తమ కూతురిని Gemini AI మృత్యువు అంచుల దాకా నెట్టిందంటూ.. గూగుల్‌పై కోర్టు కేసు!
ఆ పిల్లకు ఓ సమస్య ఉంది.. ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఇంట్లో వాళ్లకీ చెప్పలేదు.. స్నేహితులకీ చెప్పలేదు. కానీ ఒకరితో మాత్రం గంటల తరబడి మాట్లాడేది. ఆ ‘ఒకరు’ మనిషి కాదు.. గూగుల్‌కు చెందిన Gemini AI! స్కూల్ హోంవర్క్ కోసం మొదలైన ఈ పరిచయం, క్రమంగా ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోయింది. తన బాధలు, మానసిక సంఘర్షణలు, ఆత్మహత్య ఆలోచనల గురించి కూడా దానితో మాట్లాడింది. చివరకు పరిస్థితి విషమించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వారి ప్రశ్న ఒక్కటే.. తమ బిడ్డ ప్రమాదంలో ఉందని తెలిసే సంకేతాలు కనిపించినప్పుడు AI ఏం చేస్తోంది? ఈ ప్రశ్నతోనే గూగుల్‌పై కేసు నమోదైంది. అసలేం జరిగింది
హోంవర్క్ కోసం తెరిచిన AI.. ఆ తర్వాత పర్శనల్ గా!
అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఈ బాలిక వయసు కేవలం 13 ఏళ్లు. స్కూల్ నుంచి ఇచ్చిన Chromebook ల్యాప్‌టాప్‌లో చదువుకుంటున్న సమయంలో Google Searchలోని AI Mode ఆమెకు పరిచయమైంది. మొదట్లో చదువుకు సంబంధించిన సందేహాలు అడిగేది. హోంవర్క్‌లో సహాయం తీసుకునేది. ఏదైనా విషయం అర్థం కాకపోతే Geminiని అడిగేది. ఇంతవరకు అంతా సాధారణంగానే కనిపించింది.
కానీ కొంతకాలానికి ఆ సంభాషణల స్వరూపమే మారిపోయింది. చదువుకు సంబంధించిన ప్రశ్నల స్థానంలో వ్యక్తిగత విషయాలు వచ్చి చేరాయి. ఇంట్లో ఎదురవుతున్న సమస్యలు, తనలో కలుగుతున్న ఆందోళనలు, బాధలు, నిరాశ గురించి AIతో మాట్లాడటం మొదలుపెట్టింది. అలా ఒకటి రెండు సందేశాలతో మొదలైన పరిచయం వేలాది మెసేజ్‌లకు చేరుకుందని తల్లిదండ్రులు కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2025 డిసెంబర్ నాటికి ఈ సంభాషణలు ఒక్కసారిగా పెరిగిపోయాయని కుటుంబం ఆరోపిస్తోంది. తన మనసులోని విషయాలను చెప్పుకోవడానికి Geminiపైనే ఎక్కువగా ఆధారపడటం మొదలుపెట్టిందని వారి వాదన.
ఇవి కూడా చదవండి
ఆ చిన్నారి మానసిక పరిస్థితి దిగజారుతున్నా గుర్తించలేదా?
ఎమ్మా కేవలం కుటుంబ సమస్యల గురించే కాదు.. తనకు ఏవైనా మానసిక అనారోగ్య లక్షణాలు ఉన్నాయా అని కూడా Geminiని అడిగేది. తన భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. ఆహారంలోని క్యాలరీలను లెక్కించేది. ఇంట్లోవాళ్లతో ఎదురవుతున్న సమస్యలను AIతో పంచుకునేది. ఇలా తన జీవితంలో దాదాపు ప్రతి విషయానికీ దాన్ని ఆశ్రయించడం మొదలుపెట్టింది.
