కరీంనగర్లో అట్టహాసంగా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండీ’ కూటమి చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్త కార్యాచరణకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన ‘మహా పాదయాత్ర’కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వం వహించారు. స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ భారీ ర్యాలీ ద్వారా ఉత్తర తెలంగాణలో తమ బలాన్ని చాటుకోవడంతో పాటు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కరీంనగర్ కలెక్టరేట్ హెలిప్యాడ్‌కు చేరుకున్న నితిన్ నబీన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఎమ్మెల్సీ కొమరయ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలను బండి సంజయ్ జాతీయ అధ్యక్షుడికి పరిచయం చేశారు. అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి నితిన్ నబీన్ నేరుగా పాదయాత్రకు బయలుదేరారు. గాంధీ చౌక్ వద్ద ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర, టవర్ సర్కిల్ మీదుగా భారీ జనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది.
పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఎన్నికల ప్రక్రియపై రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. “రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు, దానిని అణువణువూ ఆచరించే మనసుండాలి. అది బీజేపీకి మాత్రమే ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన వారి ఓట్లు, డబుల్ ఓట్లను జాబితా నుంచి తొలగించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లి భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వికాసం వైపు వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా మహిళలు, యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని నితిన్ నబీన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు తెలంగాణను ఒక ఏటీఎంగా మార్చారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ స్థానంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి దీపావళిని సైనికులతో జరుపుకునే ప్రధాని మోదీ 2029లోనూ మళ్లీ ప్రధాని అవుతారని, అప్పుడు రాహుల్ గాంధీ కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితం కావాల్సి వస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచి, 45 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడైన నితిన్ నబీన్ అంటే నిజాయితీ, నూతనత్వానికి ప్రతీక అని కొనియాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థిస్తూ.. “దేశంలో చనిపోయిన 3 కోట్ల మంది ఓట్లు, అక్రమంగా వలస వచ్చిన 4 కోట్ల మంది ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన 6 కోట్ల మంది ఓట్లు, కోటి డూప్లికేట్ ఓట్లను తొలగిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేంటి?” అని సంజయ్ నిలదీశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, పీసీసీ మాజీ చీఫ్ ఎమ్మెస్సార్ మరణించి ఏళ్లు గడుస్తున్నా గతంలో వారి ఓట్లు తొలగించలేదని గుర్తుచేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ చొరబాటుదారుల ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని, ఈ దేశ ప్రధాని, సీఎంలను విదేశీయులు నిర్ణయించాలా అని ప్రశ్నించారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనూ ఓటర్ల సవరణ జరిగిందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎన్నిక చెల్లదని, ప్రభుత్వాన్ని రద్దు చేసే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.
ఈ మహా పాదయాత్ర ద్వారా బీజేపీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టే వ్యూహాన్ని అనుసరించింది. ఒకవైపు జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా సవరణపై విపక్షాలు సృష్టిస్తున్న కథనాలకు ప్రజల నుంచే సమాధానం చెప్పించడం.. మరోవైపు తెలంగాణలో స్థానిక సంస్థలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేయడం ఇందులో ప్రధాన ఉద్దేశాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘నషా ముక్త్ భారత్’ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా యువత, తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద, నితిన్ నబీన్ పర్యటన తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయనే సంకేతాలను ఇచ్చింది.







