WhatsApp Web తో జాగ్రత్త.. ‘బాస్ స్కామ్’ జరగొచ్చు, కేంద్ర హోంశాఖ కీలక హెచ్చరిక!
వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి మెసేజ్ లు పంపటం చాలామందికి అలవాటే. ఫోన్ పక్కన పెట్టి కంప్యూటర్లోనే మెసేజ్‌లు చదవడం, ఫైల్స్ పంపడం, ఆఫీస్ గ్రూపుల్లో మాట్లాడటం.. ఇలా పనులన్నీ చకచకా చేసేస్తుంటాం. పని పూర్తయిన తర్వాత బ్రౌజర్ ట్యాబ్‌ను క్లోజ్ చేసి మన పని అయిపోయిందనుకుని వెళ్లిపోతాం. కానీ ఇక్కడే అసలు సమస్య ఉందని కేంద్ర హోంశాఖ చెబుతోంది.
ఎందుకంటే ట్యాబ్ మూసేసినంత మాత్రాన వాట్సాప్ వెబ్ నుంచి పూర్తిగా లాగౌట్ అయినట్లు కాదు. మీరు లాగిన్ చేసిన కంప్యూటర్లో మీ సెషన్ అలాగే కొనసాగితే, ఆ తర్వాత ఆ సిస్టమ్‌ను ఉపయోగించే మరో వ్యక్తికి మీ ఖాతాను చూసే అవకాశం దొరకొచ్చు. ఆ కంప్యూటర్లో మాల్వేర్ ఉంటే ప్రమాదం మరింత పెరుగుతుంది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) ప్రత్యేక భద్రతా సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఆఫీస్ కంప్యూటర్లు, ఇతరులతో కలిసి ఉపయోగించే సిస్టమ్‌లు, పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌ను నిర్లక్ష్యంగా వాడొద్దని హెచ్చరించింది.
మీ వాట్సాప్ మీ చేతుల్లో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
ఒక్కసారి మీ వాట్సాప్ ఖాతా మరొకరి చేతుల్లోకి వెళ్లిందని అనుకోండి. మీ స్నేహితులతో మాట్లాడుకున్న వ్యక్తిగత విషయాలు, ఆఫీస్ గ్రూపుల్లో జరిగిన సంభాషణలు, మీ కాంటాక్ట్స్ వివరాలు.. ఇలా చాలా సమాచారం ఇతరులకు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. అంతటితో ఆగకుండా మీ పేరుతోనే ఇతరులకు మెసేజ్‌లు పంపించవచ్చు.
మీకు తెలిసిన వాళ్లకు అత్యవసరంగా డబ్బులు కావాలంటూ అడగొచ్చు. తెలియని లింకులు, హానికరమైన ఫైల్స్‌ను మీ ఖాతా నుంచే పంపించవచ్చు. ఇక్కడ అసలు ప్రమాదం ఏమిటంటే ఆ మెసేజ్‌లు మీ నిజమైన వాట్సాప్ ఖాతా నుంచే వచ్చినట్లు కనిపిస్తాయి. దీంతో అవతలి వ్యక్తులు వాటిని నిజమని నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీ పరిచయస్తులు సైబర్ మోసాలకు బలయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.
‘బాస్ స్కామ్’ పేరుతో మరో కొత్త తలనొప్పి!
వాట్సాప్ ఖాతాలను ఉపయోగించుకుని మోసాలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు. కంపెనీ బాస్‌ల పేరుతో ఉద్యోగులను టార్గెట్ చేస్తున్న ‘బాస్ స్కామ్’ లేదా ‘CEO ఇంపర్సనేషన్ ఫ్రాడ్’ ఇందుకు ఉదాహరణ. దీనిపై కూడా I4C గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మోసంలో నేరగాళ్లు కంపెనీ యజమానులుగా, ఉన్నతాధికారులుగా లేదా ప్రభుత్వ సంస్థల అధికారులుగా నటిస్తారు. అత్యవసరంగా ఒక పని పూర్తి చేయాలని, కొత్త నిబంధనల ప్రకారం కొన్ని పత్రాలు సమర్పించాలని చెబుతూ ఈమెయిల్ లేదా వాట్సాప్‌లో ఫైల్స్ పంపిస్తారు. వాటిని సాధారణ డాక్యుమెంట్లుగా భావించి ఓపెన్ చేస్తే కంప్యూటర్లోకి మాల్వేర్ ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా EXE, DLL వంటి హానికరమైన ఫైల్స్‌ను రన్ చేయడం వల్ల కంప్యూటర్‌తో పాటు యాక్టివ్ వాట్సాప్ వెబ్ సెషన్ కూడా ప్రమాదంలో పడొచ్చు.
