దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్రం సిద్ధం..!
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ (PMGKAY) కింద లబ్ధి పొందుతున్న వారిలో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం నిర్వహించిన తాజా అధ్యయనంలో బట్టబయలైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 51,303 లబ్ధిదారుల కుటుంబాలపై ఈ సమగ్ర సర్వే నిర్వహించగా, మొత్తం లబ్ధిదారుల్లో 13.2 శాతం ‘ఇన్క్లూజన్ ఎర్రర్’ (అనర్హులను జాబితాలో చేర్చడం) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
నిబంధనల ప్రకారం కేవలం ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే ఉచిత రేషన్ అందాల్సి ఉండగా, సంపన్న వర్గాలు సైతం ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు సర్వేలో తేలింది. సొంత కార్లు ఉన్నవారు, ఇళ్లలో ఏసీలు (ఎయిర్ కండిషనర్లు) వినియోగిస్తున్నవారు, మూడు లేదా అంతకంటే ఎక్కువ గదులు ఉన్న పక్కా భవనాల్లో నివసిస్తున్నవారు కూడా ఉచిత రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారు కూడా పేదల కోటాలో ఉచిత ఆహార ధాన్యాలు పొందుతున్నట్లు వెల్లడి కావడం విస్మయానికి గురిచేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 15.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 12.5 శాతం మేర ఈ అనర్హులు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ (39.5 శాతం), త్రిపుర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ లోపాలు అత్యధికంగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 81.35 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్న నేపథ్యంలో, అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరగకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయపు పన్ను, రవాణా శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖల డేటాబేస్లతో రేషన్ కార్డుల వివరాలను అనుసంధానించి అనర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా బోగస్, అనర్హుల రేషన్ కార్డులను తొలగించి, వారి స్థానంలో నిజమైన అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేసేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేసింది.







