ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం
కృష్ణా జలాల పంపిణీపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్లోని జలసౌధలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తమ తక్షణ అవసరాల కోసం 19 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని బోర్డును కోరింది. తెలంగాణ (Telangana) ప్రభుత్వం సైతం తమ అవసరాలను ప్రస్తావిస్తూ వచ్చే ఫిబ్రవరి నాటికి 21 టీఎంసీల నీటిని కేటాయించాలని డిమాండ్ చేసింది. ఇరు రాష్ట్రాలు తమ వాటాల విషయంలో పట్టుబట్టడంతో తుది నిర్ణయం వాయిదా పడింది. నీటి విడుదల అంశంతో పాటు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు(Palnadu Water Grid Project) పై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. అయితే, ఆ ప్రాంతంలో జరుగుతున్న గ్రామీణ నీటి సరఫరా పనుల వివరాలపై తమకు స్పష్టమైన సమాచారం లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.







