ఒక్క ప్రకటనతో మారిపోయిన సీన్.. మళ్లీ సీఈఓగా జెన్సన్ హువాంగ్.. ఎగబాకిన షేర్లు!
గత కొద్ది రోజులుగా ఆయనే హాట్ టాపిక్. ఆయన రాజీనామాతో కుప్పకూలిన షేర్లు.. ఇప్పుడు ఆయన రీఎంట్రీతో రాకెట్లా దూసుకెళ్లాయి! ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ విషయంలో జరిగిన ఈ అనూహ్య మలుపు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. వ్యక్తిగత వివాదాలు, చైనా గూఢచర్యం ఆరోపణల మధ్య పదవికి దూరమైన ఆయనను కంపెనీ బోర్డు మళ్లీ ఎందుకు ఆహ్వానించింది? ట్రంప్ ఎందుకు ఆయనకు మద్దతుగా నిలిచారు?
పదవి నుంచి తప్పుకున్నా.. మళ్లీ ఆయనే కావాలా?
ఒక కంపెనీ సీఈఓపై తీవ్రమైన ఆరోపణలు వస్తే సాధారణంగా ఏం జరుగుతుంది? ఆయన స్థానంలో మరో వ్యక్తిని తీసుకొచ్చి సంస్థను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక స్థానంలో ఉన్న ఎన్విడియా మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. వివాదాల కారణంగా పదవికి దూరమైన తన సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్నే మళ్లీ సీఈఓగా నియమించింది. ఆయన నాయకత్వమే కంపెనీకి అవసరమని బోర్డు నిర్ణయించడంతో ఎన్విడియాలో ఒక్కసారిగా కొత్త అధ్యాయం మొదలైంది.
నవంబర్ 23న కంపెనీ విడుదల చేసిన ప్రకటనతో ఈ విషయం అధికారికమైంది. హువాంగ్ను తిరిగి అధ్యక్షుడు, సీఈఓగా నియమించినట్లు ఎన్విడియా వెల్లడించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే మార్కెట్లో కనిపించిన స్పందన కూడా మామూలుగా లేదు. ఆయన తిరిగి రావడం కంపెనీకి మంచి పరిణామమని భావించిన పెట్టుబడిదారులు షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
జెన్సన్ హువాంగ్ పదవి నుంచి తప్పుకోవడానికి కారణమైన పరిణామాలు అంత చిన్నవేమీ కావు. ఈ నెల ప్రారంభంలో ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా చైనాకు చెందిన ఒక మహిళా వ్యాపారవేత్తతో ఆయనకు సంబంధం ఉందని న్యూయార్క్ టైమ్స్ నవంబర్ 8న ప్రచురించిన కథనం పెద్ద చర్చకు దారితీసింది. ఆ మహిళ చైనా గూఢచారిగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అమెరికా నిఘా వర్గాలకు ఉన్నాయని ఆ కథనం పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం వ్యక్తిగత వివాదం నుంచి అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలను చైనా ప్రభుత్వం ఖండించింది.
ఇదే సమయంలో హువాంగ్‌కు మరో మహిళా ఎగ్జిక్యూటివ్‌తో కూడా సంబంధం ఉందని ఎన్విడియా ఉద్యోగులు తెలిపినట్లు నవంబర్ 11న న్యూయార్క్ టైమ్స్ మరో కథనాన్ని ప్రచురించింది. ఆ మహిళ నేరుగా హువాంగ్కే రిపోర్ట్ చేసేవారని కథనం పేర్కొంది. దీంతో ఆయన నాయకత్వంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఈ పరిణామాల మధ్య ఆయన పదవికి దూరమయ్యారు.
బోర్డు నిర్ణయం వెనుక ట్రంప్ పాత్ర కూడా ఉందా?
ఇక్కడే మరో ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. హువాంగ్ తిరిగి రావాలనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆసక్తి చూపించారు. ఎన్విడియా బోర్డు ఆయనను మళ్లీ తీసుకురావాలని ట్రంప్ గతంలోనే కోరినట్లు వార్తలు వచ్చాయి. చివరకు బోర్డు ఏకగ్రీవంగా హువాంగ్ను తిరిగి నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వారి నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాత హువాంగ్ తిరిగి రావడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు లేదని బోర్డు విశ్వాసం వ్యక్తం చేసింది.
ట్రంప్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎన్విడియా చాలా కీలకమని, ఆ సంస్థకు హువాంగ్ నాయకత్వం అవసరమని చెప్పారు. ఆయన తిరిగి రావడం వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందని భావించడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు. హువాంగ్ చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడ్డారనే ఆధారాలు కూడా తమ వద్ద లేవని పేర్కొన్నారు.
షేర్లు 30 శాతం పెరగడం వెనుక అసలు కథ!
హువాంగ్ రీఎంట్రీ ప్రభావం స్టాక్ మార్కెట్లో వెంటనే కనిపించింది. ప్రకటన వెలువడిన తర్వాత మార్కెట్ ప్రారంభానికి ముందే ఎన్విడియా షేర్లు దాదాపు 30 శాతం పెరిగాయి. శుక్రవారం 125 డాలర్ల వద్ద ముగిసిన షేరు ధర, సోమవారం ట్రేడింగ్ ప్రారంభానికి ముందు 160 డాలర్లకు పైగా చేరుకుంది. ఒక వ్యక్తి తిరిగి బాధ్యతలు చేపట్టడంపై మార్కెట్ ఇంత భారీగా స్పందించడం చూస్తే ఎన్విడియా భవిష్యత్తులో ఆయన పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
ట్రంప్‌కు కూడా ఎన్విడియా షేర్లలో పెట్టుబడులు!
ఈ వ్యవహారంలో మరో ఇంట్రస్టింగ్ విషయం ట్రంప్ పెట్టుబడులకు సంబంధించినది. సెప్టెంబర్ నెలలో ఆయన 2,65,000 డాలర్ల వరకు విలువైన ఎన్విడియా షేర్లను కొనుగోలు చేసినట్లు ఆర్థిక వెల్లడింపు పత్రాలు చెబుతున్నాయి. అదే సమయంలో 15,000 డాలర్ల వరకు విలువైన షేర్లను విక్రయించారు. హువాంగ్‌కు సంబంధించిన వివాదాస్పద వార్తలు బయటకు రావడానికి కొన్ని వారాల ముందే ఈ లావాదేవీలు జరిగాయి. ఈ వివరాలు నవంబర్ 19న వెలువడిన బయటకు వచ్చాయి.
ఎన్విడియాకు హువాంగ్ ఎందుకంత కీలకం?
ఎన్విడియా అనేది కేవలం చిప్స్ తయారు చేసే కంపెనీ మాత్రమే కాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో, ఆ టెక్నాలజీకి అవసరమైన శక్తివంతమైన చిప్స్ తయారీలో ఎన్విడియా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే కంపెనీ నాయకత్వంలో ఎలాంటి మార్పు వచ్చినా దాని ప్రభావం టెక్ రంగంతో పాటు స్టాక్ మార్కెట్లపైనా పడుతోంది.
33 ఏళ్లుగా కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన హువాంగ్ను తిరిగి తీసుకురావడం ద్వారా ఎన్విడియా బోర్డు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. సంస్థ భవిష్యత్తు కోసం ఆయన నాయకత్వం తమకు అవసరమని భావిస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







