ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ హైడ్రామా..!
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన మధ్య తీవ్ర రాజకీయ విభేదాలకు, ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపాలిటీలో వైస్ ఛైర్పర్సన్ పదవిని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ తరఫున కౌన్సిలర్ నలిశెట్టి శిరీష పేరును అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు మొదటి నుంచీ చెబుతూ వచ్చాయి. అయితే, చివరి నిమిషంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జోక్యం చేసుకుని, శిరీషకు బదులుగా మరో జనసేన కౌన్సిలర్ కత్తి పద్మ పేరును తెరపైకి తీసుకురావడంతో వివాదం ఒక్కసారిగా రాజుకుంది.
ఇవి కూడా చదవండి
పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థిని కాదని, మంత్రి ఆనం ఏకపక్షంగా మరొకరి పేరును ఖరారు చేసి ప్రమాణ స్వీకారం చేయించడంపై ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అధినేత పవన్ కల్యాణ్ మాటకు విలువ లేకుండా కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నలిశెట్టి శిరీషకే వైస్ ఛైర్పర్సన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో మున్సిపల్ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆందోళన మరింత ఉద్ధృతం కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి జనసేన నేతలను అడ్డుకున్నారు. నిరసన విరమించాలని కోరినా వారు వెనక్కి తగ్గకపోవడంతో, పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఆత్మకూరు జనసేన ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్తో పాటు పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ సొంత పార్టీ అభ్యర్థి ఎంపికలో మంత్రి ఆనం జోక్యం చేసుకోవడంపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఈ వ్యవహారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.







