భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం.. మే నెలలో బుల్లెట్ ట్రైన్..!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుభవార్త అందించారు. ప్రతిష్ఠాత్మక అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు శరవేగంగా తుది దశకు చేరుకుంటున్నాయని, వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరులోని బీఈఎంఎల్ (BEML), ఐసీఎఫ్ (ICF) సంస్థలు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ‘బీ28’ (B28) బుల్లెట్ రైలు కోచ్‌లు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సూరత్ డిపోకు చేరుకోనున్నాయి.
ఇవి కూడా చదవండి
మొత్తం 8 కోచ్‌లతో, 202 మీటర్ల పొడవు ఉండే ఈ రైలులో ఒకేసారి 557 మంది ప్రయాణించే వీలుంటుంది. అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య 508 కిలోమీటర్ల మేర నిర్మాణంలో ఉన్న ఈ కారిడార్ ప్రాజెక్టు తాజాగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా మధ్య సుమారు 50 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌పై ట్రాక్ నిర్మాణంతో పాటు 25 కేవీ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (OHE) విద్యుదీకరణ పనులను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) విజయవంతంగా పూర్తి చేసింది. అప్, డౌన్ రెండు లైన్లలోనూ విద్యుత్ సరఫరాను పరీక్షించారు. ట్రయల్ రన్ సమయంలో ఈ బుల్లెట్ రైలు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో (గరిష్ఠంగా 280 కి.మీ. సామర్థ్యం) పట్టాలపై దూసుకెళ్లనుంది.
మే నెలలో ప్రారంభమయ్యే సాంకేతిక పరీక్షలు రెండు నుంచి నాలుగు నెలల పాటు కొనసాగనున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సూరత్-బిలిమోరా మధ్య తొలి దశ బుల్లెట్ రైలు సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 508 కిలోమీటర్ల కారిడార్‌లో 12 స్టేషన్లు ఉండగా, ఇందులో 21 కిలోమీటర్ల మేర భూగర్భ సొరంగం, సముద్ర గర్భంలో 7 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం సాధారణ రైళ్లలో ఆరు నుంచి ఏడు గంటలు పట్టే అహ్మదాబాద్-ముంబై ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గిపోనుంది.