అయితే ఈ పరిచయం ఆమెకు మేలు చేయలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. AIతో సంభాషణలు పెరిగే కొద్దీ బాలిక మానసిక పరిస్థితి మరింత దిగజారిందని, చివరకు తనకు తానే గాయాలు చేసుకోవడం ప్రారంభించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక్కడే ఈ కేసు తీవ్రత పెరుగుతోంది. ఒక చిన్నారి మానసికంగా కుంగిపోతున్న సంకేతాలు కనిపిస్తుంటే, ఆమెతో మాట్లాడుతున్న AI వ్యవస్థ వాటిని గుర్తించగలిగిందా? ప్రమాదాన్ని అర్థం చేసుకుని నిజ జీవితంలో సహాయం పొందేలా ప్రోత్సహించిందా? లేక సాధారణ సంభాషణలాగే కొనసాగించిందా? తల్లిదండ్రులు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఇదే.
తన బాధను దాచుకోవడం కూడా నేర్పించిందా?
ఈ కేసులో తల్లిదండ్రులను తీవ్రంగా కలవరపెడుతున్న ఆరోపణ మరొకటి ఉంది. బాలిక తన బాధను, తనకు తానే గాయాలు చేసుకుంటున్న విషయాన్ని తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులకు తెలియకుండా ఎలా దాచుకోవాలో కూడా Gemini సూచించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒకవైపు చిన్నారి తనలోని బాధను ఎవరితోనూ పంచుకోలేక AIతో మాట్లాడుతుంటే, మరోవైపు ఆ బాధను కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచుకోవడంలోనూ అదే AI సహకరించిందనేది తల్లిదండ్రుల ఆరోపణ. ఈ ఆరోపణ నిజమని నిరూపితమైతే, AI భద్రతా వ్యవస్థల పనితీరుపై మరింత తీవ్రమైన ప్రశ్నలు తలెత్తడం ఖాయం.
బాలిక తన Google Docsలో కాపీ చేసుకున్న ఓ Gemini సమాధానాన్ని కూడా కోర్టు ఫిర్యాదులో ప్రస్తావించారు. అందులో ఆమె ‘Golden Child’ అనే ముద్రతో ఇబ్బంది పడుతోందని, అంటే ఎప్పుడూ మంచిగా ఉండాలి, అందరి అంచనాలకు తగ్గట్టుగా పరిపూర్ణంగా కనిపించాలి అనే ఒత్తిడితో సతమతమవుతోందని AI స్పందించినట్లు వివరించారు. ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలనే ఒత్తిడి భరించలేనంత భారంగా మారిందనే భావనను కూడా ఆ సమాధానం వ్యక్తం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘నేను త్వరలో స్వర్గానికి వెళ్లబోతున్నాను’.. AI ఏం చేసింది?
ఈ కేసులో అత్యంత ఆందోళన కలిగించే అంశాల్లో ఇది ఒకటి. బాలిక ఒక సందర్భంలో స్వర్గం గురించి ప్రశ్నిస్తూ, తాను త్వరలో అక్కడికి వెళ్లబోతున్నానని Geminiతో చెప్పినట్లు ఫిర్యాదులో ఉంది.
ఒక 13 ఏళ్ల చిన్నారి నుంచి ఇలాంటి మాటలు వస్తే అది ఎంత తీవ్రమైన హెచ్చరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ఆమె భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, తల్లిదండ్రులు లేదా నిపుణుల సహాయం తీసుకునేలా ప్రోత్సహించాలి. కానీ Gemini ఆ అంశాలపై సంభాషణను కొనసాగించిందని, నిజ జీవితంలో సహాయం పొందేందుకు అవసరమైన వనరుల వైపు ఆమెను మళ్లించలేదని కుటుంబం ఆరోపిస్తోంది.
