డ్రగ్స్ రహిత సమాజం కోసం కిషన్ రెడ్డి పాదయాత్ర!
ఆధునిక సమాజాన్ని, ముఖ్యంగా దేశ భవిష్యత్తుకు వెన్నెముక అయిన యువతరాన్ని నిశ్శబ్దంగా కబళిస్తున్న అతిపెద్ద మహమ్మారి మాదకద్రవ్యాలు. డ్రగ్స్ భూతం కేవలం ఒక వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు.. మొత్తం కుటుంబ వ్యవస్థను, సామాజిక భద్రతను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈ సమస్యపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు, దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మలిచేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నడుం బిగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ (డ్రగ్స్ రహిత భారత్) అభియాన్ స్ఫూర్తితో, హైదరాబాద్ లో మూడు రోజుల పాటు “హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్” పేరిట వాకథాన్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 25 నుంచి 27 వరకు కొనసాగనున్న ఈ పాదయాత్ర, మొత్తం 29.8 కిలోమీటర్ల మేర సాగనుంది.
ఈ యాత్ర కేవలం ఒక రాజకీయ లేదా అధికారిక కార్యక్రమంగా కాకుండా, సమాజంలోని అన్ని వర్గాలను, ముఖ్యంగా విద్యార్థులు, యువతను భాగస్వాములను చేసేలా రూపొందించారు. డ్రగ్స్ మహమ్మారిని కేవలం చట్టాలు, పోలీసుల నిఘాతో మాత్రమే పూర్తిగా అరికట్టలేమని, ప్రజలే స్వచ్ఛందంగా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలనేది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. పాదయాత్ర సాగే ప్రతి అడుగులోనూ సామాన్యులతో మమేకమవుతూ, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ, ప్రధాన కూడళ్లలో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞలు చేయించనున్నారు.
ఇవి కూడా చదవండి
మూడు రోజులపాటు సాగే ఈ మహా పాదయాత్రకు రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారు. 25న అంబర్‌పేటలోని ఎంసీహెచ్ గ్రౌండ్స్ నుంచి జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభిస్తారు. మొదటి రోజు మొత్తం 11.2 కిలోమీటర్ల మేర సాగే ఈ నడక, మహాంకాళి ఆలయం, తిలక్ నగర్ క్రాస్ రోడ్స్ మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్, ఓయూ ఆర్ట్స్ కాలేజ్, ఇఫ్లూ, ఐసీఎంఆర్, సీతాఫల్మండి, గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్‌లోని కశిష్ ఫంక్షన్ హాల్ వద్ద ముగుస్తుంది. విశ్వవిద్యాలయాల విద్యార్థులను నేరుగా కలుసుకోవడం ద్వారా యువతలో చైతన్యం నింపడం మొదటి రోజు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
రెండో రోజైన 26న రాజ్యాంగ దినోత్సవం కావడం ఈ యాత్రకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముషీరాబాద్ నుంచి ప్రారంభమయ్యే రెండో రోజు యాత్ర 10.9 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, హిమాయత్ నగర్, లిబర్టీ, ఖైరతాబాద్ మీదుగా సాగి అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వద్ద ముగుస్తుంది. ఈ సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని లిబర్టీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించి, ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయనున్నారు.
చివరి రోజైన నవంబర్ 27న అమీర్‌పేట సత్యం థియేటర్ నుంచి యాత్ర మొదలై 7.7 కిలోమీటర్ల మేర సాగుతుంది. మైత్రీ నగర్, యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, ఇందిరా నగర్ మీదుగా జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ / జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద ముగుస్తుంది. ముగింపు సందర్భంగా భారీ ‘సంకల్ప సభ’ను నిర్వహించి, డ్రగ్స్ రహిత హైదరాబాద్ నిర్మాణానికి ప్రజలందరితో తుది ప్రతిజ్ఞ చేయించనున్నారు.
మొత్తానికి అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు, విద్యా సంస్థల నుంచి నివాస ప్రాంతాల వరకు సాగే ఈ 29.8 కిలోమీటర్ల పాదయాత్ర నగరవాసుల్లో సరికొత్త ఆలోచనను రేకెత్తించనుంది. డ్రగ్స్ అనే చీకటిని తరిమికొట్టి, యువత భవిష్యత్తులో వెలుగులు నింపేందుకు చేపడుతున్న ఈ తరహా ప్రజా చైతన్య కార్యక్రమాలు నేటి తరానికి ఎంతో అవసరం. ఈ ఉద్యమం కేవలం మూడు రోజుల నడకకే పరిమితం కాకుండా, ప్రతి ఇంటా డ్రగ్స్‌పై అవగాహన పెంచే నిరంతర ప్రక్రియగా మారాలని ఆశిద్దాం.