ఆ తర్వాత అసలు మోసం మొదలవుతుంది. కంపెనీ ఉన్నతాధికారి ఖాతా నుంచే ఉద్యోగులకు అత్యవసరంగా డబ్బులు బదిలీ చేయాలని సందేశాలు పంపిస్తారు. మెసేజ్ నిజమైన బాస్ ఖాతా నుంచే రావడంతో ఉద్యోగులు అనుమానించకపోవచ్చు. అలా ఒక్క మెసేజ్‌తోనే భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారే ప్రమాదం ఉంటుంది.
వేల మందికి ముందుగానే హెచ్చరికలు.. అయినా అప్రమత్తత అవసరమే!
ఈ తరహా మోసాల తీవ్రతను గుర్తించి 2026 ఆగస్టులో మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది. అంతేకాదు, కేవలం 30 రోజుల్లోనే 58 వేల మందికి పైగా అవకాశం ఉన్న బాధితులకు SMS ద్వారా హెచ్చరికలు పంపినట్లు తెలిపింది. మాల్వేర్ కార్యకలాపాలకు ఉపయోగించిన కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లను బ్లాక్ చేయడం ద్వారా 10 వేల మందికి పైగా భారతీయులను ఈ మోసాల నుంచి కాపాడినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి
దేశంలో సైబర్ ముప్పు ఏ స్థాయిలో పెరుగుతోందంటే..
భారత్‌లో సైబర్ భద్రత ఎంత పెద్ద సవాలుగా మారుతోందో CERT-In గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం 2023లో 15,92,917 సైబర్ భద్రతా ఘటనలు నమోదయ్యాయి. 2024లో ఈ సంఖ్య 20,41,360కు చేరగా, 2025లో ఏకంగా 29,44,248 ఘటనలు నమోదయ్యాయి. అంటే రెండేళ్లలోనే నమోదైన ఘటనల సంఖ్య దాదాపు 85 శాతం పెరిగింది.
మీ వాట్సాప్‌ను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఇంతకీ మనం ఏం చేయాలి? వాట్సాప్ వెబ్ ఉపయోగించడం మానేయాలా? అవసరం లేదు. కానీ ఉపయోగించే విధానంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆఫీస్ లేదా ఇతరులు ఉపయోగించే కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసినప్పుడు పని పూర్తయ్యాక తప్పనిసరిగా మాన్యువల్‌గా లాగౌట్ కావాలి. బ్రౌజర్ ట్యాబ్‌ను క్లోజ్ చేయడమే సరిపోదు. సైబర్ కేఫ్‌లు, హోటళ్లు, పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఉపయోగించకపోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో నమ్మకమైన కంప్యూటర్లో Incognito లేదా Private Browsing ఉపయోగించినా, చివర్లో లాగౌట్ చేయడం మర్చిపోవద్దు.
మరో ముఖ్యమైన విషయం మీ ఫోన్లోని వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఉండే Linked Devices విభాగాన్ని తరచూ చెక్ చేస్తూ ఉండాలి. మీకు తెలియని కంప్యూటర్ లేదా పరికరం లాగిన్ అయి కనిపిస్తే వెంటనే దాన్ని లాగౌట్ చేయాలి. అలాగే గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ZIP ఫైల్స్, అకౌంట్ స్టేట్మెంట్లు, ప్రభుత్వ నిబంధనల పేరుతో వచ్చే అనుమానాస్పద డాక్యుమెంట్లను ఆలోచించకుండా ఓపెన్ చేయకూడదు. కంప్యూటర్, బ్రౌజర్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
ఇక కంపెనీల్లో బాస్ లేదా ఉన్నతాధికారి పేరుతో అత్యవసరంగా డబ్బులు పంపించాలని మెసేజ్ వస్తే, వెంటనే స్పందించి డబ్బులు బదిలీ చేయడం మంచిది కాదు. సంబంధిత వ్యక్తికి నేరుగా ఫోన్ చేసి లేదా వ్యక్తిగతంగా మాట్లాడి నిర్ధారించుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు చేయాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