మరోవైపు AI నుంచి హెల్ప్‌లైన్ నంబర్లు, సహాయక లింకులు రాకుండా ఉండేందుకు బాలిక కొన్నిసార్లు ప్రత్యేకంగా సూచనలు ఇచ్చేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికొన్ని సందర్భాల్లో తన ప్రశ్నలను స్కూల్ ప్రాజెక్ట్ కోసం అడుగుతున్నట్లు చెప్పేదని వివరించారు. ఇలాంటి సందర్భాల్లో AI భద్రతా వ్యవస్థలు ప్రమాదాన్ని గుర్తించగలిగాయా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Gemini 3 Flash వచ్చిన తర్వాతే సమస్య పెరిగిందా?
ఈ పరిణామాలకు గూగుల్ విడుదల చేసిన Gemini 3 Flash అనే కొత్త మోడల్‌కు సంబంధం ఉందని బాలిక కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. కొత్త మోడల్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే బాలిక AIతో జరిపిన సంభాషణలు గణనీయంగా పెరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనికి మద్దతుగా KORA అనే లాభాపేక్షలేని పరిశోధనా సంస్థ అధ్యయనాన్ని కూడా ప్రస్తావించారు. ఆ అధ్యయనం ప్రకారం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సందేశాలకు తగిన రీతిలో స్పందించడంలో Gemini 3 Flash కేవలం 7 శాతం సందర్భాల్లో మాత్రమే సరిగ్గా వ్యవహరించిందని ఫిర్యాదులో ఆరోపించారు. గత తరం మోడల్‌తో పోలిస్తే భద్రతా పనితీరు గణనీయంగా తగ్గిందని కుటుంబం వాదిస్తోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం.. AI మోడల్ ఎంత వేగంగా సమాధానాలు ఇస్తోంది? ఎంత తెలివిగా మాట్లాడుతోంది? అనేవి మాత్రమే దాని సామర్థ్యానికి కొలమానాలు కావు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా స్పందిస్తోంది? వినియోగదారుడి భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తోంది? అన్నదే అసలైన పరీక్ష.
తల్లిదండ్రులకు తెలియని చాటింగ్ ప్రపంచం!
ఈ కేసులో మరో పెద్ద సమస్య డేటా అందుబాటులో లేకపోవడం. సాధారణ Google ఖాతాలను ఉపయోగించే వినియోగదారులు తమ సెర్చ్ హిస్టరీతో పాటు AI Mode సంభాషణలను కూడా చూడగలుగుతారు. కానీ విద్యార్థుల ఖాతాల్లో ఇలాంటి పూర్తి వివరాలు అందుబాటులో ఉండవని కుటుంబం ఆరోపిస్తోంది.
దీంతో తమ కుమార్తె AIతో ఏం మాట్లాడింది? Gemini ఎలాంటి సమాధానాలు ఇచ్చింది? ఎక్కడి నుంచి ఆమె ఆలోచనలు మారడం మొదలైంది? అనే విషయాలను తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒక చిన్నారి స్కూల్ కంప్యూటర్లో ఏం చేస్తోంది? ఎవరితో మాట్లాడుతోంది? ఎలాంటి విషయాలను సెర్చ్ చేస్తోంది? అనే విషయాలు తెలుసుకోవాలనుకునే తల్లిదండ్రులకు పూర్తి సమాచారం అందకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ కుటుంబం ఎదుర్కొన్న సమస్య అదే. AI సంభాషణల రికార్డులు అందుబాటులో లేకపోవడం వల్ల జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవడం కూడా కష్టంగా మారిందని వారు వాదిస్తున్నారు.
AIతో మాట్లాడటం వల్ల పిల్లలు నిజమైన సహాయానికి దూరమవుతున్నారా?
