అంతరిక్షంలో అణ్వాయుధాలు.. ప్రపంచానికి ఊహించని పెద్ద ప్రమాదం ?!
ఇన్నాళ్లూ భూమిపై యుద్ధాలు చూశాం.. సముద్రాల్లో ఆధిపత్య పోరును చూశాం.. ఇప్పుడు అంతరిక్షం కూడా లో కూడా అదే సీన్ రిపీట్ అవ్వబోతోందా. అది కూడా యుద్ధభూమిగా మారబోతోందా? ఒక్క అణు పేలుడు.. భూమిపై యుద్ధం చేయకుండానే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలను అస్తవ్యస్తం చేయగలదా? ఇప్పుడు ఇదే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. భూమిపై కాదు.. ఏకంగా అంతరిక్షంలోనే అణ్వాయుధాలను మోహరించేందుకు రష్యా సిద్ధమవుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఉపగ్రహాలనే లక్ష్యంగా చేసుకునే ఈ ప్లాన్ నిజమైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికే రంగంలోకి దిగిన నాటో ఏం హెచ్చరించింది?
రష్యా ప్లాన్‌తో నాటోలో కలవరం!
రష్యా అణ్వాయుధాలను మోసుకెళ్లే ఉపగ్రహాన్ని ప్రయోగించవచ్చన్న వార్తల నేపథ్యంలో నాటో అప్రమత్తమైంది. అంతరిక్షంలో తమ ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కొంటామని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే స్పష్టం చేశారు.
సోమవారం బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో కలిసి మాట్లాడిన ఆయన.. నాటో భద్రతా బాధ్యతలు భూమి, గగనతలం, సముద్రాలకే పరిమితం కావని తెలిపారు.
“నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. అందులో అంతరిక్ష భద్రత కూడా భాగమే” అని రుట్టే పేర్కొన్నారు.
జర్మన్ మీడియా కథనాల ప్రకారం.. రష్యా రాబోయే కొన్ని వారాల్లో అణ్వాయుధాలను మోసుకెళ్లే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిణామం యూరప్ దేశాల్లో భద్రతాపరమైన ఆందోళనలను పెంచింది. అయితే రష్యా నిజంగానే అలాంటి ప్రయోగానికి సిద్ధమవుతోందని నాటో కానీ, జర్మనీ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.
అసలు ఆ ఉపగ్రహంలో ఏముంది?
జర్మనీకి చెందిన ప్రభుత్వ ప్రసార సంస్థలు WDR, NDRతో పాటు Süddeutsche Zeitung వార్తాపత్రిక సంచలన కథనాలను ప్రచురించాయి. రష్యా ‘స్పుత్నిక్-ఎస్’ (Sputnik-S) పేరుతో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించాయి.
ఈ ఉపగ్రహంలో అణ్వాయుధ వార్‌హెడ్‌ను అమర్చనున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. రాబోయే వారాల్లోనే ప్రయోగం జరిగే అవకాశం ఉందని తెలిపాయి.
జర్మనీ సైనిక, నిఘా వర్గాలకు చెందిన పేర్లు వెల్లడించని అధికారులను ఉటంకిస్తూ ఈ వివరాలను ప్రచురించాయి. ఈ సమాచారాన్ని ఇప్పటికే నాటో సభ్య దేశాలతో పంచుకున్నట్లు, జర్మనీ ప్రభుత్వానికి కూడా సమాచారం అందినట్లు కథనాలు వెల్లడించాయి.
అంతేకాదు.. ఈ ఉపగ్రహాన్ని రష్యాలోని మాస్కో ప్రాంతంలో భద్రపరిచినట్లు కూడా పేర్కొన్నాయి.
ఒకవేళ ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే.. భూమి చుట్టూ తిరుగుతున్న కీలకమైన కమ్యూనికేషన్, పరిశీలనా ఉపగ్రహాలను దెబ్బతీయడానికి లేదా ధ్వంసం చేయడానికి ఉపయోగించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రష్యాపై మెర్జ్ ఆందోళన.. క్రెమ్లిన్ ఏమంటోంది?
రష్యా అణ్వాయుధాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందన్న వార్తలపై జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
“రష్యా అంతరిక్షంలోకి అణ్వాయుధాలను ప్రవేశపెట్టాలని చూస్తోందన్న వార్తలు కొత్తవేమీ కాదు. అయినప్పటికీ అవి ఇప్పటికీ దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు రష్యా ఎంతటి తీవ్ర స్థాయికి వెళ్లేందుకు సిద్ధంగా ఉందో తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.
జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి సైతం ఈ వార్తలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. అయితే ఊహాజనిత ముప్పులపై అనవసరమైన భయాందోళనలు సృష్టించకూడదని స్పష్టం చేశారు.
మరోవైపు రష్యా మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఈ తాజా మీడియా కథనాలను తాను చూడలేదని తెలిపారు. పేర్లు వెల్లడించని వ్యక్తులను ఆధారంగా చేసుకుని వస్తున్న వార్తలను ఎంతవరకు విశ్వసించగలమని ప్రశ్నించారు. అలాంటి కథనాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అంతరిక్షంలో అణు పేలుడు జరిగితే ఏమవుతుంది?
ఈ పరిణామంపై అంతరిక్ష రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అధిపతి జోసెఫ్ అష్బాకర్ ఈ పరిస్థితిని ‘అంతిమ భయంకరమైన పరిణామం’గా అభివర్ణించారు.
జర్మనీకి చెందిన Handelsblatt వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు AFP వార్తా సంస్థ వెల్లడించింది.
అంతరిక్షంలో అణు పేలుడు సంభవిస్తే దాని ప్రభావం ఒక్క ఉపగ్రహానికే పరిమితం కాకపోవచ్చు. భూమి చుట్టూ ఉన్న అనేక ఉపగ్రహాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కీలకమైన సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు.
ముఖ్యంగా ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలు, భూమిని పరిశీలించే నిఘా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నేటి ప్రపంచంలో సమాచార మార్పిడి నుంచి రక్షణ రంగం వరకు అనేక వ్యవస్థలు ఉపగ్రహాలపై ఆధారపడుతున్నాయి. అలాంటి సమయంలో అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు జరిగితే దాని ప్రభావం ఒక్క దేశానికే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలన్నింటిపైనా పడే ప్రమాదం ఉంది.
ప్రపంచానికి కొత్త ముప్పు?
అంతరిక్షం ఇన్నాళ్ళూ శాస్త్రీయ పరిశోధనలు, సమాచార మార్పిడి, సాంకేతిక అభివృద్ధికి కీలక వేదికగా ఉంది. కానీ అక్కడ కూడా అణ్వాయుధాల పోటీ మొదలైతే పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
అయితే రష్యా ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన వార్తలు ఇంకా అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. ఈ నేపథ్యంలో అసలు రష్యా ప్రణాళిక ఏమిటి? అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు నిజమైతే ప్రపంచ దేశాల భద్రతపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







