ఇతరులతో పోల్చుకుంటూ మిమల్ని తక్కువ చేసుకుంటున్నారా..? మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే 7 అలవాట్లు ఇవే!
జీవితంలో విజయం సాధించాలంటే ప్రతిభ, కష్టపడే తత్వంతో పాటు ఆత్మవిశ్వాసం (Self-confidence) కూడా చాలా ముఖ్యం. మనపై మనకు నమ్మకం ఉన్నప్పుడే కొత్త పనులు చేయడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి ధైర్యం వస్తుంది. అయితే కొంతమంది తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. ఇతరులతో పోల్చుకోవడం, అపజయాలకు భయపడటం వల్ల వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి అలవాట్లను మార్చుకుంటే క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు.
ఆత్మవిశ్వాసాన్ని పెంచే సానుకూల ఆలోచనలు అలవాటు చేసుకోండి

ముందుగా మీ గురించి మీరు సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా పని ప్రారంభించే ముందే అది సాధ్యం కాదని భావించకూడదు. ప్రయత్నిస్తే సాధించగలననే ఆలోచనను పెంచుకోవాలి. మనలోని లోపాలనే కాకుండా బలాలను కూడా గుర్తించాలి. చిన్న విజయాలను కూడా గుర్తించి అభినందించుకోవడం వల్ల మనపై మనకు నమ్మకం పెరుగుతుంది.
ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయాలి. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన సామర్థ్యాలు, లక్ష్యాలు ఉంటాయి. ఇతరులు ఎంత సాధించారనే దానికంటే నిన్నటి కంటే ఈ రోజు మీరు ఎంత మెరుగయ్యారనే విషయంపై దృష్టి పెట్టాలి. మీ అభివృద్ధిని మీరే అంచనా వేసుకుంటూ ముందుకు సాగాలి.
అలాగే చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఒకేసారి పెద్ద విజయాన్ని సాధించాలని ఒత్తిడి తెచ్చుకోకుండా, రోజువారీ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. ఇలా ఒక్కో లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మన సామర్థ్యంపై నమ్మకం పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి
కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. మీకు తెలియని విషయాలను తెలుసుకోవడం, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం వల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు ధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా సమావేశం లేదా కార్యక్రమంలో మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఎదుటివారి కళ్లలోకి చూస్తూ, తడబడకుండా మాట్లాడేందుకు ప్రయత్నించాలి.
అపజయాలను పాఠాలుగా తీసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి

శరీర భాష (Body Language) కూడా ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. నిటారుగా నిలబడటం, నడిచేటప్పుడు తల పైకి ఉంచడం, మాట్లాడేటప్పుడు సహజంగా చిరునవ్వు నవ్వడం వంటి అలవాట్లు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. అదే సమయంలో పరిశుభ్రత, దుస్తుల విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి.
అపజయాలను చూసి భయపడకూడదు. ప్రతి తప్పు మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మన సామర్థ్యం తగ్గిపోదు. ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి మరోసారి మెరుగ్గా ప్రయత్నించాలి. ఇతరులు చేసే విమర్శలను కూడా పూర్తిగా ప్రతికూలంగా తీసుకోకుండా, అవసరమైన విషయాలను స్వీకరించాలి.
వీటితో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సరైన నిద్ర తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం కూడా ముఖ్యం. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం (Meditation) చేయడం కూడా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అంటే మనం చేసే ప్రతి పని విజయవంతం అవుతుందని భావించడం కాదు. ఎలాంటి ఫలితం ఎదురైనా దాన్ని ధైర్యంగా స్వీకరించి మళ్లీ ప్రయత్నించగలననే నమ్మకం కలిగి ఉండటమే నిజమైన ఆత్మవిశ్వాసం. ఇది ఒక్కరోజులో పెరగదు. రోజువారీ చిన్న చిన్న మార్పులతో క్రమంగా మన వ్యక్తిత్వంలో భాగమవుతుంది.