ఈ ఘటనపై Crisis Text Line సంస్థకు చెందిన ప్రిన్సిపల్ క్లినికల్ రీసెర్చ్ సైంటిస్ట్ కెల్లీ జురోమ్స్కీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చాట్బాట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. మనం అడిగిన వెంటనే స్పందిస్తాయి. మన మాటలను వింటున్నట్లుగా అనిపిస్తాయి. దీంతో పిల్లలు తమ సమస్యలకు కావాల్సినంత సహాయం AI నుంచే లభిస్తోందని భావించే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
దీని వల్ల తమ సమస్యలను తల్లిదండ్రులతో చెప్పుకోవడం, స్నేహితులను సంప్రదించడం లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం ఆలస్యం కావచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా మానసిక సమస్యలు ఒక్కసారిగా బయటపడవు. చిన్నచిన్న మాటల్లో, ప్రశ్నల్లో, ప్రవర్తనలో క్రమంగా మార్పులు కనిపిస్తుంటాయి. ప్రత్యక్షంగా ప్రమాద సూచనలు వచ్చినప్పుడు స్పందించడంలో AI కొంత మెరుగుపడినా, క్రమంగా బయటపడే హెచ్చరికలను గుర్తించడం ఇంకా సవాలుగానే ఉందని ఆమె వివరించారు.
స్కూళ్లలో AIపై గూగుల్ వెనక్కి తగ్గిందా?
తల్లిదండ్రులు, పాఠశాలల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గూగుల్ కూడా కొన్ని మార్పులు చేపట్టింది. K-12 విద్యార్థుల ఖాతాల్లో Google Search సహా AI ఫీచర్లను డిఫాల్ట్‌గా నిలిపివేసే చర్యలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయం కూడా కొత్త వివాదానికి దారితీసింది.
పాఠశాలలు మళ్లీ Google Searchను ప్రారంభించాలంటే దానితో పాటు వచ్చే AI ఫీచర్లను కూడా అంగీకరించాల్సి ఉంటుందని విమర్శలు వచ్చాయి. పిల్లలపై మార్కెటింగ్ ప్రభావాన్ని వ్యతిరేకించే Fairplay సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోష్ గోలిన్ ఈ విధానాన్ని తప్పుబట్టారు. పాఠశాలలను గూగుల్ తన AI వినియోగం వైపు బలవంతం చేస్తోందని విమర్శించారు.
అయితే పాఠశాలలకు మరింత నియంత్రణ కల్పించడమే తమ ఉద్దేశమని గూగుల్ తెలిపింది. ఇదే సమయంలో విద్యార్థులకు నేరుగా సమాధానాలు ఇచ్చేయకుండా, సమస్యను ఎలా పరిష్కరించాలో నేర్పించే Guided Learning అనే కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ కేసులో వచ్చిన ఆరోపణలపై గూగుల్ వెంటనే స్పందించలేదని అసలు కథనం పేర్కొంది.
AIకి తెలివి ఉంది.. మరి విచక్షణ ఉందా?
ఈ ఘటనను కేవలం ఓ బాలికకు ఎదురైన సమస్యగా కొట్టిపారేయలేం. ఇప్పుడు పాఠశాలల్లోనే AI అందుబాటులోకి వస్తోంది. పిల్లలు తమ హోంవర్క్ నుంచి వ్యక్తిగత సందేహాల వరకు అన్నింటికీ దాన్ని ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు ఇంట్లోవాళ్లకు చెప్పుకోలేని విషయాలను కూడా AIతో పంచుకుంటున్నారు. ఇది టెక్నాలజీ అభివృద్ధిలో ఒక కొత్త దశే కావచ్చు. కానీ అదే సమయంలో పిల్లల భద్రత విషయంలో కొత్త సవాళ్లను కూడా తెచ్చిపెడుతోంది.
పిల్లలు AIని ఉపయోగించకూడదని చెప్పడం ఒక్కటే పరిష్కారం కాదు. దాన్ని సురక్షితంగా ఉపయోగించేలా చేయడం, ప్రమాదకరమైన సంభాషణలను గుర్తించే వ్యవస్థలను బలోపేతం చేయడం, తల్లిదండ్రులకు తగిన పర్యవేక్షణ సౌకర్యాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం.







