గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై .. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
దేశంలోనే అతిపెద్ద బహుళ-రంగ ప్రదర్శనగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’
* రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మిట్ లలో 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బహుళ-రంగ ఎక్స్ పో
* సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ట్రైబల్ సమ్మిట్, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్పో, క్లైమేట్ కాంక్లేవ్
* ప్రపంచ స్థాయి విద్యావేత్తలతో ప్రత్యేక చర్చలో పాల్గొననున్న సీఎం
* ప్రతినిధుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సునాయాసంగా ప్రవేశం
* ప్రపంచం నలుమూలల నుంచి వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధుల రాక కోసం రంగం సిద్ధం
హైదరాబాద్: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మిట్ లలో 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బహుళ-రంగ ఎక్స్ పో గా ఈ సమ్మిట్ ను చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సమ్మిట్ ఏర్పాట్లపై సోమవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమ్మిట్ వేదిక, వివిధ హాల్స్, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్పో, క్లైమేట్ కాంక్లేవ్ల నిర్వహణపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. అన్ని రంగాలనుంచి వెయ్యికి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. సమ్మిట్‌కు పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యే అవకాశమున్నందున ప్రతినిధులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సునాయాసంగా ప్రవేశం కోసం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడాలన్నారు. ఆహ్వానాలు పంపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతినిధులతో అత్యంత మర్యాదగా వ్యవహరించేలా విధుల్లో ఉన్న అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కాకతీయుల శిల్పకళ, సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ పెయింటింగ్స్, రాష్ట్రానికి చెందిన భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తులు, చేనేత, రాష్ట్ర అభివృద్ధి, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర భవిష్యత్ ప్రణాళికలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించాలని ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సమ్మిట్‌కు ఆహ్వానించాలని సూచించారు.
సమ్మిట్‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 30 ఫుడ్ స్టాల్స్, వివిధ చేనేత వస్త్రాల ప్రదర్శనకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. రక్షా ఎక్స్ పో లో భాగంగా డిసెంబర్ 7 వ తేదీన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎయిర్ షోతో పాటు ఇతర కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు.
ట్రైబల్ సమ్మిట్ లో భాగంగా భారతీయ, వివిధ దేశాల్లోని తెగలకు సంబంధించిన బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు చేయనున్నారు.
క్లైమేట్ కాంక్లేవ్ లో భాగంగా సద్గురు జగ్గి వాసుదేవ్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, వివిధ ప్రపంచ స్థాయి నిపుణులు ప్రసంగించనున్నారు. స్థానికంగా ఉన్న ఇక్రిశాట్ వంటి సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, స్టార్ట్ అప్స్, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేయనున్నారు. గ్రీన్ ఎకానమీకి సంబంధించిన పెట్టుబడులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో భాగంగా యూకే పెవిలియన్, యూరోపియాన్ పెవిలియన్ లతో పాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ప్రదర్శనలు ఉండనున్నాయి. అలాగే ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్, ఐఐటీ హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీ, యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ప్రతినిధులు అంతర్జాతీయ అతిధులతో మాట్లాడుకునే విధంగా స్టాల్ల్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
దీంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న అంతర్జాతీయ విద్యావేత్తలు, నిపుణులతో “Schools of the Future” అనే అంశంపై ప్రత్యేక చర్చలో పాల్గొంటారు. అదే విధంగా డిసెంబర్ 8న “Reforms for educational institutions” అనే అంశంపై చర్చలో పాల్గొంటారు.
ఇండియా జాయ్ కాంక్లేవ్ లో భాగంగా దాదాపు 150 యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో అడోబ్, సోనీ, ఉబిసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ప్రదర్శనలు చేయబోతున్నారు.
ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1,500 మంది కంపెనీల సీఈవోలు, ఎండీలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాలకు సంబంధించిన రాయబారులు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదే విధంగా మరో 1,500 మంది పరిశ్రమల వర్గాల నుంచి ప్రతినిధులు రానున్నారు. సాధారణ పౌరులు, ఔత్సాహికులు సైతం గ్లోబల్ సమ్మిట్ కు డిసెంబర్ 10-13 తేదీల్లో వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, నవీన్ మిత్తల్, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, గ్లోబల్ సమ్మిట్ అధికారుల కమిటీల సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







