేరుగా భారత సంస్థలతో చేతులు కలపడం వల్ల భారత్‌పై తమకు మరింత నమ్మకం ఉందనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి.
భారీ డేటా సెంటర్లు ఉన్నా.. భారత్‌లో ఒక సమస్య ఉంది!
అయితే ఈ కథనంలో మరో కోణం కూడా ఉంది. ఇంత భారీ స్థాయిలో డేటా సెంటర్లు నిర్మిస్తే వాటిని ఉపయోగించుకునే కస్టమర్లు కూడా అదే స్థాయిలో ఉండాలి కదా! ప్రస్తుతం భారత్‌లో స్థానిక సంస్థల నుంచి వచ్చే AI కంప్యూటింగ్ డిమాండ్ ఇంకా ఈ భారీ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే స్థాయికి చేరలేదు. అంటే పెట్టుబడులు పెట్టి డేటా సెంటర్లు నిర్మించినా, వాటిలోని సర్వర్లు ఖాళీగా ఉండిపోయే ప్రమాదం ఉంది.
దాంతో దేశీయంగా డిమాండ్ పెరిగే వరకు మిగిలిపోయే కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విదేశీ కస్టమర్లకు అందించేందుకు కూడా ప్రభుత్వం అనుమతిస్తోంది. అంటే భారతదేశంలో ఉన్న సర్వర్లను ఉపయోగించి విదేశీ కంపెనీలకు AI మోడళ్ల శిక్షణ, నిర్వహణ సేవలు అందించవచ్చన్నమాట.
చైనాతో సంబంధాలుంటే ఇక అంత సులువు కాదు!
అయితే విదేశీ కంపెనీలకు కంప్యూటింగ్ సేవలు అందించడం అనుకున్నంత సులభం కాదని ఎన్విడియా వివాదం మరోసారి గుర్తుచేస్తోంది. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌పై చైనా కోసం గూఢచర్యం చేశారనే అనుమానాలు అమెరికా అధికారులకు ఉన్నాయి. ఎన్విడియా అధిపతితో ఆమెకు వ్యక్తిగత సంబంధం కూడా ఈ వివాదంలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఆసియాలోని డేటా సెంటర్ల నుంచి ఇతర దేశాలకు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించే వ్యవహారం ఇప్పుడు వ్యాపారానికి మించిన భౌగోళిక రాజకీయ అంశంగా మారిపోయింది.
అమెరికా కొత్త నిబంధనల ప్రకారం డేటా సెంటర్లను ఉపయోగించుకునే ప్రతి సంస్థకు సంబంధించిన యాజమాన్య వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. చైనా లేదా మకావుతో సంబంధాలున్న సంస్థలు ఇతర పేర్లతో, షెల్ కంపెనీల ద్వారా సేవలను పొందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి అంబానీ, అదానీలు భారీ పెట్టుబడులు పెట్టడం ఒక ఎత్తయితే, అమెరికా విధించిన ఈ భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించడం మరో పెద్ద సవాలుగా మారనుంది.
ఇవి కూడా చదవండి
ట్రంప్ వ్యూహంలో భారత్‌కు ప్రత్యేక స్థానం?
ఈ వ్యవహారాన్ని కేవలం వ్యాపార కోణంలోనే చూడలేం. దీని వెనుక అమెరికా, చైనా మధ్య సాగుతున్న టెక్నాలజీ ఆధిపత్య పోరు కూడా ఉంది. చైనా AI రంగంలో వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో, అత్యాధునిక చిప్స్, డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సామర్థ్యం విషయంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా మార్చుకోవడం వాషింగ్టన్కు కూడా అవసరంగా మారింది.
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ముంబైలో గౌతమ్ అదానీ, టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌లతో సమావేశమయ్యారు. ఆ తర్వాత గుజరాత్‌లోని అంబానీకి చెందిన జామ్‌నగర్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. అమెరికాకు భారత్‌లోని పారిశ్రామిక దిగ్గజాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలనే ఆసక్తి ఉందనడానికి ఈ పరిణామాలు ఒక సంకేతంగా కనిపిస్తున్నాయి.
అంబానీ, అదానీలకు నిజంగానే బంగారు అవకాశం దక్కినట్టేనా?
మొత్తానికి చూస్తే ఎన్విడియా చుట్టూ మొదలైన వివాదం అమెరికా టెక్నాలజీ విధానాల్లో మార్పులకు దారితీస్తోంది. ఆ మార్పులు సింగపూర్, మలేషియా వంటి దేశాల్లోని డేటా సెంటర్లకు ఇబ్బందులు సృష్టిస్తుంటే, భారత్‌కు మాత్రం కొత్త అవకాశాలను తెరుస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధమైన అంబానీ, అదానీలు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ AI మౌలిక సదుపాయాల రంగంలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించవచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







